యుద్ధ సమయంలో తెరపైకి వచ్చిన నిత్యావసర వస్తువుల చట్టం


ఇండియా-పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరస్పర దాడులు మొదలయ్యాయి. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని హోల్ సేల్ డీలర్లు, వ్యాపారులు ప్రజల కడుపుకొట్టకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదిలాయి. 1955 నాటి నిత్యావసర వస్తువుల చట్టాన్ని తెరపైకి తెచ్చాయి. నిస్సహాయ పరిస్థితిని ఆసరా చేసుకుని ఎవరైనా ఎక్కడైనా నిత్యావసర వస్తువులు దాచేసినా, బ్లాక్ చేసినా, అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని చూసినా కఠిన చర్యలు తప్పవంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కృత్రిమంగా నిత్యావసర వస్తువుల కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

అసలేమిటీ చట్టం...
భారతదేశంలో నిత్యావసర వస్తువుల చట్టం (Essential Commodities Act, 1955) 1955లో చేశారు. ఈ చట్టం దేశంలో నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీని నియంత్రించడానికి రూపొందించారు. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో కృత్రిమ కొరత, ధరల పెరుగుదలను నివారించడానికి ఈ చట్టం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆహార కొరత, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో 1946లో బ్రిటిష్ ప్రభుత్వం తాత్కాలిక చట్టాన్ని రూపొందించింది. దాని ఆధారంగా భారతదేశం 1955లో ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

ఈ చట్టం దేనిని నియంత్రిస్తుంది?
1. నిత్యావసర వస్తువుల జాబితా: ఆహార పదార్థాలు (బియ్యం, గోధుమలు, నూనెలు, ఉల్లిపాయలు వంటివి), ఔషధాలు, ఇంధనం, ఎరువులు వంటివి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
2. ధరల నియంత్రణ: అత్యవసర సమయాల్లో ధరలు అనవసరంగా పెరగకుండా నియంత్రించడం.
3. కృత్రిమ కొరత నివారణ: వ్యాపారులు, స్టాక్ హోల్డర్లు నిత్యావసర వస్తువులను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించకుండా నిషేధించడం.
4. పంపిణీ: సాధారణ పౌరులకు నిత్యావసర వస్తువులు సమర్థవంతంగా అందేలా చూడటం.
ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను ఇస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాను ప్రభుత్వాలు నియంత్రించే అధికారం ఉంది.
నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కృత్రిమ కొరత సృష్టించడం, నిల్వలు దాచడం (hoarding) చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. చట్టం ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
అత్యవసర సమయాల్లో...
యుద్ధ సమయాల్లో ధరలను పెంచడం (price gouging) కూడా ఈ చట్టం కింద నేరమవుతుంది. ఈ సందర్భాలలో తీసుకునే చర్యలు ఇలా ఉంటాయి...
1. ధరల నియంత్రణ ఆదేశాలు: ప్రభుత్వం గరిష్ట రిటైల్ ధర (MRP) లేదా నిర్దిష్ట ధరలను నిర్ణయిస్తుంది.
2. శిక్షలు: ధరలు అన్యాయంగా పెంచిన వ్యాపారులపై జరిమానాలు, జైలు శిక్ష విధిస్తారు.
3. వస్తువుల జప్తు: అధిక ధరలతో విక్రయిస్తున్న వస్తువులను జప్తు చేసి, సబ్సిడీ రేట్లతో ప్రజలకు పంపిణీ చేయవచ్చు.
4. మార్కెట్ జోక్యం: సివిల్ సప్లైస్ విభాగం నేరుగా మార్కెట్లో జోక్యం చేసుకొని సరఫరాను నియంత్రిస్తుంది.

వినియోగదారుల ఫోరం పాత్ర
వినియోగదారుల రక్షణ చట్టం-2019 (Consumer Protection Act-2019) వినియోగదారులకు రక్షణ కల్పిస్తుంది. ఫోరం నిత్యావసర వస్తువుల చట్టం ఉల్లంఘనలపై ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తుంది.
అధిక ధరలు, కృత్రిమ కొరత, నాణ్యత లోపాలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తుంది.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న వినియోగదారుల ఫోరమ్‌లు ఫిర్యాదులను త్వరగా పరిష్కరిస్తాయి.
వినియోగదారులకు ఆర్థిక నష్టం జరిగితే పరిహారం చెల్లించేందుకు ఫోరం ఆదేశిస్తుంది.
నిత్యావసర వస్తువుల చట్టం ఉల్లంఘనలను సివిల్ సప్లైస్ విభాగానికి నివేదిస్తుంది. దీని ద్వారా మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.
సివిల్ సప్లైస్ చర్యలు...
సివిల్ సప్లైస్ విభాగం అత్యవసర సమయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తుంది. వ్యాపారుల వద్ద, గిడ్డంగులలో అక్రమ నిల్వలను గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా సబ్సిడీ రేట్లతో ఆహార పదార్థాలను పంపిణీ చేస్తుంది. అవసరమైతే నిత్యావసర వస్తువుల ఎగుమతిని నిషేధిస్తుంది. (ఉదాహరణకు 2022లో గోధుమల ఎగుమతిని నిషేధించింది). బఫర్ స్టాక్‌లను విడుదల చేయడం ద్వారా ధరలను స్థిరీకరిస్తుంది.

