ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు. పాల్గొన్న మంత్రులు, అధికారులు.


మంచి పాలనకు ఐఏఎస్‌లే బాధ్యత తీసుకోవాలని, పాలన అంటే ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ఉండాలని.. ఆ మాట దేశమంతా అనుకోవాలని, అందుకు ఐఏఎస్‌ లే బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బుధవారం కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి గూగుల్‌ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మూలాలనే పెకలించేసింది. భారీగా అవకతవకలకు పాల్పడింది. ప్రజలు మనపై బృహత్తర బాధ్యత పెట్టారు. మేము పాలసీలు మాత్రమే తీసుకురాగలం. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్‌లే అని అన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు విక్రయం మొదలు.. ఎన్నో పనులు చేయించారు. ఇంతమంది ఐఏఎస్‌లు ఉండీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది. నేడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. రాళ్లు, రప్పలున్న ప్రదేశంలో చంద్రబాబు సైబరాబాద్‌ లాంటి నగరాన్ని çసృష్టించారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం.

మీ అందరి సహకారంతో ప్రజా పాలన అందించాలని మేము కోరుకుంటున్నాం. కాకినాడ పోర్టు నుంచి మూడు చెక్‌ పోస్టులు పెట్టినా బియ్యం అక్రమ రవాణ ఆగడం లేదు. సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్‌ నుండి వచ్చిన ఉగ్రవాదుల వలన 300 మంది ప్రాణాలు పోయాయి. మంత్రి మనోహర్‌ తనిఖీలకు వెళితే సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా? అని ప్రశ్నించారు. పాలన అంటే ఏపీలో లాగా ఉండాలని దేశమంతా అనుకోవాలి. అందుకు ఐఏఎస్‌ లే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
Next Story