అందుకే పవన్‌ మహా సూర్య నమస్కారాలకు వెళ్లలేదా? కొన్నాళ్లుగా అధికార పార్టీ నేతల్లో అదే సెంటిమెంట్‌. అదేంటో చూద్దాం..

అందాల అరకు అందరినీ రా రమ్మంటుంది. తన అందచందాలతో అలరిస్తుంది. నిత్యం వేలాది మంది పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే ఓ సెంటిమెంట్‌ అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులను మాత్రం భయపెడుతోంది. వస్తే వచ్చారు గాని సభలు, సమావేశాల్లో పాల్గొన వద్దని హెచ్చరిస్తోంది.

ఎంతటి కాకలు తీరిన రాజకీయ నాయకుడికైనా పదవి పోతుందంటే భయం వేస్తుంది. పోతే పోనీలే అనే సాహసం చేయలేరు. అధికారాన్ని చెలాయించాలంటే పదవే అవసరం. అలాంటి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. కష్టపడి తెచ్చుకున్న పదవులను పోగొట్టుకోవడానికి ఎవరూ సిద్ధపడరు. అసలే సెంటిమెంట్లకు తలొగ్గే రాజకీయ నాయకులు పదవీ వియోగం అంటేనే బెంబేలెత్తిపోతుంటారు. అలాంటి బెంబేలెత్తించే సెంటిమెంట్‌ అరకు లోయకు ఉంది. అరకులోయలో సభలు పెట్టి, అక్కడే ఆ రాత్రి బస చేసిన ముఖ్యమంత్రులు, మంత్రులు ఆ తర్వాత పదవీచ్యుతులవుతున్నారన్న సెంటిమెంటు చాన్నాళ్లుగా ఉంది. అది నిజమో, కాదో తెలియదు కానీ.. ఆ సెంటిమెంటును కాదని అధికారంలో ఉన్న పెద్దలు అరకులో సభలు, సమావేశాలు పెట్టేందుకు భయపడి పోతున్నారు. చాలా ఏళ్లుగా ఆ మూఢ నమ్మకం సజీవంగానే ఉంది. అదంతా వట్టిదే అని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలను సొంత పార్టీ నేతలు చెవిని వేస్తుండడంతో మనకెందుకులే అంటూ అరకులో మీటింగ్లు పెట్టడం లేదు. ఇలా ప్రచారంలో ఉన్న వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే.. 1984లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పదవీ చ్యుతుడు కావడానికి కొన్నాళ్ల ముందు అరకులో నైట్‌ హాల్ట్‌ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగి పోవలసి వచ్చింది.

2004 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకుకు సమీపంలోని ఘాట్‌ రోడ్డులో హెయిర్‌ పిన్‌ బెండ్‌ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చారు. అనంతరం ఆయన అరకులో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అలాగే 2012 జనవరిలో అరకు కేంద్రంగా మినీ అసెంబ్లీని నిర్వహించారు. అక్కడ మూడు రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్యేలందరికీ స్టడీ టూర్‌ పేరిట అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి అప్పటి అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నల్లారి కిరణకుమార్రెడ్డి హాజరయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆయన సీఎం పదవిని కోల్పోయారు. అలాగే 2015 అక్టోబరులో అరకులో జరిగిన ప్రపంచఆదివాసీ దినోత్సవ సభకు సీఎంగా చంద్రబాబు హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. అలాగే రావెల కిషోర్బాబు మంత్రిగా ఉన్న సమయంలో అరకులో బస చేశారు. ఇలా బస చేసిన నెల రోజుల తర్వాత ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వీటన్నిటినీ ఉదాహరణలుగా చూపడంతో ఒక్కసారి కూడా అరకులో అడుగు పెట్టలేదని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.

తాజాగా పవన్‌ కల్యాణ్‌ పై చర్చ..

ఇదంతా ఇప్పడు ఎందుకంటే.. అరకులో సోమవారం సాయంత్రం 20 వేల మందికి పైగా గిరిజన విద్యార్థినీ విద్యార్థులతో మహా సూర్య వందనం పేరిట సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమం జరగకపోవడంతో దీనిని గిన్నిస్‌ బుక్లో నమోదవుతుందని అధికారులు ముందుగా ప్రకటించారు. అందుకోసం గిన్నిస్‌ ప్రతినిధులు కూడా వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఐదు నెలల నుంచి ఈ పిల్లలకు తర్ఫీదునిచ్చింది. రెండు రోజుల పాటు ‘అడవి తల్లి బాట’ పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం మధ్యాహ్నం ఆ జిల్లాలోని డుంబ్రిగూడ మండలంలో చేపట్టిన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాటిని ముగించుకుని సాయంత్రం అరకు చేరుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఈ ప్రతిష్టాత్మక మహా సూర్య వందనం కార్యక్రమంలో పాల్గొంటారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన హాజరు కాకుండా అక్కడకు కూతవేటు దూరంలో ఉన్న తాను బస చేసిన రైల్వే శాఖ అతిథి గృహంలోనే ఉండిపోయారు.
అయితే తొలుత పవన్‌ కల్యాణ్‌ సూర్య నమస్కారాల కార్యక్రమానికి వెళ్లడానికి సుముఖత చూపినప్పటికీ స్థానిక పార్టీ శ్రేణులు ఆయనను వారించినట్టు తెలుస్తోంది. గతంలో అరకు సభలు, సమావేశాల్లో పాల్గొని, రాత్రి బస చేసిన ముఖ్యమంత్రులు, మంత్రులు పదవీ చ్యుతులైన వైనాన్ని పూసగుచ్చడంతో ఆయన అటు వైపు వెళ్లే సాహసం చేయలేకపోయారని చెప్పుకుంటున్నారు. ‘అరకు సెంటిమెంటు ఎంత వరకు నిజమో తెలియదు గాని.. అక్కడ మీటింగ్‌ పెట్టి రాత్రి బస చేస్తే కొన్నాళ్లకు పదవులు పోతాయన్న నమ్మకం ఈ ప్రాంతంలో చాలా మందికి చాన్నాళ్ల నుంచి ఉంది’ అని అరకుకు చెందిన మురళీకృష్ణ అనే ఓ రాజకీయ నాయకుడు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు. ఇలా అందరికీ ఆహ్లాదాన్ని పంచే అరకు అధికారంలో ఉన్న అమాత్యులకు మాత్రం పదవీ వియోగ భయాన్ని కలిగిస్తోంది. అయితే అధికారంలో ఉన్న వారికే తప్ప ప్రతిపక్షంలో ఉన్న వారికి మాత్రం ఆ బెంగ లేదు. వారెలాగూ అధికారంలో లేరు కాబట్టి వారికి పదవి పోతుందన్న భయం లేకపోవడం కొస మెరుపు!
Next Story