న్యాయపోరాటానికి రెడీ అంటున్న ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌కు కూటమి సర్కార్ భారీ ఝలక్ ఇచ్చింది. కమిషన్ చైర్‌పర్సన్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌కు కూటమి సర్కార్ భారీ ఝలక్ ఇచ్చింది. కమిషన్ చైర్‌పర్సన్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె పదవీ కాలం ఆగస్టులోనే ముగిసిందని, కానీ ఇంకా ఆమె కొనసాగుతుందని గుర్తు చేసింది. ఈ మేరకు వెంటనే ఆమెను ఏపీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి నుంచి తొలగించాలంటూ సంబంధిత శాఖకు జీవో జారీ చేసింది. ఇప్పటికే పదవికి రాజీనామా చేయాలని పేర్కొంటూ.. ఏపీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల లక్ష్మికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మహిళ కమిషన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జెత్వానీ కేసును సుమోటోగా తీసుకోలేదన్న కారణంగానే మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కొందరు భావిస్తున్నారు. జెత్వానీ కేసులో మహిళా కమిషన్‌కు ప్రభుత్వానికి మధ్యా కాస్తంత చెడింది. ఆ కోపంతోనే ఇప్పడు ఈ జీవో విడుదల చేసి ఉంటుందని కొందరు అంటున్నారు. కానీ తనను ఏపీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి నుంచి తొలగించడంపై న్యాయపోరాటం చేస్తానని ఆమె తెలిపారు.
అసలేమైంది..
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు సుమోటోగా తీసుకోవడానికి ఏపీ మహిళ కమిషన్ నిరాకరించింది. జెత్వాని కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని గజ్జల లక్ష్మీ ప్రకటించారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలను టీడీపీ నేతలు కూడా తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల మహిళల విషయంలో తాము జోక్యం చేసుకోవమని, జెత్వాని.. మహారాష్ట్ర మహిళ కమిషన్‌ను ఆశ్రయించాలని గజ్జల లక్ష్మీ ఉచిత సలహా కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఉన్నత చదువులు చదివిన జెత్వాని.. ముందుగానే మహిళ కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదని గజ్జల లక్ష్మీ ఎదురు ప్రశ్నలు సంధించారు. ఈ విషయాలకు సంబంధించే ప్రభుత్వం, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సహా సభ్యుల మంది సంబంధాలు కాస్తంత చెడాయి. అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు గజ్జల లక్ష్మీని తొలగించాలంటూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చిందన్న వాదన తెగ వినిపిస్తోంది. కాగా ఈ విషయంపై గజ్జల లక్ష్మీ తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రోజురోజుకు బాబు ఉన్మాదిలా మారుతున్నారని విరుచుకుపడ్డారు.
మహిళా కమిషన్‌లో జరిగిందిది..
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాసిరెడ్డి పద్మను.. ఏపీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. 26 ఆగస్టు 2019న ఆమె నియామకం పూర్తయింది. దీంతో ఆమె పదవి కాలం 25 ఆగస్టు 2024 వరకు కొనసాగనుంది. కానీ 2024 మార్చిలో ఏపీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి నుంచి వాసిరెడ్డి పద్మను తొలగించింది ప్రభుత్వం. మార్చి 4న పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె స్థానంలో గజ్జల వెంకట లక్ష్మీ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే గజ్జల లక్ష్మి పదవీ కాలం ఆగస్టు 25తో ముగిసిందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.