ఆంధ్రప్రదేశ్‌లో బాపట్ల పార్లమెంట్‌ స్థానానికి ఒక ఐపిఎస్‌.. ఒక ఐఏఎస్‌.. ఒక సామాన్యుడు పోటీ చేస్తున్నారు. ఇద్దరి మేధావుల సత్తా ఏమిటి..ఆ సామాన్యుడి బలమేంటి?


జి విజయ కుమార్

బాపట్ల పార్లమెంట్‌ స్థానం నుంచి మాజీ ఐఏఎస్‌ అధికారి జేడీ శీలం కాంగ్రెస్‌ నుంచి, మాజీ ఐపిఎస్‌ అధికారి టి కృష్ణప్రసాద్‌ టీడీపీ నుంచి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నందిగం సురేష్‌ పోటీ పడుతున్నారు. మిగిలిన ఎంత మంది పోటీలో ఉన్నా ఈ మూడు పార్టీల మధ్యనే త్రిముఖ పోటీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణప్రసాద్‌ నాన్‌ లోకలనే భావన ఓటర్లలో ఉంది. జేడీ శీలం కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీలో ఉంటున్నా రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్సే అనే భావన కూడా ఇంకా ఓటర్ల నుంచి పూర్తిగా పోలేదు. గత ఎన్నికల్లో నందిగం సురేష్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. అయినా తిరిగి 2024 ఎన్నికల్లో నందిగం సురేష్‌ వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. వ్యక్తులుగా పరిశీలిస్తే కాంగ్రెస్, ఎన్డీఏ తరపున పోటీలో ఉన్న వారిద్దరు మేధావి వర్గానికి చెందిన వారు. వైసీపీ నుంచి పోటీలో ఉన్న సురేష్‌ ఉన్నత విద్యావంతుడు కాకపోయినా పదేళ్లుగా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడైన సురేష్‌ తన జెండాను రెండో సారి ఎగురవేస్తారా లేక కాంగ్రెస్, టీడీపీ జెండాలు ఎగురుతాయా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. ఇద్దరు ఐపిఎస్, ఐఏఎస్‌ అధికారుల గురించి ముందుగా తెలుసుకుందాం.
ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జేడీ శీలం
కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ పడుతున్న జేడీ శీలం కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. ఎలాగైనా తన సొంత నియోజక వర్గమైన బాపట్ల పార్లమెంట్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీకి గిఫ్ట్‌గా పార్లమెంట్‌ను ఇవ్వాలని ఆయన కన్న కలలు నేటికీ నెరవేరలేదు. అయినా పట్టు విడవ లేదు. 1999లో ఐఏఎస్‌కు వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న జేడీ శీలం అదే సంవత్సరంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న దగ్గుబాటి రామానాయుడుపై ఓడిపోయారు. అప్పటి నుంచి ఎలాగైన తన విజయకేతనాన్ని బాపట్లలో ఎగురవేయాలనే పట్టుదల మాత్రం సడలలేదు. తిరిగి 2024 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్‌ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కేంద్ర కాంగ్రెస్‌ కమిటీ కల్పించింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని పదేళ్లుగా ప్రజలు తిరస్కరించారు. రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి ఎన్నికల రంగంలోకి దిగింది. ఐఏఎస్‌ కావాలని జేడీ శీలం కలలు కన్నారు. యుపిఎస్సీ పరీక్షలు రాసి తొలి సారి 1983లో ఐపిఎస్‌కు ఎంపికయ్యారు. అయితే ఐఏఎస్‌పై ఉన్న మక్కువతో మరో సారి యుపిఎస్సీ పరీక్షలు రాసి 1984లో ఐఏఎస్‌కు సెలెకై్ట అనుకున్నది సాధించారు. కర్నాటక క్యాడర్‌లో నియమితులయ్యారు. వివిధ హోదాల్లో పని చేసిన ఆయన అప్పట్లో కర్నాటకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్‌ఎం కృష్ణ వద్ద రాజకీయ కార్యదర్శిగా కూడా పని చేశారు. రాజకీయాలంటే ఏమిటో వంటబట్టించుకున్నారు. జేడీ శీలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసునూరులో జన్మించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుకున్నారు. కొంత కాలం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. 1999లో బాపట్ల నుంచి ఓడిపోయిన తర్వాత 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం యుపిఏ ప్రభుత్వంలో కేంద్రంలో ఆయనకు మంత్రి పదవినిచ్చి గౌరవించింది.
