ప్రజల గొంతుక వినిపిస్తా.. అంటున్న జర్నలిస్ట్..
x
Source: Twitter

ప్రజల గొంతుక వినిపిస్తా.. అంటున్న జర్నలిస్ట్..

ఓ దళిత జర్నలిస్ట్ టీడీపీ అభ్యర్థిగా రాజకీయ క్షేత్రంలోకి దిగారు. ప్రజలు ఆశీర్వదిస్తే శాసనసభలో ప్రజల గొంతుక వినిపిస్తానని మురళీమోహన్ అంటున్నారు..


ఎస్. ఎస్.వి. భాస్కర్ రావ్



తిరుపతి: చిత్తూరు జిల్లాలో ఓ జర్నలిస్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారు. గురువారం ప్రకటించిన రెండో జాబితాలో డాక్టర్ కలికిరి మురళీమోహన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. "ఇప్పటివరకు జర్నలిస్టుగా సమాజంలోని సమస్యలు అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి పనిచేశా. నన్ను ప్రజలు ఆశీర్వదించి శాసనసభకు పంపితే .. పేదల కష్టాలు తీర్చడానికి శ్రమిస్తా" అని డాక్టర్ కలికిరి మురళీమోహన్ అంటున్నారు.


"పేదరికంలో పుట్టడం. కష్టాలను పాఠాలుగా చదువుకోవడం. హాస్టల్ జీవితం. వివక్ష, పొగడ్తలు, అవమానాలు అన్నిటిని ఆస్వాదించాను" అని మురళీమోహన్ ఫెడరల్ న్యూస్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గొడుగుచింత అనే మారుమూల గ్రామంలో పేద దళిత రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఏమంటున్నారంటే.. "నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న. జీవితం ఎలా ఉంటుందో చూశా. కష్టాలు తోడునీడుగా ఉన్నాయి. అయినా చదువుకోవాలనే నా లక్ష్యం ముందు అవేమీ నాకు పెద్ద సమస్యగా అనిపించలేదు" అంటున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంసీజే తో పాటు కామర్స్ విభాగంలో డాక్టర్ మురళీమోహన్ పీహెచ్డీ కూడా చేశారు.


" వామపక్ష భావాలతో ఎదిగిన నేను, విద్యార్థుల ఉపకార వేతనాల పెంపుదల కోసం సాగించిన పోరాటాలు మరిచిపోలేను. పోలీసులు విపరీతంగా కొట్టిన సంఘటన ఇంకా మనసులోని చెరిగిపోలేదు." సామాన్య దళిత రైతు కూలీ కుటుంబంలో జన్మించిన నాకు కష్టాలు ఎలాంటివో తెలుసు, చదువుకోవడం నాకు ఫ్యాషన్.. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తిరిగి చూడకుండా చదువులో నా లక్ష్యాన్ని సాధించుకున్న. విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడే నా మదిలో మెదిలిన ఆలోచన ఒకటే..



"నేను.. నా సమాజం ఎదుర్కొన్న కష్టాలను నా వంతు కర్తవ్యంగా బయటకు తీసుకురావాలని భావించా అందుకు జర్నలిజం కోర్సు ఎంచుకున్నా. నా ఆశయానికి తిరుపతిలో సీనియర్ జర్నలిస్ట్ రామాపురం రాజేంద్ర ఊపిరి పోసి క్యాంపస్ రిపోర్టర్‌గా అవకాశం కల్పించారు. అక్కడ ఓనమాలు దిద్దుకున్నా" తర్వాత.. ఓ ప్రధాన పత్రికలో సబ్ ఎడిటర్, ఆల్ ఇండియా రేడియోలో రిపోర్టర్‌గా.. అవకాశం వచ్చింది. అక్కడ నేర్చుకున్న పాఠాలతో ప్రధాన టీవీ ఛానల్ కు తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఇన్‌చార్జిగా పనిచేశా. ఓ జర్నలిస్ట్ సంఘానికి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన జర్నలిస్ట్ సహచరుల సహకారం మరిచిపోలేని జర్నలిస్టు జీవితం ప్రారంభించడానికి దారి తీసిన నేపథ్యాన్ని డాక్టర్ మురళీమోహన్ వివరించారు.


