జగన్ కొంప ముంచిన విజయసాయి.. అప్రూవర్ గా మారితే!
x
విజయసాయి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి

జగన్ కొంప ముంచిన విజయసాయి.. అప్రూవర్ గా మారితే!

విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారితే జగన్ పరిస్థితి ఏమిటీ? విజయసాయి రాజీనామాను ఎలా అర్థం చేసుకోవాలి? ఏపీని కుదిపేస్తున్న విజయసాయి రిటైర్మెంట్ ప్రకటన


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మిన వాళ్లే ఆయన కొంప ముంచేలా తయారైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కి సలాం కొట్టి జనసేన పంచన చేరారు. సొంత చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. ఆయన తల్లి విజయమ్మ కుమార్తె పక్షం చేరి కుమారుడు వైఎస్ జగన్ పై పరోక్ష విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా జగన్ కి నమ్మినబంటు అనుకుంటున్న విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అటు జగన్ ని, ఇటు వైసీపీని దెబ్బతీశారు. విజయసాయి రెడ్డి రిటైర్మెంట్ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించింది. ఆయన ప్రకటన రానున్న పెను ఉపద్రవానికి పెద్ద సంకేతంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జగన్ లండన్ లో..చంద్రబాబు ఢిల్లీలో...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ లో, రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తరుణంలో విజయసాయి రాజకీయాల రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఏదో పెద్ద మలుపు తిరగబోతున్నదనే దానికి ఈ రిటైర్మెంట్ ఓ సంకేతమని వైసీపీ నాయకులే అంటున్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన విజయసాయి రెడ్డి 2025 జనవరి 25న రాజ్యసభకు రాజీనామా చేస్తానన్నారు.
"నేను ఏ రాజకీయ పార్టీకి చేరడం లేదు. నా రాజీనామా దేనికోసం, లాభం కోసం, లేదా డబ్బు కోసం కాదని స్పష్టంగా చెబుతున్నాను. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతమైనది. ఎటువంటి ఒత్తిడి లేదా ప్రభావం లేదు," అని సాయి రెడ్డి అన్నారంటేనే దాని వెనుక ఏదో మతలబు ఉందన్నది అర్థమవుతోంది. తన భవిష్యత్ వ్యవసాయంలోనే ఉంటుందని విజయసాయి రెడ్డి చెప్పినా ఈ వయసులో ఆయన ఏమి వ్యవసాయం చేస్తారోనన్న వెటకారపు వ్యాఖ్యలు కూడా పేలుతున్నాయి.
నిజానికి విజయసాయి ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. సాయి రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ఒకే కేసులో ఇరుక్కున్న వారు. ఇద్దరూ ప్రతి శుక్రవారం ఈడీ విచారణకు హాజరైన వారు. కొందరు కాదన్నా రాజ్యసభకు విజయసాయి రెడ్డిని జగన్ ఏకగ్రీవంగా ఎన్నిక చేయించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆకస్మికంగా రిటైర్మెంట్ అనడంతో జగన్ తో సహా తామందరి బెయిళ్లు రద్దవుతాయని విజయసాయి భయపడ్డారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మరోపక్క ఆయన జగన్ పై ఈడీ పెట్టిన కేసుల్లో అప్రూవర్ గా మారతారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే జగన్ కొంప మునిగినట్టే. చంద్రబాబు మీద ఒంటి కాలి మీద లేచే విజయసాయి రెడ్డి గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. దీని వెనుక ఏముందన్నది అర్థం కావడం లేదు. చంద్రబాబుకు విజయసాయి రెడ్డి భయపడుతున్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పునరుద్ధరణపై పలువురు పార్టీ కార్యకర్తలు ఆశలు పెంచుకుంటున్న సమయంలో విజయసాయి రెడ్డి వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. పార్టీ తిరిగి కోలుకోదన్న భయాన్ని రెకెత్తించారు. పార్టీ కుదేలయ్యేలా చేశారు. జగన్ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకునేలా చేశారు. టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుందన్న దశలో సాయి రెడ్డి రాజీనామా చేయడం వైఎస్సార్ కాంగ్రెస్‌కు భవిష్యత్తు అవకాశాలు లేవని చెప్పినట్టయింది.
