సెకీతో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని జగన్ చాలా డీటెయిల్డ్‌గా వివరించారు.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి విద్యుత్ కొనుగోలు జరిగిన విధానాన్ని మాజీ సీఎం జగన్ మీడియాకు వివరించారు. సెకీ నుంచి 2021 సెప్టెంబరు 16వ తేదీన ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశాలను కూలంకుశంగా సెకీ వివరించింది. గుజరాత్ రాష్ట్రం నుంచి తాము అతి తక్కువ ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాం. అదే ధరకు ఏపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ విషయం వెంటనే తెలియజేయండి. అంటూ లెటర్ వచ్చింది. తాను సీఎంగా ఉన్నందున అధికారులు ఆ లేఖను తన వద్దకు తీసుకొచ్చి చూపించారు. అందులో రూ. 2.49లకు యూనిట్ ధర ఉంటుంది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు మినహాస్తాం. ఇదొక మంచి అవకాశం. ఏ విషయం మాకు వెంటనే తెలియజేయండి. అని ఆ లేఖలో ఉంది. లేఖ వచ్చిన మరుసటి రోజు మంత్రి వర్గం సమావేశం గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఒక సారి సమావేశంలో కూడా స్పెషల్ ఐటమ్ కింద అజెండాలో చేర్చాల్సిందిగా చెప్పాం.
సెప్టెంబరు 17న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ కొనుగోలుకు సంబంధించి ఒక కమిటీ వేసి, సాధ్యా సాధ్యాలపై రిపోర్టు తీసుకుంటే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయం మేరకు కమిటీ వేయాలని అధికారులను ఆదేశిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని జగన్ తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను 40 రోజుల్లో అంటే.. అక్టోబరు 25వ తేదీనా అందజేసింది. తర్వాత అక్టోబరు 28న జరిగిన మంత్రివర్గంలో సెకీ నుంచి కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నాం. ఇది ఏ ఒక్కరి అభిప్రాయమో కాదు. ప్రభుత్వంలోని అందరి అభిప్రాయం. కేవలం రూ. 2.49లకు 25 ఏళ్ల కాలం విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటూ విద్యుత్ కొనుగోలుకు జరిగిన ప్రక్రియను జగన్ వివరించారు. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అభినందించి, శాలువాతో సన్మానించాల్సింది పోయి రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ విమర్శలకు దిగుతోందన్నారు. విషయాలు తెలుసుకోకుండా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు, టీవీ5 టీవీ చానల్ ఎవరికి తోచింది వారు చెబుతూ ఒప్పందాన్ని తప్పని ప్రజలకు ప్రచారం చేడయం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని సెకీ ఒక మంచి అవకాశాన్ని ఏపీకి ఇచ్చింది. ఇది అందరికీ రాదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని, విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా ఏపీని తీర్చి దిద్దాలని ఈ ఒప్పందం చేసుకున్నట్లు జగన్ వివరించారు.