కొవ్వూరు టీడీపీలో చిచ్చు..
టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుతో ఆంధ్ర ఎన్నికలు వేడెక్కడంతో పాటు పార్టీల్లో అసమ్మతి సెగలు వెలువడుతున్నాయి. టికెట్ దక్కని నేతలు కొందరు పార్టీని వీడుతుంటే, మరికొందరు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామంటూ పార్టీపై తమకున్న విశ్వాసాన్ని చాటుకుంటున్నారు. పొత్తు కారణంగా దాదాపు మూడు పార్టీల్లో అసమ్మతి మంటలు భగ్గుమంటున్నాయి. ఈరోజు టీడీపీ తన రెండో జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో కొవ్వూరు టీడీపీలో అసమ్మతి మంటలు చిచ్చులా మారాయి. రెండో జాబితాలో కొవ్వూరు టికెట్‌ను టీడీపీ అధిష్టానం ముప్పిడి వెంకటేశ్వర రావుకు కేటాయించడంపై మాజీ మంత్రి కేఎస్ జవహర్, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులతో జవహర్ ఆందోళకు దిగారు. ఇందులో భాగంగా కొవ్వూరు అభ్యర్థిగా జవహర్‌ను ప్రకటించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.
ఇండిపెండెంట్‌గా పోటీ
టీడీపీ నుంచి తనకు కొవ్వూరు టికెట్ దక్కపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని జవన్ వెల్లడించారు. ‘‘పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అభిమానుల కోరిక మేరకు త్వరలో జరిగే అసెంబ్లీ పోరులో నిలబడతా. అవసరం అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా సన్నద్ధం అవుతున్నా. కేడర్‌తో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాను. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యం. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే నా పోటీ ఉంటుంది’’అని స్పష్టం చేశారు.
ఎవరీ జవహర్
కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ఆయననే కేఎస్ జవహర్‌గా పిలుస్తారు. ఆయన 2014లో టీడీపీ తరపున కొవ్వూరు నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై విజయం సాధించి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2017లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మరోసారి కొవ్వూరు నుంచి పోటీ చేయాలని భావించిన ఆయనకు టీడీపీ భారీ షాక్ ఇచ్చింది. కొవ్వూరు నియోజకవర్గం టికెట్‌ను వెంకటేశ్వరావుకు అందించింది. దీంతో ఆగ్రహించిన ఆయన అవసరం అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు.