ఇండిపెండెంట్ల దెబ్బకు రాప్తాడు లీడర్లు గిలగిల
x

ఇండిపెండెంట్ల దెబ్బకు రాప్తాడు లీడర్లు గిలగిల

హాట్ సీట్ రాప్తాడు సెగ్మెంట్లో రాజకీయాలు సెగలు చిమ్ముతున్నాయి. స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల తలరాతలు మార్చే పరిస్థితి ఏర్పడింది.


(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: "దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పరిటాల ఫ్యామిలీకి చెక్ పెట్టాలి" అనేది రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రయత్నం. "ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే..! వైఎస్ఆర్ సీపీకి చెక్ పెట్టాలి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డినీ ఇంటికి పంపాలి" అనేది మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ పట్టుదల.

ఎన్నికల సమయంలోనే కాకుండా, రాష్ట్రంలో రాజకీయంగా ఎప్పుడూ కాకపై ఉండే నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ స్థానం కూడా ఒకటి. ఆధిపత్యానికి పరాకాష్టగా నిలిచే రాప్తాడు నియోజకవర్గం పరిధిలో రాజకీయ స్థితి ఇది. ఇందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది.

పునర్విభజన తర్వాత రాప్తాడు నియోజకవర్గానికి మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో రెండుసార్లు పరిటాల సునీత విజయం సాధించారు. మంత్రి కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం పక్కా అనుకున్న పరిటాల కుటుంబాన్ని మొదటి సారి ఓటమి పలకరించింది. దీంతో 2024లో ఎలాగైనా భారీ మెజారిటీతో విజయం సాధించాలని పరిటాల కుటుంబం పట్టుదలతో ఉంది.

2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో పరిటాల శ్రీరామ్ ఓడిపోయారు. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న కురుబ, వాల్మీకి, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్ల అండతో తమ పట్టు సాధించాలని పరిటాల కుటుంబం కదులుతోంది. అయితే ఈ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేయాలని భావించే వారి నుంచి ఇబ్బందికర పరిస్థితులు లేకపోలేదనే భావన కూడా వ్యక్తం అవుతోంది.

పరిటాల కుటుంబ నేపథ్యం

పరిటాల రవీంద్ర.. ఇది పరిచయం అవసరం లేని పేరు. పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన పరిటాల రవీంద్ర ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2005లో ఆయన ప్రత్యర్థుల దాడిలో మరణించారు. అనివార్యమైన పరిస్థితుల్లో ఆయన భార్య పరిటాల సునీత పెనుగొండ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 లో రాప్తాడు నియోజకవర్గం ఏర్పడింది. 2014 వరకు పరిటాల సునీత ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పరిటాల రవీంద్ర కుమారుడు శ్రీరామ్ ఇక్కడ నుంచి ఓటమి చెందారు.

నియోజకవర్గ పరిధి విచిత్రం

రాప్తాడు అసెంబ్లీ స్థానం పరిధి విచిత్రంగా ఉంటుంది. సుమారు 2.45 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో రామగిరి, చెన్నై, కొత్తపల్లి, కనగానపల్లి మండలాలు సత్య సాయి జిల్లాలో ఉంటాయి. అనంతపురం రూరల్ రాప్తాడు ఆత్మకూరు నియోజకవర్గం పాత అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సింహభాగం బీసీలే అయినా రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల నేతలదే పెత్తనం. ఒకరిద్దరు బీసీ నేతలు పోటీ చేయాలని తాపత్రయపడినా ప్రధాన వైఎస్ఆర్ సీపీ, టిడిపి ఆ దిశగా అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబాల మధ్య పోరాటం సాగుతోంది.

ప్రచారంలో ఫెయిల్

రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించారు. టిడిపి అధికారంలో ఉండగా రాప్తాడు నియోజకవర్గంలో రూ. 5వేల కోట్లతో అభివృద్ధి చేసిన వివరాలను వెల్లడించారు. వీటిని ప్రజా బహుళయంలోకి తీసుకు పోవడంలో గత ఎన్నికల్లో సఫలం కాలేకపోయారనేది ఓ వాదన. అందుకు ప్రధానంగా.. " ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని వైఎస్ఆర్సిపి కోరడం. నవరత్న పథకాలు" బలంగా పనిచేయడంతో పాటు పరిటాల శ్రీరామ్ దూకుడుగా వ్యవహరించిన తీరు కూడా కలిసి రాలేదని భావిస్తున్నారు.

