ఆమె గెలిస్తే ఓ రికార్డ్.. 30 ఏళ్ల తర్వాత ముస్లిమేతర వ్యక్తి
కడపలో ఆమె గెలిస్తే రెండు రికార్డులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడు దశాబ్దాల తర్వాత ముస్లిమేతర వ్యక్తి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కడప అసెంబ్లీ స్థానం ముస్లిం మైనార్టీ ఓటర్లకు నిలయం. ఈ స్థానం నుంచి రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించేవారు. కానీ గత మూడు దశాబ్దాల నుంచి టిడిపి, వైయస్ఆర్సీపీ నుంచి ముస్లిం మైనార్టీలే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత, ముస్లిమేతర మహిళ 2024 ఎన్నికల్లో అదృష్ట పరీక్షకు సిద్ధమయ్యారు. మరో మూడు రోజుల్లో వెలువడే ఫలితాల్లో అదృష్టం కలిసి వస్తే కడప అసెంబ్లీ స్థానం చరిత్రలో కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది.
మిగతా రంగాలతో పాటు రాజకీయంగా కడప జిల్లాకు రాష్ట్రంలో గుర్తింపు ఉంది. కడప జిల్లా నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తుండడం. అంతకుముందే దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకువచ్చారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో అధిక ఎంపీలను అందించిన ఖ్యాతిని కూడా డాక్టర్ వైఎస్ఆర్ దక్కించుకున్నారు. ఆ విధంగా కూడా కడప జిల్లా జాతీయంగా కూడా ఖ్యాతి దక్కింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే...
మూడు దశాబ్దాల తర్వాత
కడప అసెంబ్లీ స్థానంలో 2,65,154 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 90 వేల పైచిలుకు ఓటర్లు ముస్లిం మైనారిటీలే. ఆ తర్వాత బలిజ, క్రిస్టియన్, రెడ్డి, దళిత సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం షేక్ అంజాద్ బాషా బేపారిపై టిడిపి అభ్యర్థిగా ఆర్. మాధవిరెడ్డిని పోటీ చేయించారు. మూడు దశాబ్దాల తరువాత ఈ నియోజకవర్గంలో ముస్లిమేతర వ్యక్తి పోటీ చేయడం గమనార్హం. అంతేకాకుండా ఈమె రెండో మహిళగా ఇక్కడి నుంచి పోటీ చేసిన వారిలో రికార్డు నమోదు చేశారు. మరో మూడు రోజుల్లో జరగనున్న ఓట్ల లెక్కింపులో ఈమెను అదృష్టం వరిస్తే, రెండు రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. హ్యాట్రిక్ కోసం హోరాహోరీగా శ్రమిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై అసంతృప్తి ఎక్కువగా ఉండడంతో పాటు ఆయన సోదరుడు కొందరు బంధువుల వల్ల వ్యతిరేకత కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అఫ్జల్ ఖాన్ ను ఆ పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేయించింది. దీనివల్ల ముస్లిం మైనారిటీ ఓట్లు చీలే అవకాశం ఉన్నందున, ఈ రెండు పరిణామాలు తనకు అనుకూలిస్తాయని టిడిపి అభ్యర్థి మాధవి రెడ్డి విశ్వసిస్తున్నారు.
ఆయనే చివరి ఎమ్మెల్యే..
కడప అసెంబ్లీ స్థానం నుంచి 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కందుల శివానందరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ముస్లిమేతర ఎమ్మెల్యేలు కడప స్థానం నుంచి గెలవలేదు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి ఎస్సే ఖలీల్ బాషా, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన సయ్యద్ మహమ్మద్ అహ్మదుల్లా డాక్టర్ వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర విభజన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ కి అవకాశం లేకుండా పోయింది. దీంతో 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, డిప్యూటీ సీఎంగా ఉన్న షేక్ అంజాద్ బాషా బేపారి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంగా 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. 2014లో అంజాద్ బాషా టిడిపి అభ్యర్థి సుధా దుర్గాప్రసాదరావు పై 45,205 ఓట్లు, 2019లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవాబ్ జాన్ అమీర్ బాబు పై 54,794 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో ఈయనకు అనేక కారణాల రీత్యా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కడప నగరంలోని రకీబ్ షావలి దర్గా భూముల పరిరక్షణ, నిర్మాణం కూల్చివేతలను అడ్డుకోవడంలోనే కాకుండా, దర్గా నుంచి రోడ్ల విస్తరణ వ్యవహారంలో మాట్లాడకపోవడం వంటి అనేక అంశాలపై సొంత సామాజికవర్గం నుంచే అంజాద్ బాషా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
ఇవే కలిసి వస్తాయి..
"అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, స్థానిక అంశాలు" తనకు కలిసి వస్తాయని టిడిపి అభ్యర్థి ఆర్. మాధవిరెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. ముస్లిం మైనార్టీ వర్గాలతో తాను మమేకమైనప్పుడు సానుకూల స్పందన లభించిందని ఆమె చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో జరగనున్న ఓట్ల లెక్కింపులో మాధవి రెడ్డికి ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది తేలిపోతుంది. అంతవరకు వేచి చూద్దాం.