సాయి రెడ్డి తన పరిస్థితిని వివరిస్తూ " తాను ఏ ఇతర పార్టీకి చేరలేను, వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొనసాగడం వల్ల ప్రయోజనం లేదు" అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక న్యూస్ ఛానెల్ ప్రారంభిస్తానని ప్రకటించారు కూడా. ఇప్పుడు ఆయనే ఇక రాజకీయాల్లో కొనసాగడం వృథా అంటున్నారు.
విజయసాయి రెడ్డి రిటైర్మెంట్ ప్రకటనను ఎలా అర్థం చేసుకోవాలనే దానిపై ఇంటా బయటా తర్జన భర్జన జరుగుతోంది. సాయి రెడ్డి జగన్ కేసుల్లో రెండో నిందితుడు. ఈ కేసులు త్వరలో జెట్ స్పీడ్ లో ముందుకు రానున్నాయన్న సమాచారం ఆయనకు ఉండవచ్చు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడం ద్వారా ఉపశమనం పొందాలనే ఆశతో ఈ రాజీనామా చేసి ఉంటారా? ఇదే కారణమైతే రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవనే అనుకోవాలి.
ఇటీవల సాయి రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రశ్నించింది. కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన షేర్ల బలవంతపు బదిలీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. సాయి రెడ్డి కుమార్తె భర్త శరత్ చంద్ర రెడ్డి, మరో వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైవీ సుబ్బా రెడ్డి తదితరులు బలవంతంగా కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ ఛైర్మన్ కేవీ రావును బెదిరించారని, ఇదంతా విజయ సాయి రెడ్డి స్వీయ పర్యవేక్షణలో జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి కేవీ రావుకు తన వాటాను ఇప్పించింది. బహుశా ఇది కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో రాబోయే ముప్పుకు సంకేతంగా విజయసాయి రెడ్డి భావించి ఉండవచ్చు.
ఇక, సాయి రెడ్డి వైసీపీ అధినేత జగన్ కి ఢిల్లీలో కీలక లాబీయిస్టు. ఢిల్లీలో ఏ పని కావాలన్నా, ఎవర్ని కలవాలన్నా ఆయనే చేస్తుండేవారు. సుప్రీంకోర్టు లాయర్లను సైతం ఆయనే మాట్లాడి కేసుల్లో వాదించేలా చేస్తుండేవారు. 2016లో రాజ్యసభకు తొలిసారి నామినేట్ అయినప్పటి నుంచి, ఆయన ఢిల్లీలో జగన్‌కు ముఖ్య వ్యక్తి. నరేంద్ర మోదీ, అమిత్ షాతో అపాయింట్‌మెంట్లు కూడా విజయసాయిరెడ్డే ఫిక్స్ చేయించేవారు.
జగన్‌ పై సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, తక్షణమే విచారించాలని, జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సుప్రీంకోర్టులో త్వరలో విచారణ జరుగనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు వీళ్ల బెయిళ్ల ను రద్దు చేస్తే జగన్ పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్టే. ఈ కేసులో తాను శిక్ష నుంచి తప్పించుకునేందుకు విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారినా జగన్ కి ఇబ్బందే. ఇప్పటికిప్పుడు విజయసాయి రెడ్డి రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరమేమీ కనిపించడం లేదు. అయినా ఆయన ఆ పని చేశారంటే దీని వెనక ఏదో మతలబు ఉందనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వ్యాఖ్యానించారు.
సాయి రెడ్డి సేవలు జగన్‌కు చాలా మిస్ అవుతాయి. ఇప్పుడు ఈ రాజ్యసభ స్థానం టీడీపీకి వెళ్లనుంది. ఆశ్చర్యకరంగా, సాయి రెడ్డి ప్రకటన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన కొన్ని గంటల తర్వాత రావడం విశేషం. దీంతో జగన్‌కు సమస్యలు మరింత తీవ్రం కావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Read More
Next Story