ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న మరో విపత్తు.. ఐఎండీ హెచ్చరిక
x

ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న మరో విపత్తు.. ఐఎండీ హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రెండు రోజులు కురిసిన వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అంతా అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాలు తీవ్ర వరదలను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌టీఆర్ జిల్లా, విజయవాడలో వరదల ఉధృతి తీవ్రంగా ఉంది.


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రెండు రోజులు కురిసిన వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అంతా అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాలు తీవ్ర వరదలను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌టీఆర్ జిల్లా, విజయవాడలో వరదల ఉధృతి తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఈ వరదల వల్ల ఎన్‌టీఆర్ జిల్లాలో ఎనిమిది మరణించగా ముగ్గురు గల్లంతయ్యారు. ప్రస్తుతానికి వర్షాలు ఆగినా వరదల ఉధృతి మాత్రం అమితంగానే ఉంది. ఈ వరదల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్రంలోని ఎన్‌డీఏ కూడాటి ప్రభుత్వం తలమున్కలవుతోంది.

ఎప్పటికప్పుడు పరిస్థితుల గురించి ఆరా తీస్తూ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సీఎం చంద్రబాబు సహా ఇతర మంత్రులు సైతం ఎప్పటికప్పుడు అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుతుందని ప్రజలు ఆనందపడేలోపే వారికి కేంద్ర వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. ఐఎండీ చేసిన హెచ్చిరకలతో ప్రభుత్వం కూడా ఉలిక్కిపడింది. ఇప్పుడు ఏం చేయాలని ముందస్తు చర్యలకు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడానికి సీఎం సిద్దమవుతున్నారు. ఆ వార్త ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా వర్షాల ముప్పు తప్పలేదనడం. రానున్న వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడనున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది.

‘‘సెప్టెంబర్ 5-6వ తేదీని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ మేరకు సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం.. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకోని ఏర్పడనుంది. దీని వల్ల ఏపీ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు ఋతుపవన ద్రోణి ఆవరించి ఉండనుందని అంచనా. ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరెన్నో ప్రాంతాలు జలమయ్యాయి’’ అని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత చర్యలను చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని ఐఎండీ సూచిస్తోంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, వర్ష సమయాల్లో అత్యవసరం కాకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది.

ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్‌టీఆర్, విజయవాడ ఎదుర్కొంటున్న వరదపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ప్రజలకు అందించే సహాయక చర్యలపై యుద్దప్రాతిపదిక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు ఆహారం, నీరు, ఔషధాలను అందించడానికి అన్ని మార్గాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే డ్రోన్లను కూడా తీసుకొచ్చారు. హెలికాప్టర్లు వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహారం అందించడానికి డ్రోన్లను ప్రత్యామ్నాయంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం విజయవాడ కలెక్టరేట్ వేదికగా మూడు డ్రోన్లతో ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ మినీ హెలికాప్టర్‌లో ఉండే ఈ డ్రోన్లు అత్యధికంగా ఎంత బరువును మోయగలవు? ఎంత దూరం వరకు ప్రయాణించగలవు? మార్గంలో ఎక్కడైనా చెట్లుర స్తంబాలు వంటివి వస్తే ఎలా తప్పించుకుంటాయి? వంటి అంశాలను అధికారులు పరిశీలించారు.

సీఎం పర్యవేక్షణలో ట్రయల్ రన్

ఈ ట్రయల్ రన్‌ను సీఎం చంద్రబాబు పర్యవేక్షించారు. ఈ ట్రయల్ రన్‌లో డ్రోన్ల సహాయంతో దాదాపు 8 నుంచి 10 కిలోల ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటిని తీసుకెళ్లొచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. వీటిని ఏ మేరకు వినియోగించవచ్చు అన్న అంశంపై ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీలైనన్ని డ్రోన్లను సిద్ధం చేయాలని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రైయల్ రన్‌లోని మూడు డ్రోన్లు, మరో ఐదు డ్రోన్లతో సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. వీలైనంత త్వరగా మరికొన్ని డ్రోన్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

రంగంలోకి నేవీ హెలికాప్టర్లు

ఎన్‌టీఆర్ జిల్లా, విజయవాడ నగరంలో చేపట్టిన సహాయక చర్యల కోసం ఇప్పటికే నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. బాధితులకు ఆహారం, తాగునీరు అందించే పనిలో తమ మార్క్ చూపుతున్నాయి. ఇప్పటి వరకు 2, 97, 500 మందికి ఆహారం, తాగునీరు, ఔషధాలు అందించాయి. మరింత మందికి తమ సేవలు అందించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. మరికొన్ని హెలికాప్టర్లు కూడా విజయవాడకు చేరుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోసారి వరదల వచ్చేలోపు ప్రతి ఒక్కరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందుకు అన్ని విధాల సహాయం అందించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Read More
Next Story