ఐదేళ్లల్లో కీలక దాడులను చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల్లో కేసుల భయం పట్టుకుంది. ముందస్తు బెయిళ్ల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ఐదేళ్ల కాలంలో దాడులకు పాల్పడుతూ ఇష్టా రాజ్యంగా వ్యవహరించిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై ఉక్కు పాదం మోపే దిశగా అడుగులు వేస్తోంది. మరి ముఖ్యమంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పలు చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల దాడులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో నాడు జగన్‌ ప్రభుత్వం అండ దండలతో రెచ్చి పోయిన మూకలు ఇప్పుడు తమ జాడ తెలియకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నారు. వీరి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.

అక్టోబరు 19, 2021న మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాడ్లు, కర్రలు, రాళ్లతో విచ్చల విడిగా దాడులకు పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలు, ఫర్నచర్‌ను ధ్వసం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం సిబ్బందిపైనా దాడులకు తెగబడ్డారు. కార్యాలయం ఆవరణలోని కార్లను ధ్వసం చేశారు. టీడీపీ కీలక నేత పట్టాభి ఇంటిపైనా వైఎస్‌ఆర్‌సీపీ దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లోని ఫర్నచర్‌ను ధ్వసం చేయడంతో పాటు వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు నాడు ఫిర్యాదు చేసినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. గత ఏడాది ఫిబ్రవరి 20 గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైన నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. కార్లను, ఫర్నచర్‌ను ధ్వసం చేసి అల్లకల్లోలం సృష్టించారు. ఇళ్ల వద్ద పార్కింగ్‌ చేసిన టీడీపీ నేతల కార్లను కూడా ధ్వసం చేశారు. ఈ ఘటన కూడా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపైనా నాడు విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, నారా చంద్రబాబు నాయుడు ముఖ్మమంత్రి కావడంతో కూటమి ప్రభుత్వం ఈ సంఘటనలను చాలా సీరియస్‌గా తీసుకుంది. జగన్‌ ప్రభుత్వంలో మరుగున పడిన ఈ అంశాలను తిరిగి తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా అడుగులు ముందుకు వేస్తున్నారు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సీసీ టీవీ ఫుటేజీలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాదాపు 70 మందికిపైగా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ దాడులకు సంబంధం ఉన్న పలువురు కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు టాక్‌ నడుస్తోంది. వీరి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.
ఈ దాడి వెలనుక వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల హస్తం ఉందని, వారి డైరెక్షన్‌లోనే దాడులు జరిగాయని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరో ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌తో పాటు విజయవాడ తూర్పు నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్‌ల ప్రమేయం ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమను అరెస్టు చేస్తారని ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణ కూడా వేగం పుంజుకుంది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాపులపాడు ఎంపీపీ నగేష్, తిప్పనగుంట సహకార సంఘం మాజీ చైర్మన్‌ మూల్పూరి ప్రభుకాంత్‌తో సహా ఇప్పటి వరకు దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకొని వచారణ చేపట్టినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి 70 మంది నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు త్వరలో వీరిని అరెస్టు చేయనున్నట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల రోజు తెనాలిలో చోటు చేసుకున్న సంఘటనపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. మే 13న పోలింగ్‌ నాడు సుధాకర్‌ అనే ఓటరుపై తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్, అతని అనుచరులు దాడికి పాల్పడి విచక్షణ రహితంగా కొట్టారు. దీనిపై రెండు రోజుల క్రితం కేసు నమోదు చేయాలని బాధితుడు సుధాకర్‌ గుంటూరు ఐజీకి ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్, అతని అనుచరులపై కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
గత ఐదేళ్ల కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి అండదండలతో రెచ్చి పోయి దాడులకు పాల్పడిన వారందరికీ ఇప్పుడు కేసుల భయం పట్టుకుంది. దీంతో కేసుల నుంచి బయట పడేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కూడా ఉన్నారు. నాటి జగన్‌ ప్రభుత్వ హయాంలో జోగి రమేష్‌ రెచ్చి పోయారనే విమర్శలు ఉన్నాయి. జోగి రమేష్‌ తన అనుచరులతో వెళ్లి ఉండవల్లిలోని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై కి వెళ్లి 2021లో నానా హంగా సృష్టించారు. రాళ్లతో దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ఇంటిపైకెళ్లి హంగామా సృష్టించిన తర్వాతనే నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జోగి రమేష్‌కు మంత్రి పదవి కట్టబెట్టారనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సంఘటన తెరపైకి వచ్చింది. తాడేపల్లి పోలీసులు దీనిపై కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్‌ కోసం జోగి రమేష్‌ హైకోర్టు చుట్టు తిరుగుతున్నారు. ఈ ఘటనలపై నాడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Next Story