ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే రాష్ట్రానికి అధికాదాయం వచ్చేది. ఆగిపోవడం వల్లే అన్ని విధాల ఆదాయం కోల్పోయాం.


ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతంగా ఇప్పటికే సాధించేది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని గత ప్రభుత్వం ఆపేయకుండా పూర్తి చేసి ఉంటే జిడిపి రెండు లక్షల కోట్లకు చేరి ఉండేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబునాయుడు చెప్పారు. ఇటీవల ఆయన అమరావతిపై విడుదల చేసిన శ్వేత పత్రంలో జిడిపిపై మరిన్ని విషయాలు వెల్లడించారు. రాజధాని కార్యకలాపాలు మొదలై ఉంటే ఇక్కడ ట్యాక్స్‌లు, వ్యాపార లావాదేవీలు పెరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అధికాదాయం వచ్చేదని అంచనా వేసినట్లు సీఎం చెప్పారు.

2019 నుంచి 2024 వరకు అమరావతి నిర్మాణాలు ఆగకుండా ముందుకు సాగి ఉంటే అన్ని విధాల ఆదాయం వచ్చేదని, రావాల్సిన ఆదాయాన్ని పొందలేకపోవడం వల్లే జీడిపిని కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో సుమారు లక్ష మంది జనాభా నివసిస్తున్నారని శ్వేతపత్రంలో సీఎం తెలిపారు. నిర్మాణ పనులు జరిగి ఉంటే ఏడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవన్నారు.
అమరావతిలో నవ నగరాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేసి పనులు మొదట మొదలు పెట్టారు. అవి మధ్యలోనే ఆగిపోయాయి. నవ నగరాల నిర్మాణాలు పూర్తయి ఉంటే ప్రతి నగరంలోనూ కనీసం లక్ష మందికి తక్కువ కాకుండా ఉద్యోగులు, నివాసాలు ఉండే వారు వస్తారని, దీని వల్ల కనీసం పది లక్షల మంది జనాభా పెరిగేదని అప్పట్లో అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. జనాభాను దృష్టిలో ఉంచుకొని మార్కెట్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, తయారీ సంస్థలు, విద్యా సంస్థలు, చిల్లర వ్యాపారాలు వంటి వన్నీ ఏర్పాటయ్యేవని, వాటి వల్ల ఆదాయం పెరిగేదని సీఎం పేర్కొన్నారు. ప్రజా రవాణా, విద్యత్‌ తదితర సదుపాయాలు, సౌకర్యాలపై విధించే పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతుందని, ఇక్కడ ఏర్పాటు చేసే విద్యా సంస్థలు, కంపెనీల నుంచి రావాల్సిన పన్నులు, ఇతర లావాదేవీల నుంచి వచ్చే జిఎస్‌టీ ద్వారా ఆదాయం రెట్టింపయ్యేదని పేర్కొన్నారు.
జీడీపీ అంటే ఏమిటి?
ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక నిర్థిష్ట ప్రదేశంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు. ‘జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిది’ అని రీసెర్చ్‌ అండ్‌ రేటింగ్స్‌ సంస్థ కేర్‌ రేటింగ్స్‌కు చెందిన ఆర్థికవేత్త సుశాంత్‌ హెగ్డే అభివర్ణిస్తారు.
ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆయా పాఠ్యాంశాల్లో విద్యార్థి మేధా శక్తిని మార్కుల జాబితా ఎలా చెబుతుందో... ఆ నిర్థిష్ట ప్రదేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలాబలాలను జీడీపీ ప్రతిఫలిస్తుంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ బాగుందో లేదో ఇది చూపుతుంది. మందంగా సాగుతున్నట్లు జీడీపీ గణాంకాలు చూపుతున్నట్లయితే దానర్థం ఆ నిర్థిష్ట ప్రదేశ ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని. అంటే ఆ ప్రదేశంలో గడచిన సంవత్సరంతో పోలిస్తే తగినన్ని సరకులు, సేవలు ఉత్పత్తి కావటం లేదని అర్థం.
