మోదీని కలుస్తా, నాకొడుకు చేసిన తప్పేంటని అడుగుతా?  సాయిబాబా తల్లి
x
సాయిబాబా దంపతులు (ఫేస్ బుక్ సౌజన్యంతో)

మోదీని కలుస్తా, నాకొడుకు చేసిన తప్పేంటని అడుగుతా? సాయిబాబా తల్లి

చట్టం ముందు అందరూ సమానమేనా? చట్టం చెల్లుబాటు అన్ని చోట్లా ఒకటేనా? అదే నిజమైతే ప్రొఫెసర్ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎలా అర్థం చేసుకోవాలి?


చట్టం ముందు అందరూ సమానమేనా? చట్టం చెల్లుబాటు అన్ని చోట్లా ఒకటేనా? అదే నిజమైతే ప్రొఫెసర్ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు (నాగపూర్ బెంచ్) ఇచ్చిన తీర్పును ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతకాలం అకారణంగా ఆయన జైల్లో ఉంచినందుకు, అష్టకష్టాలు పెట్టినందుకు ఎవరు బాధ్యత వహించాలి? ఇవన్నీ ప్రస్తుతం ముసురుకున్న సందేహాలు. మావోయిస్టులతో సంబంధాల కేసులో దైవాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా దోషి అంటూ ఆయనకు సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదును బాంబే హైకోర్టు రద్దు చేసింది. నిందితులపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ధర్మాసనం ప్రకటించడం ముదావహమే అయినా చేయని నేరానికి.. 90 శాతం అంగవైకల్యంతో వీల్ చైర్ కే పరిమితమైన సాయిబాబాను సుమారు పదేళ్లు జైల్లో ఉంచారు. 2014లో సాయిబాబా అరెస్ట్ అయితే 2024లో కేసును హైకోర్టు కొట్టివేసింది. మావోయిస్టు అనే ఏకైక కారణంతో ఆయన ఉద్యోగాన్ని ఊడపెరికింది ఢిల్లీ యూనివర్శిటీ. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే ప్రశ్న మాటేమో గాని ఇంతకాలం ఆయన కుటుంబం పడిన క్షోభకు ప్రభుత్వాధినేతలు, అధికార దొంతర వ్యవస్థ సమాధానం చెప్పగలదా, మూల్యం చెల్లించగలదా, పోయిన ఆయన జీవితాన్ని తిరిగి తీసుకురాగలదా? ‘నా కొడుకు మీద గవర్నమెంట్ ఎందుకు పగ పట్టిందో? వాడేమైనా నడవగలడా? బరువులు ఎత్తగలడా? తుపాకితో కాల్చగలడా?” అని సాయిబాబా తల్లి, పండుముదుసలి సూర్యవతి అడిగే ప్రశ్నలకు బదులు ఎవరివ్వాలి..

ఎవరీ సాయిబాబా?

సాయిబాబాది అమలాపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే జనుపల్లి. ఆధ్యాత్మిక కుటుంబం. ముగ్గురు పిల్లల్లో పెద్దవాడు సాయిబాబా. ఆయన తల్లి సూర్యవతి. ఆయన చెల్లి గంగాభవాని. తమ్ముడు రాందేవ్. సాయిబాబ సహచరి వసంత. నాలుళ్ల వయసులో వచ్చిన ఓ విచిత్ర వ్యాధి ఆ కుటుంబాన్ని కుంగదీసింది. ఎక్కడెక్కడో తిప్పారు. ఏవేవో వైద్యాలు చేయించారు. విశాఖపట్నం, పుట్టపర్తి అన్ని చోట్లకు తిప్పారు. అయినా ఈ సాయిబాబా నడవ లేకపోయారు. చేతులతో పాకడం తప్ప. చిన్నప్పటి నుంచి చదువంటే మమకారం. కాని స్కూల్ కు పోలేని కష్టం. వచ్చిపోయే స్కూలు పిల్లలే ఆయనకు టీచర్లు. సాయిబాబాకి ఆయన తమ్ముడు రాందేవ్ కి మధ్య ఆరేళ్ల తేడా. తమ్ముడు బడీడుకి వచ్చాక సైకిల్ నేర్చుకోని అన్నని ఎక్కడికైనా తీసుకెళ్ళేవాడు. ఏడో క్లాస్ లో వున్నప్పుడు విశాఖపట్నం మిషినరీ హాస్పిటల్ లో ఆర్థోపెడిక్ డాక్టర్లు సర్జరీ చేశారు. ఓ డాక్టర్ సాయంతోనే బెడ్ మీది ఉండే స్కూల్లో పరీక్షలు రాశారు.cస్కూల్ ఫస్ట్ వచ్చారు.

రష్యా వెళ్లి ఉంటే నయమయ్యేదేమో..

తొలి సర్జరీ తర్వాత ఇంకా మంచి వైద్యం కావాలంటే.. రష్యాలో చేస్తారంటే దానికి కూడా ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. భౌతికంగా సగం శరీరం చచ్చుబడిపోయింది. కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందుల పాలైంది. ఉన్న మూడెకరాల భూమి కరిగిపోయింది. వాళ్ల నాన్న వ్యవసాయం అప్పుల పాలైంది. చెల్లెలు గంగాభవాని బతుకుదెరువు కోసం కుట్టుమిషన్ ను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఆమె కూడా అణగారిన ప్రజల విముక్తి కోసం తాను ఎంచుకున్న పోరాట మార్గంలో తన ప్రాణాలనే త్యాగం చేసింది.

చదువంటే ప్రాణం...