2022 ఉల్లిగడ్డల సంక్షోభం
2022లో భారతదేశంలో ఉల్లిపాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు, అస్థిర వాతావరణం కారణంగా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వర్షాభావం కారణంగా ఉల్లిపాయల ఉత్పత్తి తగ్గిపోయింది. ఉల్లిపాయల ధరలు కిలోకు రూ. 50-70కి చేరాయి. ఇది సామాన్య ప్రజలపై మోయలేని భారంగా మారింది. ఉల్లిపాయల ఎగుమతులపై నాడు ప్రభుత్వం 40 శాతం సుంకం విధించింది. దీంతో దేశీయ సరఫరా పెరిగింది. నాఫెడ్ (NAFED) ద్వారా బఫర్ స్టాక్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించారు.
కరోనా సమయంలో ఆహార కొరత
కరోనా మహమ్మారి (2020-2021) సమయంలో ఆహార కొరత, ధరల పెరుగుదల సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. లాక్‌డౌన్ కారణంగా రవాణా, పరిమిత ఉత్పత్తి వంటి గొలుసు దెబ్బతిన్నది. కొందరు వ్యాపారులు ఆహార పదార్థాలు (కూరగాయలు, నూనెలు, ఇతర నిత్యావసరాలు) నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచారు. కరోనా తర్వాత ద్రవ్యోల్బణం కారణంగా ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ప్రభుత్వ చర్యలు
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ జరిగింది. సివిల్ సప్లైస్ విభాగం అక్రమ నిల్వలను గుర్తించడానికి తనిఖీలు నిర్వహించింది. కొన్ని రాష్ట్రాలు గరిష్ట ధరలను నిర్ణయించాయి. వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేసిందని, ధరల నియంత్రణలో సమర్థవంతంగా వ్యవహరించలేదని విమర్శలు వచ్చాయి.
మా జాగ్రత్తల్లో మేము ఉన్నాం: సౌరబ్
కేంద్రం నుంచి మాకు ఇప్పటి వరకు ఆహార భద్రతపై ఎటువంటి ఆదేశాలు రాలేదు. సివిల్ సప్లైస్ తరపున ధరలను నియంత్రిస్తూ నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని సివిల్ సప్లైస్ కమిషనర్ సౌరబ్ గౌర్ చెప్పారు. సివిల్ సప్లైస్ నిరంతర ప్రక్రియలో భాగంగా తమ పని తాము చేస్తున్నామని, ఇప్పటి వరకు ప్రత్యేకించి ఎటువంటి ఆదేశాలు లేవన్నారు.

ఆహార భద్రతకు ఈ చట్టం కీలకం
నిత్యావసర వస్తువుల చట్టం భారతదేశంలో సంక్షోభ సమయాల్లో ఆహార భద్రత, ధరల స్థిరీకరణకు కీలకమైన సాధనంగా పనిచేస్తుంది. ఈ చట్టం అమలులో కొన్ని సవాళ్లు ఉన్నాయి. చట్టం ఉల్లంఘనలను గుర్తించడంలో, చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద వ్యాపార సంస్థలు మార్కెట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 2022 ఉల్లిగడ్డల క్రైసెస్‌లో చూసినట్లుగా వాతావరణ మార్పులు ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. ఇది చట్టం అమలును సంక్లిష్టం చేస్తుంది. చట్టం గురించి సామాన్య ప్రజలకు తగినంత అవగాహన లేకపోవడం వల్ల, ఫిర్యాదులు తక్కువగా నమోదవుతున్నాయని చెప్పొచ్చు.

నిజానికిదో నిరంతర ప్రక్రియ...
వాస్తవానికి ఇదో నిరంతర ప్రక్రియ. మామూలు పరిస్థితుల్లో కూడా ఈ చట్టం అమల్లో ఉంటుంది. అయితే ప్రత్యేకించి సంక్షోభాల సమయంలో దీన్ని తెరపైకి తీసుకువస్తుంటారు పాలకులు. "నిత్యావసరాల చట్టం అత్యవసర సమయాల్లో మాత్రమే పాలకులకు గుర్తుకు వస్తోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై సరైన దృష్టి పెట్టలేదు" అని శ్రీమతి వెలగపూడి దుర్గాంబ శిద్దార్థ లా కాలేజీ ప్రిన్స్ పల్ సిహెచ్ దివాకర్ బాబు అన్నారు. ప్రభుత్వం అంటే వ్యాపారం చేయడం కాదని, సంక్షేమం చూడటమేనని ఆయన ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే "పాలకులు పట్టించుకోకపోవడం వల్ల చట్టం నీరు గారింది. ఈ చట్టం చాలా పదునైంది. రాష్ట్రాలకు విస్తృత అధికారాలు ఇచ్చింది. అత్యవసర సమయాల్లో నిత్యావసరాలు బ్లాక్ చేస్తే కఠిన మైన చర్యలు తీసుకుని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది" అన్నారు దివాకర్ బాబు.
దివాకర్ బాబు చెప్పిన ప్రకారం నిత్యావసరాల చట్టం గురించి కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. అందుకే దేశం నుంచి కొన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, ఉత్పత్తులు విదేశాలకు వెళుతున్నాయి. అందులో పీడీఎస్ బియ్యం వాటా ఎక్కువగా ఉంటోంది. ఇదంతా బ్లాక్ మార్కెట్ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పది నెలల కాలంలో ప్రతి నెలలోనూ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు నిర్వహిస్తూనే వస్తున్నారు. ఆయన తనిఖీ చేసి ప్రతి చోటా వేల టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రజల్లో అవగాహన పెరగనంత కాలం బ్లాక్ మార్కెటీర్లు సామాన్య జనాన్ని దోచుకుంటూనే ఉంటారని, వీటిని అరికట్టాలంటే ఈ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని దివాకర్ బాబు అన్నారు.
Next Story