"నా పనితీరు నేపథ్యం నిబద్ధత" గమనించిన టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు నాకు పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అందుకు టిడిపిలో సీనియర్ నాయకులు తోడ్పాటు అందించారని ... "ఇది నాకు లభించిన అవకాశం కాదు. జర్నలిస్టు సమాజానికి దక్కిన గౌరవం" గా నేను భావిస్తా. అని డాక్టర్ కలికిరి మురళీమోహన్ అంటున్నారు. నేను గెలిస్తే జర్నలిజంలో ఏ వర్గాల కోసం నా కలాన్ని ఉపయోగించానో..ఆ వర్గాలతో పాటు జర్నలిస్టు సంక్షేమానికి కూడా ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని ఆయన అంటున్నారు.


" నా పూతలపట్టు నియోజకవర్గమే కాదు.. అన్ని సామాజిక రాజకీయ అంశాలపై అవగాహన ఉంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా" అని ఆయన అంటున్నారు. సమాజం పట్ల అవగాహన పెంచుకోవడానికి జర్నలిస్టు వృత్తి ఊతమిచ్చింది. కలం కార్మికులు పడే కష్టాలు, బాధలు నాకు తెలుసు. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా నా వంతు ఏమి చేయాలనేది కూడా కచ్చితంగా చేస్తా" ఆయన తన భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా వివరించారు. ఎన్నికల్లో ఈయన భవిష్యత్తును ఓటర్లు ఎలా నిర్ణయిస్తారు అనేది ఆ రోజు కోసం వేచి చూద్దాం. ఒక జర్నలిస్టుకు మంచి అవకాశం దక్కింది. దీనిపై కొందరు జర్నలిస్ట్ నాయకులు ఎలా స్పందిస్తున్నారంటే..



" జర్నలిజం అనే పవిత్రమైన వృత్తిలో మంచి రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే", అని జి ఆంజనేయులు అంటున్నారు. జర్నలిజం లో ఏ విలువలకైతే ప్రాధాన్యత ఇచ్చారో.. సంస్కరణలు తీసుకురావడంలో కూడా రాజకీయ నాయకులుగా మారిన వారు ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆయన అభిప్రాయం‌’’ అని ఆంజనేయులు అంటున్నారు. రాజకీయాల్లోకి జర్నలిస్టు రావడం అనేది ఆ వృత్తికే గర్వకారణం. అని మరో జర్నలిస్టు సంఘం నేత ఏ గిరిధర్ అంటున్నారు. ఓ జర్నలిస్టు ఎమ్మెల్యేగా ఎన్నికైతే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. "డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులకు గురై, పోటీ చేసే స్థాయికి ఎదిగారు" అని తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు రామాపురం రాజేంద్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎంసీఏ చేసే సమయంలోనే డాక్టర్ మురళీమోహన్ నా దగ్గర రిపోర్టర్ గా పనిచేశారు. అని రాజేంద్ర గత స్మృతులను నెమరు వేసుకున్నారు.


జర్నలిజం నుంచి ... ఇంకొందరు..


రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన కాలువ శ్రీనివాసులు ఎంపీగా, రాయదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ఐ అండ్ పి ఆర్ శాఖ మంత్రిగా కూడా పనిచేసే అరుదైన అవకాశం దక్కింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఓ ప్రధాన పత్రికలో సబ్ ఎడిటర్ గా కొంతకాలం పని చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూడా ఓ జర్నలిస్ట్. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జర్నలిజానికి అనుబంధంగా ఉన్న ప్రకటనల విభాగం నుంచి వచ్చారు.



Read More
Next Story