నువ్వు లేకపోయినా నీ వీరత్వం మిగిలే ఉంది మురళీ నాయక్!
x
Murali Nayak Image

నువ్వు లేకపోయినా నీ వీరత్వం మిగిలే ఉంది మురళీ నాయక్!

కల్లితండా.. కన్నీరు మున్నీరవుతోంది. కన్నతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అంతిమ యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి.


వీర జవాన్‌ మురళీనాయక్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాడు. పేదవాడైనా, మారుమూల తండాలో పుట్టినా దేశ సేవలో కన్నుమూశారు. మిలటరీ దుస్తుల్లోనే ఊపిరి వదలాలని పదేపదే చెప్పే మురళీ చివరకు ఆ విధంగానే కన్నుమూశారు. చరిత్రలో సజీవంగా నిలిచారు.
ఓ తండా ఆశ.. ఓ దేశ గర్వం
కల్లితండా, శ్రీ సత్యసాయి జిల్లా ..తేదీ 2025, మే 9.. సమయం ఉదయం 9 గంటలు.. గిరిజన తండాలోని శ్రీరాం నాయక్ ఫోన్ మోగింది. ఫోన్ వింటూనే శ్రీరాం నాయక్ కుప్పకూలిపోయారు. గుండెలవిసేలా రోదన.. ముంబయి నుంచి వచ్చి తండాలో జరిగిన జాతరలో సంతోషంగా గడిపేందుకు వచ్చిన శ్రీరాం నాయక్ కుటుంబం పాలిట పెను విఘాతమైంది ఆ ఫోన్ కాల్. ఆ కాల్ సారాంశం.. భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగిన కాల్పుల్లో వారి కుమారుడు మురళీనాయక్‌ కన్నుమూత. ఈ ఫోన్ కు కాస్త ముందే మురళీ నాయక్‌ వీడియో కాల్‌ చేసి తల్లిదండ్రులతో మాట్లాడిన మాటలు చెవుల్లో మార్మోగుతుండగానే ఈ విషాదకర వార్త రావడంతో తల్లడిల్లారు. కానీ ఆ తండ్రి శ్రీరాంనాయక్‌ చెబుతున్న మాట మాత్రం ఈ దేశ ప్రజలు గర్వపడేలా ఉన్నాయి.. “అతడు మాకోసం కాదు నాయనా.. దేశం కోసం బతికాడు” అని ఆ తండ్రి చెప్పినపుడు అక్కడున్న వాళ్లందరి కళ్లంట నీళ్లు చెమ్మగిల్లాయంటే అతిశయోక్తి కాదు.
తండ్రి చెమట, తల్లి కన్నీటి కల
మురళీ నాయక్‌ తల్లిదండ్రులు ముంబయిలో కూలి పనులు చేస్తూ తన చదువు కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారు. కొడుకు కోసం ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పనలవి కాదు. తండ్రి భవన నిర్మాణ కూలి. తల్లి ఇళ్లలో పాచిపని.. తండాలో అమ్మమ్మ దగ్గర పెరిగిన మురళీ.. స్కూల్‌కు వెళ్లే సమయంలోనే ‘మిలటరీ దుస్తులు వేసుకుంటా’ అని చెప్పేవాడు. ఇంటర్ పూర్తయిన తరువాత బీకాం చదువుతున్న సమయంలో 2022 డిసెంబర్ లో గుంటూరు అగ్నిపథ్‌ ఎంపికలో సెలెక్ట్‌ అయ్యాడు. రైల్వేలో ఉద్యోగం వచ్చినా వదిలేసి దేశసేవే అతనికి ప్రాణం అయింది.
కలలు కన్న ఊరి మట్టి..
జమ్మూకశ్మీర్‌ లోయల్లో మే 9న తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీకి విమానంలో తరలించే మార్గంలోనే తుదిశ్వాస విడిచాడు.

