TTD| భాస్కర్ కంటపడితే ఎంత పెద్ద పామైనా 'డాన్స్' ఆడాల్సిందే!
పాములు పట్టడమే ఆ వ్యక్తికి భుక్తి. ఇప్పటికి 18 వేల పాములు పట్టాడు. అదే పాముకాటుకు గురై కోమాలోకి వెళ్లి, కోలుకున్న టీటీడీ విశ్రాంత ఉద్యోగి జీవనశైలి ఎలా ఉందంటే..
ఏదైనా సమస్య వస్తే బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళతారు. నివాసాల వద్దకు పాము వచ్చిందనే సమాచారం తెలియగానే వెంటనే కర్రతో ప్రత్యక్షమయ్యే స్నేక్ క్యాచర్ భాస్కరనాయుడు ఆ పామును పట్టుకుంటారు. బుసలు కొట్టే నాగుపాము కూడా అతని చేతికి చిక్కగానే ఒంపులు తిరుగుతూ నాట్యమాడాల్సిందే. ఆ పామును కాసేపు ఆటలాడించి, ఆ తరు అడవిలో సురక్షితంగా వదలడం ద్వారా 'ఈ భాస్కర్ పాముల భటుడు' అయ్యారు.
సాధారణంగా పాము కనిపించగానే భయం వేస్తుంది. ఒళ్లు జలదరిస్తుంది. మనలను కాటేస్తుందోమే అని భయం ఒకపక్క. అలికిడి వల్ల తనకు ప్రమాదం ఉందేమోనని పాము కలుగులోకి దూరుతుంది. ఇది సహజం అని భాస్కర్ అంటున్నారు.
శేషాచలం అడవులు విస్తరించిన తిరుమల కొండ 10.33 చదరపు మైళ్లలో విస్తరించి ఉంది. ఇదంతా దట్టమైన అటవీప్రాంతం. వన్యప్రాణులకే కాదు. విషసర్పాలకు ఆవాసం.
స్థానికులు నివాసం ఉంటున్న కాలనీలోకి తిరుమల అడవుల్లో నుంచి పాము వచ్చింది. ఈ సమాచారం అందుకున్న. ఆరగుడుల ఎత్తున్న బక్కపలచటి వ్యక్తి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. చేతికి మాత్రమే గ్లౌజులు వేసుకుంటాడు.
ఒంపు తిరిగిన కడ్డీ అమర్చిన ఓ కర్ర చేతిలో పట్టుకుని బుసలు కొడుతున్న నాగుపామును ఆ వ్యక్తి ఒడుపుగా శాంతింపచేశాడు. మెత్తబడిన ఆ కాలునాగు.. బక్క పలచటి వ్యక్తి చేతిలోని కర్ర ఎలా తిప్పతే అలా నాట్యం చేయడం కనిపించింది. తిరుమల, అలిపిరి కాలిబాట, శ్రీవారిమెట్టు, కపిలతీర్ధం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురం ఇలా ఎక్కడైనా సరే పాములు వచ్చాయంటే భాస్కర్ నాయుడు అక్కడ ప్రత్యక్ష్యం అవుతారు. ఎక్కువగా ఇవి తిరుమలలో తరచూ కనిపించే దృశ్యాలు.
2005 నుంచి తిరుమలలో ఇప్పటి వరకు 18 వేల పాములు పట్టి, మళ్లీ అడవిలోకి వదిలిన చరిత్రను 'స్నేక్ క్యాచర్ భాస్కరనాయుడు' సొంతం చేసుకున్నారు.
పాములు పట్టడమే వృత్తిగా మార్చుకున్న భాస్కర్ నాయుడు ఒకసారి చావు అంచులు కూడా చూశారు. గుడ్డి పింజరి (రక్తపింజరిలో ఓ రకం) కాటు వేయడంతో సుమారు 22 రోజులపాటు ఆస్పత్రి పాలయ్యాడు. కోమాలోనే చికిత్స చేయించుకుని కోలుకున్నారు. అధికారులు అతనిని మళ్లీ పాములు పట్టడమే వృత్తిగా వృత్తిగా మార్చారు.
"పల్లెలో పుట్టిపెరిగాను కదా. పాములు కనిపించడం సాధారణమే. ఈ పనే నాకు వృత్తి కావడం నాకే ఆశ్చర్యంగా ఉంది" అని భాస్కర నాయుడు అంటున్నారు.
