పెద్దిరెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తా అంటున్న కిరణ్
x
కిషోర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి

పెద్దిరెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తా అంటున్న కిరణ్

మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం చిన్నదని వ్యాఖ్యానించారు.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని మాజీ సీఎం, బీజేపీ జాతీయ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కాంట్రాక్టర్‌తో మొదట ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన పెద్దిరెడ్డి, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండి ల్యాండ్ మైన్ దోపిడీకి తెరలేపారని నిప్పులు చెరిగారు. అడ్డొచ్చిన వారిపై అక్రమంగా కేసులు బనాయించి, వేధింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొదటిసారి శనివారం మధ్యాహ్నం బెంగళూరు మీదుగా చీకలబైలు వద్దకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.

సొంత ఊరు కలికిరిలో శనివారం సాయంత్రం ఆయన మదనపల్లి టిడిపి అభ్యర్థి షేక్ షాజహాన్ బాషా, తంబళ్లపల్లె టిడిపి అభ్యర్థి దాసరపల్లి జయచంద్ర రెడ్డి, రాయచోటి టిడిపి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్వయానా తమ్ముడు, పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బినామీ కాంట్రాక్టర్లతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారన్నారు. తొలుత ప్రభుత్వ ధనాన్ని ఆ తర్వాత ప్రజల ధనమైన పాలు, మామిడి పండ్లు దోచుకున్నారని, భూకబ్జాలు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేశారనీ ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తానని ఆయన హెచ్చరించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నది

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతి, అక్రమాలు, మంత్రి పెద్దిరెడ్డి దోపిడీ, కుంభకోణాలతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం మంచు ముక్క లాంటిదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై స్పందించాలని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అవినీతి అక్రమాల్లో ఏమాత్రం తక్కువ తినలేదని ఆరోపించారు.

సీబీఐ విచారణ జరిపించాలి

తిరుపతి ఉప ఎన్నికల అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని బిజెపి నేత కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించిన తీరు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనే కంటే, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారని అనడం సరైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క నియోజకవర్గంలో 35 వేల ఎపిక్ కార్డులు నకిలీవి తయారు చేశారంటే ఇది చాలా తీవ్రమైన నేరమని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని, ఇది చాలా ఘోరమైన తప్పిదమని ఆయన అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని, ఇందుకోసం కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి తన వంతు బాధ్యత నిర్వహిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

సోదరులను కలిపిన ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికల పుణ్యం. అన్నదమ్ములు ఇద్దరు వేరువేరు పార్టీల్లో ఉన్నారు. ఆ రెండు పార్టీలు కూటమిలో ఉండడం వారికి కలిసొచ్చింది. పదేళ్ల తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. అన్న కుమార్ రెడ్డిని ఘనంగా స్వాగతించిన కిషోర్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో కూడా పక్కనే కూర్చున్నారు. వారిద్దరి కలయిక చూసి నియోజకవర్గ ప్రజలు, వారి అభిమానులు, మద్దతుదారులు సంబరపడిపోయారు.

ఎడ మొహం పెడ మొహం

గత పదేళ్లుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎడమొఖం, పెడమొఖంగా ఉన్నారు. వేళ్ళ మీద లెక్కించే స్థాయిలోనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు ప్రాంతానికి వచ్చారు. కలికిరి మండలం నగిరి పల్లెలోని నివాసానికి వెళ్లకుండా, వాల్మీకిపురంలోని అతిథి గృహం లేదా పీలేరు అతిథి గృహంలో బస చేసేవారు. కొంతమంది వచ్చి అక్కడే కలిసేవారు. ఈ ఎన్నికలు వారిద్దరిని కలిపాయని చెప్పవచ్చు. ఎలాగంటే.. అన్నదమ్ముల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా, ఇదే సెగ్మెంట్లో ఉన్న పీలేరు శాసనసభ స్థానం నుంచి ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి.. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

దీంతో బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన మదనపల్లి వద్దకు చేరుకున్న అన్న కిరణ్ కుమార్ రెడ్డికి అభిమానులు మద్దతుదారులు కూటమి శ్రేణులతో కలిసి వెళ్లిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతించారు. ఆయన వెంటే భారీ ర్యాలీగా సొంత మండలం కలికిరి వరకు చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో వారిద్దరూ పక్కపక్కనే కూర్చుని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్నదమ్ములు ఇద్దరి కలయిక ఓ హాట్‌టాపిక్ అనే కాదు. ఈ ఎన్నికల్లో రాజకీయం కూడా రసవత్తరంగా మారడానికి బాటలు పడ్డాయని విశ్లేషిస్తున్నారు.

Read More
Next Story