ఐఐటి విద్యాధికుడు.. అవిటి వారికి  గురుదేవుడు
x
ట్రస్టు 18 గురుదేవ్ ట్రస్ట్ హాస్పిటల్

ఐఐటి విద్యాధికుడు.. అవిటి వారికి " గురుదేవుడు"

కాళ్లు, చేతులు లేనివారికి దిక్కు, మొక్కు అయ్యాడు. కృత్రిమ అవయవాలతో మళ్లీ నిలబెడుతున్నాడు. రూ.కోట్ల ఆస్తులమ్మి అభాగ్యులకు అండగా ఉంటున్నాడు.


ఆ పల్లెటూరు విశాఖపట్నానికి 30 కి.మీల దూరంలో ఉంది. ఆ గ్రామానికి రోజూ పదుల సంఖ్యలో కాళ్లూ, చేతులు లేని వారు కుంటుకుంటూ వెళ్తారు. తమ బతుకు బండి మళ్లీ సవ్యంగా నడుస్తుందన్న గంపెడాశతో పడుతూ లేస్తూ చేరుకుంటారు. కొద్దిరోజులకు మామూలు మనుషుల్లా చిరునవ్వులు చిందిస్తూ, నడుచుకుంటూ తిరిగొస్తారు. దాదాపు పాతికేళ్లుగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో నిత్యం ఇలాంటి వారే కనిపిస్తారు. అలాంటి లక్షలాది మంది అవిటి వారికి అండగా నిలిచి కృత్రిమ కాళ్లు, చేతులతో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాడో ఇంజినీరింగ్ చదివిన ఓ విద్యాధికుడు. జమిందారీ పుత్రుడు. ఆయనను సేవాతత్పరత వైపు మళ్లించిన పరిస్థితులు ఆసక్తిని రేపుతాయి. ఎందరికో స్పూర్తిని నింపుతాయి.

ఈరోజుల్లో అక్రమ మార్గాల్లోనో, సక్రమ మార్గాల్లోనో ఆస్తులను కూడబెట్టుకుంటున్న వారినే చూస్తున్నాం. అందుకు భిన్నంగా ఉన్న ఆస్తులమ్ముకుని అభాగ్యుల సేవలో తరించే వారు కోటికొక్కరు కూడా కనిపించరు. అలాంటి కోవకే చెందారు రాపర్తి జగదీష్ బాబు. ఉన్నత విద్యనభ్యసించాడు. వందెకరాలకు పైగా భూములున్న జమిందారీ కుటుంబం ఆయనది. ప్రమాదాల్లో కాళ్లూ చేతులూ పోగొట్టుకున్న వారు ఇక జీవితంలో తాము మళ్లీ నిలబడలేమని కుమిలిపోతుంటారు. మునుపటిలా జీవనం సాగించలేమని కృశించి పోతుంటారు. అలాంటి అభాగ్యుల పాలిట ఆయన ఆశాదీపమయ్యాడు. అవిటి వారికి దిక్కు, మొక్కు అయ్యాడు. ఐఐటీ చదివి అమెరికాలో ఉన్నతోద్యోగాన్ని కాదనుకున్నాడు. అమ్మ మాటకు విలువిచ్చి, స్నేహితుడి వైకల్యంతో చలించి అవిటి వారికి అండగా నిలుస్తున్నాడు. వందలు, వేలు కాదు.. రెండు లక్షల మందికి పైగా కృత్రిమ కాళ్లు, చేతులను అమర్చి వారిని మళ్లీ నిలబెడుతున్నాడు. రూ.కోట్ల విలువైన ఆస్తులమ్మి కృత్రిమ అవయవాలను అమరుస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాడు. లక్షలాది మంది పేద వికలాంగుల పాలిట 'గురుదేవు'డయ్యాడు.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి చెందిన జగదీష్బాబు బెంగళూరులో ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్, ఐఐటీలో ఎంటెక్ చేశారు. ఉద్యోగం కోసం అమెరికాకు పయనమయ్యే సమయంలో తండ్రి దూరం కావడం, తల్లి క్యాన్సర్ బారినపడడం జరిగిపోయాయి. తల్లి తనను విడిచి వెళ్లొద్దనడంతో అమెరికా పయనాన్ని విరమించుకున్నారాయన. ఇంతలో తన స్నేహితుడు రాజశేఖర్ రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్నాడు. ఆయన జైపూర్ లో కృత్రిమ కాళ్లు పెట్టించుకునేందుకు వెళ్తూ రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. చలించిపోయిన జగదీష్బాబు.. కాళ్లు, చేతులు కోల్పోతున్న పేద, మధ్య తరగతి వికలాంగుల పరిస్థితి గురించి ఆలోచించారు. జైపూర్లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి కృత్రిమ కాళ్లు, చేతులు పెట్టించుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్నందున అలాగే ఉండిపోతున్నారని తెలుసుకున్నారు. అలాంటి వారికోసం తానే వాటిని తయారు చేయించి అమర్చాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి తల్లి కూడా ప్రోత్సహించింది. తన తాతలు, తండ్రుల నుంచి సేవ, ఆధ్యాత్మిక లక్షణాలను వారసత్వంగా తెచ్చుకున్న జగదీష్ బాబు.. కొన్ని ఆస్తులమ్మి తన ఊరు మంగళపాలెంలో 1988లో తన సొంత భూమిలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు.