టీటీడీ అటవీ విభాగంలో పదవీవిరమణ చేసిన భాస్కరనాయుడు స్నేక్ క్యాచర్ గా మారడం వెనుక కథ ఏమిటో తెలుకుందామని మూడు రోజులుగా సాగిస్తున్న ప్రయత్నం శుక్రవారం సాధ్యమైంది. అంతకుముందు కూడా ఆయనతో ఫోన్ లో మాట్లాడుతుండగానే.. "సార్ ఫోన్ వచ్చింది. మళ్లీ మాట్లాడతా" అని కట్ చేశాడు. అంటే ఆ సమయంలో ఎక్కడో పాము ఇళ్లలోకి వచ్చిందనే సమాచారం అందడమే. ఈ రోజు కూడా 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో స్నేక్ క్యాచర్ భాస్కరనాయుడును దొరకబుచ్చుకుని మాట్లాడుతుండగానే, మళ్లీ ఫోన్ రింగ్ అయ్యింది. అంటే ఎక్కడో మళ్లీ పాము వచ్చిందనే విషయం అర్ధమైంది.
స్నూక్ క్యాచర్ కాకముందు
ఉమ్మడి చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని చిన్నగొట్టిగల్లుకు చెందిన భాస్కర్ నాయుడుది వ్యవసాయ కుంటుంబం. ఊర్లోనే పదో తరగతి, మదనపల్లెలో ఇంటర్ వరకు చదివాడు. "వ్యవసాయం లాభించడం లేదని నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నా" అని భాస్కర్ నాయుడు చెప్పారు. 1982లో టీటీడీ అటవీశాఖలో క్యాజువల్ వర్కర్గా ఉద్యోగంలో చేరిన తరువాత తిరుమలలో మొక్కలు నాటడం, నీళ్లు పోయడం వంటి పనులు చేసేవాడు. "నేను చదువుకున్నాను అని భావించిన అటవీశాఖ అధికారులు నన్ను మేస్త్రీగా నియమించి, 20 మంది వర్కర్లను కేటాయించారు" అని ఆయన చెప్పారు.
"తిరుమలలో అప్పుడు అటవీప్రాంతమే ఎక్కువగా ఉండేది. పొదలు చదును చేసే సమయంలో చిన్న పాములు కనిపించేవి. వాటిని చిన్న కర్రలు లేదా పారతో దూరంగా పడేసేవాడిని" అని పాత రోజులు గుర్తుకు చేసుకున్నారు.
"2005లో తిరుమలలో ఒక రోజు నారాయణగిరి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దడానికి చదును చేస్తున్నాం. పొదలు, చెట్లు తొలగిస్తున్నాం. అదే సమయంలో కొండచివుల బయటికి వచ్చింది. ఇక చూస్కో యాడోళ్లు ఆడ పారిపోయినారు. దగ్గిరికి పోడానికి ఎవరికీ ధైర్యం చాలలా. మా అధికారులు గమనించి, నాకు ధైర్యం చెప్పినారు. హా .. ఏమి అయితాదిలే అని ఒకడి సాయం తీసుకుని, కొండచిలువ దగ్గిరికి పోయినా. భారీ చిలువను పట్టుకుని రోడ్డుపై పడేసినా" ఆ సంఘటనే నన్ను స్నేక్ క్యాచర్ గా మార్చింది" అని భాస్కర్ నాయుడు వివరించారు.
అలా కాలం సాగుతుంటే.. క్వాజువల్ వర్కర్ గా భాస్కర్ నాయుడిని 1988లో సర్వీస్ రెగ్యులర్ చేసిన టీటీడీ అటవీశాఖ అధికారులు మజ్జూర్ గా పదోన్నతి ఇచ్చారు. అటవీ విభాగంలో ఉద్యోగం చేస్తూనే తిరుమలలో నివాసితులు ఉన్న ప్రదేశాలతో పాటు యాత్రికుల వసతి గదుల వద్ద తోపాటు తిరుపతిలోని ఆలయాలు, సిబ్బంది క్వార్టర్స్ వద్దకు పాములు వస్తే ఆయనకు పిలుపు వస్తుంది. ఇలా
అడవిలో సురక్షితంగా..
సాధారణంగా పాములు కనిపిస్తే, ఎలాగైనా వాటిని మట్టుబెట్టడానికే చూస్తాం. కానీ, భాస్కర్ నాయుడు మాత్రం తిరుమలలో పట్టుకున్న పాములు జాగ్రత్తగా బంధిస్తాడు. దానిని తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులోని అవ్వాచారికోన లోయలో సురక్షితంగా వదలడం ద్వారా తన విధి నిర్వహిస్తున్నారు.
"అది కూడా జీవే కదా సార్, పాము వల్ల మనకు ప్రమాదం లేదు. తనకు హాని జరుగుతుందని భావిస్తేనే కాటు వేస్తుంది" అని పాముల స్వభావాన్ని అధ్యయనం చేసినట్లు చెబుతున్నాడు. అందువల్ల "దానికీ బతికే స్వేచ్ఛ ఇవ్వాలి. అందుకే మళ్లీ అడవిలో వదలడానికి శ్రద్ధ తీసుకుంటా" అని భాస్కర్ నాయుడు చెబుతున్నారు. ఆ విధంగా..
