విజయవాడలో ‘గద్దె’పైనే రాజకీయ చర్చ
విజయవాడ తూర్పు నుంచి రెండు సార్లు గెలిచిన గద్దె రామ్మోహన్. ఇప్పటి వరకు రెండుసార్లు ఓడిపోయి పరీక్షకు నిలిచిన దేవినేని అవినాష్.
టీడీపీ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ కొడతారా అనేది తెలుగుదేశం శ్రేణులు, ఎన్టీఆర్ జిల్లాతో పాటు విజయవాడ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దీనిపైన అందరూ చర్చించుకుంటున్నారు. ఒక వైపు గెలుపునే కేరాఫ్‌గా బరీలోకి దిగిన గద్దె రామ్మోహన్ టీడీపీ నుంచి, మరొక వైపు ఓటమి రికార్డు కలిగిన దేవినేని అవినాష్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి బరీలోకి దిగడంతో 2024లో గెలుపు ఎవరి వైపు నిలబడుతుందనేది స్థానిక నేతల్లో ఆసక్తి నెలకొంది. విజయవాడ తూర్పు నుంచి ఇప్పటికే రెండు సార్లు గెలిచిన రామ్మోహన్ మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా లేక విజయం సాధించి ఫస్ట్ విక్టరీని దేవినేని అవినాష్ తన ఖాతాలో జమ చేసుకుంటారా అనేది స్థానిక నేతల్లో జరుగుతున్న తాజా చర్చ.
స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ప్రయాణం ప్రారంభించిన గద్దె
1994లో గద్దె రామ్మోహన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. స్వతంత్ర అభ్యర్థిగానే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరీలోకి దిగిన గద్దె సుమారు 10వేల ఓట్ల మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు. నాటి నుంచి ఆయన విజయ ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి పి ఉపేంద్రపై తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. దాదాపు 87వేలకు పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గద్దె గెలిచారు. తర్వాత 2014లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ మీద దాదాపు 15వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా ఇదే నియోజక వర్గం నుంచి మరో సారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బొప్పన భవకుమార్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ సారి కూడా 15వేల ఓట్ల మెజారిటీతో బొప్పన భవకుమార్‌పై గద్దె రామ్మోహన్ గెలిచారు. 2024లో కూడా టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్‌కే సీటు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా అనేది ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
దేవినేని అవినాష్‌కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష
తండ్రి దేవినేని నెహ్రూ వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన దేవినేని అవినాష్‌కు తండ్రి చరిష్మా గెలిపించడంలో ఆదరించ లేక పోయింది. ఇంత వరకు గెలుపు దరి చేర లేదు. ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా కూడా విజయం దక్క లేదు. తొలుత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరీలోకి దిగారు. టీడీపీ నుంచి కేశినేని నాని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి కోనేరు రాజేంద్ర ప్రసాద్ బరీలోకి దిగిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన దేవినేని అవినాష్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. తర్వాత ఆయన టీడీపీలో చేరారు. 2019లో చంద్రబాబు ఆయనకు గుడివాడ టికెట్ ఖరారు చేశారు. కొడాలి నాని చేతిలో ఓడి పోయినా గట్టి పోటీ ఇచ్చారు. సుమారు 70వేలపైచిలుకు ఓట్లు సంపాదించ గలిగారు. ఆ తర్వాత మళ్లీ పార్టీ మారారు. టీడీపీ నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఆయనకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ తూర్పు టికెట్‌ను ఖరారు చేశారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన యలమంచిలి రవి, రాము
మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతో పాటు జనసేన అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన రాము కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. రాముకు గత ఎన్నికల్లో సుమారు 31వేల ఓట్లు వచ్చాయి. రవికి కూడా వర్గం ఉంది. వీరి ఇద్దరి వర్గాలు దేవినేని అవినాష్‌కు పనిచేస్తాయనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రవి 2009లో పీఆర్‌పీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నుంచి గెలుపొందారు. తర్వాత ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరినా దూరంగానే ఉంటూ తిరిగి పార్టీలో చేరారు. విజయవాడ తూర్పులో పట్టున్న నేతల్లో రవి ఒకరు. గత నాలుగేళ్లుగా ఇక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్ గెలిచి తొలి విజయాన్ని నమోదు చేసుకుంటారా, మూడో సారి గెలిచి గద్దె హ్యాట్రిక్ సాధిస్తారా అనేది స్థానికుల్లో ఆసక్తికరంగా మారింది.
ఎంపీ కేశినేని అవినాష్ కు బలం
ఇప్పటి వరకు తెలుగుదేవం పార్టీలో ఉన్న కేశినేని నాని వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో దేవినేని అవినాష్ కు ఒక బలంగా చెప్పొచ్చు. కేశినేని నానీ రెండు సార్లు టీడీపీ బలంతో పాటు తన సొంత బలంపై గెలుపు సాధించారని చెప్పొచ్చు. ఇప్పుడు కేశినేని బలంకూడా కలుపుకుంటే అవినాష్ బలం మరింత పెరినట్లైంది. ఇటువంటి పరిస్థితుల్లో గద్దె రామ్మోహన్ గెలుపు నల్లేరుపై నడక కాదనే విషయం గుర్తించాల్సిందేని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పట్టున్న నేతలపై టీడీపీ గురి
ఎన్టీఆర్ జిల్లాలో గతంలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలపై టీడీపీ దృష్టి సారించింది. వైసీపీలో చేరి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న వారిపైన గురి పెట్టింది. ఇలాంటి నేతలందరిని కలిసి తమకు సహకరించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలకు తెర తీసారు. అందులో భాగంగా వైసీపీలో పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్ లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Next Story