విశాఖలో నేవీ విన్యాసాలు...
x
విశాఖలో విన్యాసాల ప్రారంభోత్సవం

విశాఖలో నేవీ విన్యాసాలు...

గత నెలలోనే 50 దేశాల విన్యాసాలకు వేదికైన విశాఖ తీరం.. టైగర్ ట్రయాంప్ పేరిట మరో విన్యాసానికి వేదిక అవుతోంది. ఈ విన్యాసాల్లో ఐదు దేశాల త్రివిధ దళాలు పాల్గొన్నాయి.


(తంగేటి నానాజీ, విశాఖపట్నం)

గత నెల నిర్వహించిన మిలాన్ 2024లో భాగంగా 50 దేశాల నావికాదళాలు చేసిన విన్యాసాలకు విశాఖ వేదికైంది. కన్నుల పండుగలా జరిగిన వాటిని మరువక ముందే మరోసారి నేవీ విన్యాసాలకు విశాఖ వేదిక అవుతోంది. భారత్, యూఎస్ దేశాల మధ్య రక్షణ బంధం బలోపేతం కోసం టైగర్ ట్రయాంప్ పేరిట యుద్ధ విన్యాసాలు చేయడానికి విశాఖ తూర్పు నావికా దళం సన్నద్ధమైంది. విశాఖ వేదికగా తూర్పు నావికాదళం నిర్వహించనున్న ఈ విన్యాసాలు ఈనెల 31వ తేదీ వరకు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి విడత విన్యాసాలు హార్బర్ ఫేస్ కాగా రెండో దశ విన్యాసాలు సీ-ఫేస్‌లో జరగనున్నాయి. ఈ విన్యాసాలను సభ్య దేశాల అధికారులు, నేతలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు.



ఈ టైగర్ ట్రయాంప్-2024 యుద్ధ విన్యాసాల్లో ఐదు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఐఎన్‌ఎస్ ‘జలస్వ’ యుద్ధనౌకలో జరిగిన వేడుకల్లో భాగంగా ఇరు దేశాలకు చెందిన నేవీ అధికారులు పాల్గొని నేవీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ప్రారంభోత్సవంలో తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్‌కర్, యూఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్‌శెట్టి పాల్గొన్నారు. ఐదు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వకమైన వాతావరణంతో పాటు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సూచించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే యూఎస్‌కు చెందిన యుద్ధనౌకలతో పాటు ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, యూఎస్ త్రివిధ దళాలు తూర్పు నౌకాదళానికి చేరాయి.

మంగళవారం ప్రారంభమైన ఈ హార్బర్ ఫేజ్ విన్యాసాల్లో రాపిడ్ యాక్షన్ మెడికల్ టీం కూడా పాల్గొననుంది. ఇవి ఈనెల 25 వరకు జరుగునున్నాయి. ఇందులో రెండు దేశాలకు చెందిన దళాల శిక్షణ, సందర్శనలు, క్రీడా పోటీలు వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి. 26 నుంచి 31వ తేదీ వరకు సీ-ఫేస్ విన్యాసాలు జరుగుతాయి. ఈ విన్యాసాలు విశాఖ సముద్ర తీరానికి 40 నాటికల్ మైళ్ళ దూరంలో జరగనున్నాయి.



Read More
Next Story