వీటన్నిటి అనుభవాల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని పరిటాల కుటుంబం సాగుతోంది.

కలిసొచ్చే అంశాలు..

మొదటి నుంచి కూడా పరిటాల కుటుంబం సామాన్య ప్రజలతో మమేకమవుతుంది. సామాజికత హిత కార్యక్రమాలతో చేరువ అవుతుంది. దివంగత ఎమ్మెల్యే పరిటాల రవి ఉన్నప్పటి నుంచి అమలు చేసిన కార్యక్రమాలను ప్రత్యేక సందర్భాల్లో ఆయన భార్య పరిటాల సునీత, కుమారుడు పరిటాల శ్రీరామ్ అమలు చేస్తూ, పేదల పక్షపాతిగా ఉంటారు. ఇవి ఇలా ఉంటే.. గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు అంతగా లేవనేది ఆ ప్రాంతంలో చెప్పే మాట. అంతేకాకుండా కురువ సామాజిక వర్గానికి చెందిన కనగానపల్లె జడ్పీటీసీ మాజీ సభ్యుడు బి ఈశ్వరయ్య, ఆయన సోదరుడు రామకృష్ణ కూడా ఇటీవల పరిటాల సునీత సమక్షంలో టిడిపిలో చేరారు.

అదే కోవలో నియోజకవర్గంలోని అనేక సామాజిక వర్గాల నేతలు మళ్లీ కలిసొస్తుండడం పరిటాల కుటుంబానికి ప్లస్ పాయింట్‌గా భావిస్తున్నారు. అధికారంలో ఉండగా జాకీ (గార్మెంట్స్) పరిశ్రమ తీసుకువచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని చెరువులను కృష్ణా జలాలతో నింపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి చూసి గతం ఎంతో ఘన కీర్తి అనే రీతిలో ప్రజలు భావిస్తున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి, సీసీ రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు సాగించారు. 2019 ఎన్నికల్లో ప్రజల ఏకపక్ష నిర్ణయాల వల్ల ఏమి పని చేయలేదు.

సోదరులే దెబ్బ..

రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దశాబ్దాల కాలంగా పరిటాల కుటుంబంపై పోరాటం చేసి ఎట్టకేలకు గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. స్వయానా ఈయన అన్నలు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార సరళి వల్ల ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. రాష్ట్రంలోని చాలా మంది ఎమ్మెల్యేల తరహాలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు అందులో ప్రధానంగా వారి సోదరుల తీరు వల్ల వైఎస్ఆర్సిపికి అనుకూలంగా పనిచేసిన నాయకులు కూడా దూరంగా ఉంటున్నారని, రెడ్డి సామాజిక వర్గంలోనే కొందరు రాప్తాడు వద్ద ఏర్పాటుచేసిన జాకీ పరిశ్రమ ప్రారంభం కాకుండానే యాజమాన్యం తిరిగి వెళ్లిపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు భూముల వ్యవహారంలో వారి ప్రమేయం కారణంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని చెబుతున్నారు.

ప్లస్:

రెండోసారి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మహిళల కోసం రూ. 20 కోట్లతో ఏర్పాటు చేయించిన అమ్మ డైరీ వల్ల పాడి రైతుల అభిమానాన్ని చూరగొన్నారు. మొదట డ్వాక్రా సంఘాల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. పదివేలు జమ చేయించి అమ్మ డైరీ ప్రారంభించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.. సభ్యులుగా ఉన్న మహిళలకు తిరిగి చెల్లించారని సమాచారం. ప్రభుత్వ సహకారంతో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు తాగునీటి కోసం పైప్ లైన్ నిర్మాణం సాగుతోంది. శ్రీశైలంలో నీరు లేకపోవడం, కాలువల్లో కృష్ణా జలాలు ప్రవహించని నేపథ్యంలో వీటి వల్ల ప్రయోజనం ఏంటి అనేది కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఈ అంశాల నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి ఏమంటున్నారంటే.. " రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలే నాకు రక్ష. పేద ప్రజలకు అందించిన ఆర్థిక సహకారం ఆదుకుంటుంది" అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