భారతదేశంలో సెంట్రల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ (సీఎస్‌ఓ) ప్రతి ఏటా నాలుగు సార్లు జీడీపీని లెక్కిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించే ఈ గణాంకాలను ఆర్థిక పరిభాషలో త్రైమాసిక గణాంకాలు అంటారు.
అలాగే ప్రతి ఏటా వార్షిక జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా సీఎస్‌ఓ విడుదల చేస్తుంది. భారత్‌ వంటి అల్పాదాయ, మధ్యాదాయ దేశాలు.. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చటానికి ప్రతి ఏటా అధిక జీడీపీ సాధించటం ముఖ్యమని భావిస్తారు.
జీడీపీని ఎలా లెక్కిస్తారు?
జీడీపీని లెక్కించాలంటే నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
1. వినిమయ వ్యయం: దేశ జనాభా.. వస్తువులు, సేవలను కొనుగోలు చేయటానికి చేసిన మొత్తం ఖర్చు.
2. ప్రభుత్వ వ్యయం: ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం చేసిన వ్యయం.
3. పెట్టుబడి వ్యయం: ఒక ఫ్యాక్టరీ లేదా నదిపైన వంతెన వంటి మౌలిక వసతుల నిర్మాణానికి చేసిన వ్యయం.
4. నికర ఎగుమతుల విలువ: అంటే ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడా మొత్తం.
జీడీపీని నామినల్‌ జీడీపీ, రియల్‌ జీడీపీ అని రెండు రకాలుగా లెక్కిస్తారు.
నామినల్‌ జీడీపీలో.. అన్ని వస్తువులు, సేవల విలువను ప్రస్తుత ధరలతో (జీడీపీని లెక్కించిన సంవత్సరపు ధరలతో) లెక్కిస్తారు.
బేస్‌ ఇయర్‌ (పోల్చటానికి ఉపయోగించిన సంవత్సరం) ప్రకారం ద్రవ్యోల్బణాన్ని (ధరల పెరుగుదలను) సవరించినపుడు రియల్‌ జీడీపీ లభిస్తుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో వృద్ధి గురించి మనం మాట్లాడుకునేటపుడు ఈ రియల్‌ జీడీపీ గురించే మాట్లాడతాం.
జీడీపీ గణాంకాలు సేకరించే రంగాలు
వ్యవసాయ రంగం
తయారీ రంగం
విద్యుత్, గ్యాస్‌ పంపిణీ
గనుల తవ్వకం, అడవులు, చేపల వేట
హోటల్, నిర్మాణం, వాణిజ్యం, సమాచార సంబంధాలు
బ్యాంకింగ్, రియల్‌ ఎస్టేట్, బీమా
వాణిజ్య సేవలు
సామాజిక, ప్రజా సేవలు
ప్రభుత్వం, ప్రజలు నిర్ణయాలు తీసుకోవటానికి పరిగణనలోకి తీసుకునే కీలకమైన అంశాల్లో జీడీపీ కూడా ఒకటి.
జీడీపీ వృద్ధి చెందుతున్నదంటే దానర్థం ఆర్థిక కార్యకలాపాల విషయంలో దేశం బాగా పనిచేస్తోందని. ప్రభుత్వ విధానాలు క్షేత్ర స్థాయిలో ఫలిస్తున్నాయని. అవి సరైన దిశలో పయనిస్తున్నాయని.
జీడీపీ మందగించటం, తిరోగమనంలోకి జారిపోవటం జరుగుతున్నదంటే.. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం చెందటానికి తోడ్పడేలా ప్రభుత్వం తన విధానాలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుందని.
ప్రభుత్వమే కాకుండా వ్యాపారవేత్తలు, స్టాక్‌ మార్కెట్‌ మదుపు దారులు, వివిధ విధాన నిర్ణేతలు కూడా నిర్ణయాలు తీసుకోవటానికి జీడీపీ గణాంకాలను ఉపయోగించుకుంటారు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లయితే వ్యాపార సంస్థలు మరింత ఎక్కువగా డబ్బు పెట్టుబడులుగా పెట్టి ఉత్పత్తి పెంచుతారు. దానివల్ల భవిష్యత్తు మరింత ఆశా జనకంగా కనిపిస్తుంది.
Next Story