తెలంగాణ నుంచి టి కృష్ణప్రసాద్‌
కొత్తగా ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన టి కృష్ణప్రసాద్‌ మాజీ ఐపిఎస్‌ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన తెలంగాణకు వెళ్లారు. అక్కడ డీజీపి క్యాడర్‌లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత రాజకీయాలపై ఉన్న ఆసక్తితో బిజెపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధిగా పని చేస్తుండగా బాపట్ల నుంచి టీడీపీ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. వెంటనే బిజెపీకి రాజీనామా చేసి టీడీపిలో చేరారు. కృష్ణప్రసాద్‌ 1987 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి. 2020లో పదవీ విరమణ చేశారు. కృష్ణప్రసాద్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ చేశారు. ఉన్నత విద్యావంతుడైన కృష్ణప్రసాద్‌కు సామాజిక అంశాలపై మంచి అవగాహన ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మాణంలో కృష్ణప్రసాద్‌ కీలక పాత్ర పోషించారు. నాటి ఏపిఐఐసీ వీసీ, ఎండిగా ఉన్న కృష్ణప్రసాద్‌ హైటెక్‌ సిటీ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయింపులు చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. లిడ్‌ క్యాప్‌ కార్పొరేషన్‌ ఏర్పాటులో కూడా కీ రోల్‌ పోషించారు. అలా చంద్రబాబుతో కృష్ణప్రసాద్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో సీటు వచ్చినందున తనకు అనుకూలంగా ఉంటుందని ఆశాభావంతో ఉన్నారు. కృష్ణప్రసాద్‌ తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పేరున్న రాజకీయ నాయకురాలు మాజీ ఎమ్మెల్సీ శమంతకమణికి అల్లుడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణప్రసాద్‌ను బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని ఓటర్లు ఎలా ఆదరిస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది. బాపట్ల పార్లమెంట్‌ ఎస్సీ రిజర్వుడుగా మారిన తర్వాత మొదటి సారిగా 2009లో పనబాక లక్ష్మి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆమె భర్త పనబాక కృష్ణయ్య మాజీ ఐఆర్‌టీఎస్‌ అధికారి కావడం విశేషం. ఆమెపై పోటీ చేసిన శ్రీరామ్‌ మాల్యాద్రి కూడా మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి. అయితే ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.
రెండో సారి రంగంలో సురేష్‌
సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చి అసాధారణ వ్యక్తిగా రాజకీయాల్లో బలపడిన సురేష్‌ రెండో సారి బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులివురూ సీనియర్లు. రాజకీయాల్లో తలపండిన వారు. అయినా తన వరకు తాను ప్రజల్లోకి దూసుకెళ్తూ వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే తనకు సర్వమని చెప్పుకుంటూ ప్రచార భేరీ మోగించారు. హైస్కూల్‌ అనంతరం విద్యకు స్వస్తి చెప్పిన సురేష్‌ ఫొటో గ్రాఫర్‌గా విజయవాడలో ఉండేవారు. సురేష్‌ స్వగ్రామం గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెం. అమరావతి రాజధాని నిర్మాణానికి జరిగిన భూ సమీకరణకు వ్యతిరేకంగా వైసీపీ తరఫున పోరాడిన వ్యక్తుల్లో ప్రముఖుడు. ఈ పోరాటంలో అరెస్ట్‌ అయ్యారు. ఆయన పోరాట పటిమను పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ సురేష్‌కు బాపట్ల ఎంపీ స్థానం కేటాయించి.. గెలిపించి పార్లమెంట్‌కు పంపారు.
Next Story