స్వతంత్రుల పోటు

రాప్తాడు నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష అభ్యర్థులకు 2024 ఎన్నికల్లో స్వతంత్రులు తలపోటుగా మారే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ బోయ రాజేష్, కనుముక్కల సానే ఉమారాణి నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. విముఖ పోటీ జరిగిన 2009 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన పరిటాల సునీత 1,750 ఓట్లతో గెలిచారు. 2014 ఎన్నికల్లో అనుకూల పవనాలు వేస్తున్న నేపథ్యంలో పరిటాల సునీత ఎనిమిది వేల ఓట్లతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తల్లి స్థానంలో పరిటాల శ్రీరామ్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు.

ఈయనపై వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసిన తోపదుర్తి ప్రకాష్ రెడ్డి 27 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో స్వతంత్రులు అభ్యర్థులు పోటీలో ఉండడం ఎవరి పుట్టి ముంచుతారోనని భావిస్తున్నారు. అందులో ప్రధానంగా.. కనగానపల్లె మండలం రాంపురం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ రాజేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈయనకు తోడు వైయస్ఆర్సీపీపై తిరుగుబాటుతో కనుముక్కల సానే ఉమారాణి పోటీ చేస్తున్నారు. " 2014 నుంచి వైఎస్ఆర్సిపి బలోపేతం కోసం కృషి చేశాను" అని ఉమారాణి గుర్తు చేశారు. "పెనుగొండ పుట్టపర్తి రాప్తాడు అనంతపురం సెగ్మెంట్లో అభ్యర్థుల విజయం కోసం పనిచేసిన తనకు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన సత్తా ఏంటో చూపించాలని 24వ తేదీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

వరదాపురం సూరి కూడా..?

ధర్మవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గోనిగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) కూడా స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) టికెట్ ఆశించారు. గత ఎన్నికల తర్వాత టిడిపి నుంచి ఆయన బిజెపిలో చేరారు. ధర్మవరం నుంచి పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ క్షేత్రస్థాయిలో చక్కదిద్దుకున్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో తనకు అవకాశం లభిస్తుందని భావించారు. అనూహ్యంగా బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ ధర్మవరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో సహకారం అందించడానికి గోనుగుంట్ల సూర్యనారాయణ ససేమిరా అంటున్నారు.

మరో ట్విస్ట్..?

రాప్తాడు అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరనేది స్పష్టత లేదంటున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత నా? లేక మళ్ళీ ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ బరిలో ఉంటారా? అనేది అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లు సమాచారం. పరిటాల సునీత పోటీలో ఉంటే.. పార్టీలకతీతంగా రెడ్డి సామాజిక వర్గం కూడా పరీక్ష సహకారం అందిస్తుంది అనేది ఇక్కడ ప్రధాన అంశం. మహిళా సానుభూతి ఓట్లు కూడా ఎక్కువ ఉంటాయని చెబుతున్నారు. పరిటాల శ్రీరామ్ తెరపైకి వస్తే పరిస్థితి తిరగబడి, వైఎస్ఆర్‌సీపీకి అనుకూలిస్తుందనే వాదన కూడా ఉంది.

ప్రధాన పార్టీలు టిడిపి అభ్యర్థిగా పరిటాల సునీత, వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య పోటీ తీవ్రస్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు. వీరి మధ్యలో స్వతంత్రులు రంగ ప్రవేశం చేస్తే మాత్రం ప్రధాన పార్టీల అభ్యర్థులు అంచనాలు తలకిందులయ్యే అవకాశం లేకపోలేదు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రధాన పార్టీల నాయకుల తలరాతలు తెలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా స్వతంత్ర అభ్యర్థులు ఎవరి రాజకీయ భవిష్యత్తును తిరగరాస్తారనేది పోలింగ్ వరకు వేచి చూడాల్సిందే.

Read More
Next Story