అప్పట్లో అవసరమైన వారిని హైదరాబాద్ తీసుకెళ్లి కృత్రిమ అవయవాలు అమర్చేవారు. ఆ తర్వాత నళినేష్బాబు అనే కృత్రిమ అవయవాలు అమర్చే నిపుణుడితో పరిచయం ఏర్పరచుకుని తమ ట్రస్టు ప్రాంగణంలోనే వాటి తయారీని మొదలెట్టారు. అలా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్నాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు చెందిన 2,39,642 మందికి కృత్రిమ కాళ్లు, చేతులను ఉచితంగా అమర్చారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. కృత్రిమ కాళ్లు, చేతులను బయట అమర్చినందుకు రూ.50 వేల నుంచి లక్ష వరకూ ఖర్చవుతుంది. ఇవి కాకుండా ఇతర దివ్యాంగులు, అంధులు, బధిరులు రెండు లక్షల మందికి క్రాచర్స్ (చంక కర్రలు), కాలిపర్స్, ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు అందజేశారు. జగదీష్ బాబు సంకల్పానికి కార్పొరేట్ సంస్థలు కూడా తమ సీఎస్సార్ ఫండ్స్ను, కొందరు దాతలూ తమవంతు చేయూతనిస్తూ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు.

నిర్మాణంలో ఉన్న క్యాన్సర్ ఆస్పత్రి

ఇంకా మరెన్నో వైద్య సేవలు..

ఈ ట్రస్టు ద్వారా కేవలం దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు అమర్చడమే కాదు.. కాలక్రమంలో పేద రోగులకు ఇతర వైద్య సేవలను విస్తరిస్తూ వస్తున్నారు. ఇలా ఇక్కడ గైనికాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, కార్డియాలజీ, ఆంకాలజీ, డెంటల్, ఈఎన్టీ విభాగాలను అందుబాటులోకి తెచ్చి వైద్యాన్ని ఉచితంగానే అందిస్తున్నారు. అవసరమైన వారికి వసతి, భోజన సదుపాయాలనూ కల్పిస్తున్నారు. అంతేకాదు.. త్వరలో వంద బెడ్లతో క్యాన్సర్ ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ, ఫిజయోథెరపీ సెంటర్లను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటికి ఈనెల 20న మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో క్యాన్సర్ ఆస్పత్రికి రూ.13.5 కోట్ల వ్యయం అవుతుంది. ఈ మొత్తంలో తన అమ్మమ్మ ఆస్తి అమ్మగా వచ్చిన రూ.4.50 కోట్లతో కలిపి రూ.10 కోట్లను జగదీష్బాబే భరిస్తుండగా మిగిలిన రూ.3.50 కోట్లను అమెరికాలోని ఉప్పలపాటి ఫౌండేషన్ సమకూరుస్తోంది.

కృత్రిమ కాళ్లతో ఉన్న వికలాంగులతో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

దివ్యాంగుల కోసం ఉచిత ఆటోలు..

వైకల్యం, అనారోగ్యంతో ఈ ఆస్పత్రికి రాలేని వారి కోసం మంగళపాలెం జంక్షన్ నుంచి ఆస్పత్రికి ఉచిత ఆటోలను కూడా అందుబాటులో ఉంచారు. వాటిని కూడా కృత్రిమ కాళ్లను అమర్చుకున్న వారే కావడం విశేషం! అంతేకాదు.. కృత్రిమ కాళ్లు, చేతులు అమర్చుకున్న కొంతమంది నిరుపేదలకు ఈ ట్రస్ట్ ద్వారా పాన్షాపులు, టెంట్ హౌస్లు, ఆటోలు నడుపుకోవడానికి వీలుగా ఉపాధి కూడా చూపిస్తున్నారు. వారికి ఉచిత వసతి, భోజనం సమకూరుస్తూ కొంత వేతనం కూడా ఇస్తున్నారు.

కృత్రిమ చేతితో కరచాలనం చేస్తున్న దివ్యాంగుడు

ఎందరో ప్రముఖులు సందర్శన..