“సాయిబాబాకి మొదటి నుంచి చదువంటే ప్రాణం. అన్నిట్లోను ఫస్ట్. టీచర్లందరికి సాయి అంటే ఎంతో ప్రేమ వుండేది. ఎవ్వరు ఏ రోజు ఈ పిల్లాడికి కాళ్ళు లేవు, ఏమి చేస్తడు అని గేలి చేయలేదు. తక్కువగా చూడలేదు. సాయి పదో తరగతిలో జిల్లా ఫస్ట్. అప్పటి నుంచే తన తోటి పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాడు. పదో క్లాస్ లో ఉన్నప్పటి నుంచే వసంత కూడా పరిచయం. ఇద్దరిది ఒక్కటే క్లాస్” అని చెప్పారు వాళ్ల తమ్ముడు రాందేవ్. సమాజం నుంచి తీసుకున్నది సమాజానికి తిరిగి ఇవ్వాలన్న సూత్రం సాయిబాబాది. బహుశా ఈ భావనే సాయిబాబను మొత్తంగా శ్రమజీవుల పక్షపాతిని చేసిందేమో! అంటారు రాందేవ్.

రాందేవ్ చెప్పిన ప్రకారం పదో తరగతి తర్వాత సాయిబాబ పాలిటెక్నిక్ కోర్స్ కోసం ఎంట్రన్స్ రాస్తే కాకినాడ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చింది. కాని అక్కడ చేరడానికి వెళ్తే అక్కడ ఉన్న టీచర్స్ ‘నువ్వు వికలాంగుడవి కదా, ప్రాక్టికల్స్ లో చాలా కష్టమవుతది’ అని నిరుత్సాహపరిస్తే వెనక్కి వచ్చేశాడు. అయినా సైన్స్ మీద ఉన్న ఇష్టంతో అమలాపురం లోని ఎస్.కే.బీ.ర్ కాలేజ్ లో ఇంటర్ యంపిసి గ్రూప్ లో చేరాడు. ఇంటర్ తర్వాత భౌతిక ఇబ్బందులను దృష్టిలో వుంచుకోని బీఏ (ఇంగ్లిష్) అదే కాలేజీలో చేరిండు. అక్కడే తన క్లాస్మేట్, తర్వాత సహచరి అయిన వసంత కూడ ఇంటర్, డిగ్రీ చదువుకున్నారు.

విప్లవోద్యమంలో కన్నుమూసిన చెల్లి..

అమలాపురం నుండి సాయిబాబ పీజీ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు. అక్కడే తనకు విద్యార్థి ఉద్యమాలు, ముఖ్యంగా మండల్ కమిషన్ ఉద్యమం సాయిబాబ మీద చాలా ప్రభావం వేసింది. సమాజ (కుల, వర్గ, లింగ, జాతి) సమస్యల మూలాలు వెతకడం అక్కడినుండే నేర్చుకున్నారు. ఆ తర్వాత అప్పటి సీఫెల్ లో ఎంఫిల్ చేశారు. అప్పుడే వసంతతో పెళ్ళి కావడం, తన కుటుంబమంతా హైదరాబాద్ కు మారడం జరిగింది. హైద్రాబాద్ కు వచ్చాక తన చెల్లి గంగాభవాని మహిళా సంఘంలో పనిచేస్తూ, విప్లవోద్యమంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్ళిపోయారు. దాదాపు ఐదేళ్ల తర్వాత 2001లో బూటకపు ఎదురు కాల్పుల్లో చనిపోయారు.

అప్పటికే పీహెచ్డీ కోసం ఢిల్లీ వెళ్ళిన సాయిబాబ అక్కడే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాం లాల్ అనంద్ కాలేజ్ లో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించారు. అతను ఢిల్లీ వెళ్ళే వరకు వీల్ చైర్ కూడా లేని పరిస్థితి. అమలాపురం నుంచి ఢిల్లీ వరకు పాక్కుంటూనే పోయాడని సాయిబాబా తల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఢిల్లీలోనే ఆయన ప్రజామేధావిగా, అణగారిన ప్రజల ఉద్యమాలకు అండగా నిలబడ్డారంటారు ఆమె. ఆ “నేరానికే” దోపిడీ కుల, వర్గ ప్రయోజనాలు కాపాడే రాజ్యం కుట్ర పన్ని సాయిబాబను దొంగ కేసుల్లో ఇరికించి జీవిత ఖైదు చేసింది.

మోదీని కలుస్తా, నిలదీస్తా...

ప్రధానమంత్రి మోదీ అందర్నీ కలుస్తారని చెబుతున్నారు. తాను వెళతానంటున్నారు సాయిబాబా తల్లి సూర్యవతి. “నాకు కూడ మోదీ దగ్గరకు వెళ్ళి అడగాలని వుంది. నా కొడుకును వదిలిపెట్టమని కాదు. నా కొడుకు ఏం తప్పు చేశాడో చెప్పమని? అడుగుతా” అన్నారు సూర్యవతి ఇటీవల ఓ పౌరహక్కుల కార్యకర్తకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. తన పిల్లలు సమాజ మార్పు కోసం పని చేయడం తప్పా అని మోదీని అడగాలనుకుంటున్న ఆ తల్లి కోర్కె నెరవేరుతుందో లేదో గాని ప్రస్తుతానికైతే జైలు నుంచి బయటకు వస్తున్నారు. ఆ తల్లి నమ్మకాన్ని నెరవేర్చే పోరాటాలకు మద్దతుగా తోటి పౌర సమాజం అండగా నిలవాలన్నారు సామాజిక సేవా కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్.

Read More
Next Story