ఆ వార్త తండాకు చేరుకున్నదే తడవుగా ఊరు మొత్తం మోనంగా రోదించింది. నాయక్ చిత్రపటాన్ని గుండెలకు హత్తుకుంది. నాయక్ ఫోటో ఆ ఊరి జనం కళ్లను మసకబార్చింది.
ఇటీవలే తండ్రి ఇంటిని నిర్మించాడు. వధూవరులుగా నిలిచే స్వప్నాలను గదిలో గోడలపై రేకులు వేసేలా మాట్లాడుకున్న తల్లిదండ్రులకు ఇక ఆ ఇంటిలో జీవనం మిగలదు.
"యూనిఫాంతోనే చనిపోవాలని ఉంది"
ఈ మాట మురళీ నాయక్‌ చాలా సార్లు అన్నాడు. "ఒక్కరోజైనా మిలటరీ సర్వీస్‌ చేయాలి" అన్న కలను వదలకుండా సాగిన జీవితం – ఇప్పుడు దేశ గర్వంగా నిలిచిపోయేలా చేసింది. అంత్యక్రియల కోసం గ్రామమంతా తరలివస్తోంది. చుట్టుపక్కల గ్రామాల వారూ వీర తిలకం దిద్దేందుకు క్యూలు కట్టారు. మురళీ ఫోటో ముందు నిలబడిన చిన్నారులు – “అన్నయ్యలాగే మిలటరీలో చేరతా” అని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. కడచూపు కోసం తరలివస్తున్న అధికార, అనధికార, బంధు మిత్రుల కనుకొనకల నుంచి నీరు చెంపల మీదుగా జారుతోంది.
ప్రతి అడుగులో తల్లిదండ్రుల ఆశ
వాణి డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ క్యాడెట్‌గా పనిచేసిన మురళీ, ఆటలలోనూ ప్రతిభ చూపించి ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడు.

మురళీ నాయక్ అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలిస్తున్న పుట్టపర్తి జిల్లా అధికార యంత్రాంగం

ప్రిన్సిపల్ వజనమ్మ మాటల్లో చెప్పాలంటే – “ఎప్పుడూ తన లక్ష్యంపైన్నేగురి.. దేశానికి ఏదైనా చేయాలనే తపన ఉండేది. అలాంటి యువకుడు మానవ చరిత్రలో నిలిచిపోవడం ఆవేదనకలిగించే గర్వకారణం.”
తండాలో విగ్రహం..
మురళీ తండ్రి కోరిక మేరకు తండాలోనే విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. అధికార లాంఛనాలతో మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలికిన తర్వాత తండాలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. మురళీ నాయక్ త్యాగాన్ని మాటల్లో వర్ణించలేని విధంగా అక్కడ స్మారక స్థూపాన్ని నిర్మించనున్నారు గ్రామస్తలు.
చివరిగా… ఓ తల్లికి బిడ్డను కోల్పోయింది. కానీ భారతమాతకు సింధూరం దొరికింది.
మురళీ నాయక్‌ వలె దేశాన్ని ప్రేమించే వారు చాలా తక్కువ. అతని పోరాటం, త్యాగం కేవలం ఓ కుటుంబ కథ కాదు — అది ఒక పల్లె మనిషి గుండె ధైర్యాన్ని చూపించే గాథ. ఆ గౌరవాన్ని జాతీయ జెండాలో చుట్టిన మృతదేహం ఇచ్చింది. తండ్రి చెబుతున్నాడు – “నా కొడుకు ఆఖరి ఊపిరితో మాకో చిన్న గర్వాన్నిమిగిల్చాడు. ఇప్పుడు ఆ గర్వం కన్నీటి తోరణంగా మారింది.”

ఎన్.సి.సి. కాడెట్ల శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా (కింద కూర్చున్న వారిలో మురళీ)

మురళీ నాయక్‌కి శతకోటి నమస్సులు – నీ పాదముద్రలు ఈ మట్టిలోనే శాశ్వతంగా నిలిచిపోతాయి. వీర జవాన్‌ మురళీనాయక్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాడు. పేదవాడైనా, మారుమూల తండాలో పుట్టినా, దేశానికి సేవ చేయాలన్న తపన ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని చాటిచెప్పాడు. మురళీ నాయక్‌ మిలటరీ దుస్తుల్లో జీవితం కోల్పోయాడు – కానీ చరిత్రలో జీవంగా నిలిచిపోయాడు.
Read More
Next Story