మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే డిమాండ్ మరో సారి తెరపైకి వచ్చింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఇటీవలే దీనిపై వ్యాఖ్యానించారు.
విభజన సమస్యలు పరిష్కరించాలి
రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారం కాలేదు
ఉమ్మడి రాజధానిగా ఉంటేనే సమస్యలు పరిష్కారం
ఉమ్మడి రాజదాని కోరుతూ హైకోర్టులో పిటీషన్
G. Vijaya Kumar
హైదరబాద్‌ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, ఆ మేరకు ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ప్రతివాదులుగా
హైకోర్టులో దాఖలైన పిటీషన్‌లో కేంద్ర, రాష్ట్ర అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన కార్యదర్శిని ప్రతి వాదులుగా చేర్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నాటి కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించడంతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్ల కాలం పూర్తి కావస్తున్నా నేటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలి పోయిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరారు. 2034 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోర్టుకు విన్నవించారు. ఆ మేరకు చట్ట రూపకల్పన చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థించారు.
విభజన జరిగి 10ఏళ్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి సుమారు పదేళ్లు కావస్తోంది. జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తి అవుతాయి. రాష్ట్ర విభజన సమయంలో హైదరబాద్ నగరాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాజధానిగా నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు విభజన చట్టంలో కూడా పొందుపరిచింది. దీని ప్రకారం వచ్చే జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తి అవుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి రాకపోవడం, అంగీకారం లేక పోవడం, పరస్పర సహకారం కొరవడటంతో ఉమ్మడి ఆస్తుల విభజన అంశాలు వివాదాలకు దారి తీశాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంలోను, చట్టపరమైన విధులు నిర్వర్తించడంలోను కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, దీంతో వివాదాలు నేటికీ పరిష్కారానికి నోచుకో లేదని వివరించారు. ఇలా పరిష్కారం కానీ సమస్యలను పరిగణనలోకి తీసుకొని మరో పదేళ్ల పాటు అంటే 2034 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని కొనసాగించే విధంగా చట్టం తీసుకొని వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్‌లో కోరారు.
ప్రధాన అంశాలు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులతో పాటు తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలు, కార్పొరేషన్‌ల ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదని ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
విభజన అంశాలు
పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో కంపెనీలు, కార్పొరేషన్‌లు కలిపి మొత్తం 91 ఉన్నాయని కోర్టుకు తెలిపారు. వీటిల్లో 90 సంస్థలు, కార్పొరేషన్‌ల అంశాలలో నిపుణుల కమిటీ ఒకే విధానాన్ని అనుసరించలేక పోవడంతో ఆ సిఫార్సులను ఇరు రాష్ట్రాలు అంగీకరించ లేదు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించక పోవడంతో విభజన సమస్యలకు సంబంధించిన వివాదాలు కోర్టుల గడపలు తొక్కాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఉమ్మడి రాజధానిగా కోరే హక్కు
అధికారికంగా హైదరబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉన్న గడువులోనే ఈ వివాదాలకు పరిష్కారం చూపాల్సి ఉందని, ఒక వేళ అలా పరిష్కారం కాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా విభజన హామీలు అమలు కాలేదు కాబట్టి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని కొనసాగించాలనే కోరే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని పేర్కొన్నారు.
Next Story