ఈ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్న ప్రముఖులు ట్రస్ట్ను సందర్శిస్తున్నారు. ఇలా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, సుప్రీం న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, లావు నాగేశ్వరరావు, రోహిణి, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు కె.రోశయ్య, కె.హరిబాబు, రామ్మోహనరావు, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, రాష్ట్ర మంత్రులు సందర్శించి ఇక్కడ అందిస్తున్న ఉచిత సేవలను కొనియాడారు.

కృత్రిమ కాళ్లను అమర్చాక నడిపిస్తున్న జగదీష్బాబు

అభాగ్యులకు అండగా నిలబడాలన్నదే లక్ష్యం..

ప్రమాదాల్లో వైకల్యానికి గురైన అభాగ్యులకు అండగా నిలవాలన్నదే నా ఆశయం. ఆ లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నాను. మా ట్రస్ట్ ద్వారా లక్షలాది మంది కాళ్లు, చేతులు లేనివారు కృత్రిమ అవయవాలతో మళ్లీ కొత్త జీవితంలో అడుగు పెడుతున్నారు. తిరిగి కాళ్లు, చేతులు పొందలేమని దిగులు చెందిన వారి కళ్లల్లో ఆనందం చూస్తుంటే చెప్పలేనంత తృప్తి కలుగుతుంది. మా ఆస్తులమ్మి ఇలాంటి వారి కోసం కేటాయిస్తున్నానన్న సంతోషమే తప్ప ఎలాంటి బాధ లేదు. మన సంపాదన మనను కాపాడదు. డబ్బుంటేనే సంతోషం రాదు. బతికినంతకాలం మనుషుల ప్రేమను సంపాదించాలి. మనిషి సాటి వారి ప్రేమను పొందితే మరణించాక కూడా జీవిస్తాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత ప్రమాణాలున్న ఫిజియోథెరపీ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని, వికలాంగ అభాగ్యులకు ఈ ట్రస్ట్ అండగా ఉండాలన్నదే నా ఆకాంక్ష.. ఆశయం’ అని గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

కృత్రిమ కాలు అమర్చుకున్న రామకృష్ణ

మళ్లీ నడుస్తాననుకోలేదు..

'నేను పదో తరగతి చదువుతున్నప్పుడు (2013లో) బైక్పై వెళ్తుండగా బస్సు మధ్య ఇరుక్కోవడంతో కాలు తీసేశారు. మళ్లీ నడుస్తాననుకోలేదు. ఇక నా జీవితం నాశనమై పోయిందని దిగులు చెందాను. మంచానికే పరిమితమైపోతానని భయపడ్డాను. ఈ ట్రస్టు వారు కృత్రిక కాళ్లు పెడుతున్నారని తెలుసుకుని వచ్చాను. 2015లో కృత్రిక కాలు అమర్చారు. ఇప్పుడు నేను సొంతంగా ఆటో నడుపుకుంటున్నాను. కృత్రిమ కాలుతోనే క్లచ్, బ్రేకులు వేయగలుగుతున్నాను. కాలు లేదన్న బెంగలేకుండా బతుకుతున్నాను' అని శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన పైలా రామకృష్ణ చెప్పాడు.

చేతులు కోల్పోయిన శంకరరావు

చేతులతో పాటు ఉపాధినీ ఇచ్చారు..

పొలం పని చేసుకుంటుండగా 2019లో నాకు కరెంటు షాకు తగిలి రెండు చేతులూ పోయాయి. నా జీవితం ఇంకెందుకు అనిపించింది. అలాంటి సమయంలో తెలిసిన వాళ్ల ద్వారా ఈ ట్రస్టుకొచ్చాను. ఇక్కడ నాకు రెండు కృత్రిమ చేతులూ అమర్చారు. ఇప్పుడు ఆ చేతులతోనే అన్ని పనులు చేసుకుంటున్నాను. కాలకృత్యాలు తీర్చుకుంటున్నాను. భోజనం చేయగలుగుతున్నాను. సైకిల్, బైక్ నడుపుతున్నాను. నాకు ట్రస్టులో సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించి జీతం ఇస్తున్నారు' అని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామస్తుడు దేసెళ్ల శంకర్రావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పాడు.

కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్న దృశ్యం

మంగళపాలెం ఎలా వెళ్లాలంటే?

కృత్రిమ అవయవాలు, ఇతర వైద్య సేవలు అవసరమైన వారు గురుదేవ చారిటబుల్ ట్రస్టుకు వెళ్లాలంటే విశాఖ నుంచి కొత్తవలస వెళ్లేందుకు పలు బస్సులు ఉంటాయి. కొత్తవలసకు ముందు స్టాప్ మంగళపాలెంలో దిగాలి. అక్కడ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న ట్రస్టుకు వెళ్లడానికి ఉచిత ఆటోలు అందుబాటులో ఉంటాయి. వివరాలకు 8886942859, 9966963656 ట్రస్టు నెంబర్లలో సంప్రదించవచ్చు.

Read More
Next Story