2005 ఇప్పటి దాకా 18 వేల పాములను కాపాడి, అడవిలో వదలినట్టు భాస్కర్ నాయుడు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి వివరించారు.
అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావంటే.. ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్యర్యం కలిగించింది.
"నేను ఎన్నిపాములు పట్టాను. వాటిని ఎక్కడ వదిలాను. అది ఏ జాతి పాము. అనే వివరాలన్నీ రాసి ఉంచుతున్నా" అని చెప్పారు.
2016లో తాను పదవీవిరమణ చేసినట్లు ఆయన చెప్పారు. అయినా నా సేవలు వదులుకోవడానికి టీటీడీ అధికారులు ఇష్టపడలేదని భాస్కర్ తెలిపారు. అప్పట్లో తిరుమల జేఈఓగా ఉన్న శ్రీనివాసరాజు ఉన్నతాధికారులతో మాట్లాడి, నెలకు రూ.20 వేలు వేతనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. జీతం అనేది ప్రధానంగా కాకుండా, తిరుమల స్థానికులు, శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఇబ్బంది లేకుండా, ఆ ప్రదేశాల్లోకి వచ్చే పాములను జాగ్రత్తగా పట్టుకుని, సురక్షితంగా అడవిలో వదిలే పని శ్రద్ధగా చేస్తున్నానని వివరించారు. అయితే,
2019లో ప్రభుత్వం మారిన తరువాత తనకు ఇస్తున్న గౌరవ వేతనం రద్దు చేశారని భాస్కర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిఫలం లేకుండా ఈ సాహసం ఏందుకని ప్రశ్నిస్తే...
"నాకు స్థానికులు, యాత్రికుల భద్రతే ప్రధానం అనిపించింది. అందుకే పాములు పట్టడం మాత్రం మానలేదు" అని అంటున్నారు.
చావు అంచులకు వెళ్లి...
కాలం కలసి రాకుంటే చేతిలో కర్రే పాము అవుతుందనేది ఓ సామెత. మూడేళ్ల కిందట తిరుమలలో స్థానికులు ఉండే కాలనీలోకి పాము వచ్చిందనే సమాచారం అందుకున్న భాస్కర్ నాయుడు నిమిషాల్లో అక్కడ వాలిపోయాడు. జనం చుట్టుముట్టి ఉండడంతో తచ్చాడుతున్న పామును భాస్కర్ నాయుడు బంధించాడు. దానికి చురుకుతగిలిందేమే.. చేతిప కాటు వేసింది. అంతే తల్లడిల్లుతున్న భాస్కర్ నాయుడును తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికి స్పృహ కోల్పోయాడు. మళ్లీ కళ్లు తెరిచే సరికి 23 రోజులు గడిచిపోయాయి.
దీనిపై మాట్లాడుతూ, "నన్ను కాటు వేసింది. గుడ్డి పింజరి. ఇది కాస్త ప్రమాదకర పాము. రక్త పింజరి అయి ఉంటే మాత్రం మీతో మాట్లాడేందుకు నేను ఉండేవాటిని కాదోమే" అని ఓ నవ్వు నవ్వాడు. వాటిల్లోనే "గుడ్డి పింజరి పాము అంతప్రమాదం కాదు" అని పాములపై రీసెర్చ్ చేసినట్లు వాటి తీరును భాస్కర్ నాయుడు విశ్లేషించారు. ఆ తరువాత.
పాము పడితే రూ. వెయ్యి
ప్రభుత్వం మారిన తరువాత గౌరవవేతనం రద్దు చేసిన అధికారులు, నేను చేసే పనికి గుర్తింపు ఇచ్చారని భాస్కర్ నాయుడు అంటున్నారు. "ఇప్పుడు జనావాసాల మధ్యకు వచ్చే పామును పట్టుకుని, అడవిలో వదిలితే రూ. 1,000 చెల్లిస్తున్నారు" అని వివరించారు. ఇక్కడ ఎంత ఇస్తున్నారనేది కాదు. యాత్రికులకు ప్రమాదం లేకుండా కాపాడగలిగే శక్తి నాకు దేవుడు ప్రసాదించడం ఓ వరంగా భావిస్తున్నా" అని అంటున్నారు. నాకు శక్తి ఉన్నంతవరకు నాకు గుర్తింపు, గౌరవం ఇచ్చిన ఈ వృత్తిని మాత్రం వదలనని ఆయన చెబుతున్నారు.
Next Story