వైఎస్‌ఆర్‌సీపీలో ఇంటిపోరు
x

వైఎస్‌ఆర్‌సీపీలో ఇంటిపోరు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇంటిపోరు ఎక్కువైంది. నాలుగు చోట్ల నేతలను ఇంట్లోని వారే వణికిస్తున్నారు. ఎక్కడెక్కడంటే..


టెక్కలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నదువ్వాడ శ్రీనివాస్‌కు ఇంటి పోరు తల నొప్పిగా మారింది. సొంత కుటుంబం నుంచే ఆయనపై వ్యతిరేకత రావడం, శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్ని ఆయన భార్య దువ్వాడ వాణి వ్యతిరేకించడం, భర్తపైనే తిరుగుబావుటా ఎగుర వేయడం, భర్తకు వ్యతిరేకంగా నామినేషన్‌ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇరువురికి సర్థి చెప్పడంతో వాణి తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. అయితే ఆమె శ్రీనివాస్‌కు వ్యతిరేకంగానే పని చేస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇది దువ్వాడ శ్రీనివాస్‌ గెలుపు ఓటములపై ప్రభావం చూపే చాన్స్‌ ఉందని ఆ పార్టీ శ్రేణుల్లో టాక్‌ నడుస్తోంది. దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె తండ్రి కూడా ఆ నియోజక వర్గంలో పేరున్న రాజకీయవేత.

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజక వర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు వ్యతిరేకంగా ఆయన బంధువు సువార గాంధీ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీలో నిలచారు. దీంతో సీతారామ్‌కు ఇబ్బందులు తప్పవని, ఓట్లు చీలే ప్రమాదం ఉందని స్ఙానికులు చర్చించుకుంటున్నారు. సీతారామ్‌కు ప్రత్యర్థిగా రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ తమ్మినేనికి స్వయాన భవమరిది కావడం విశేషం.
మంత్రి బూడి ముత్యాల నాయుడుకి కూడా ఇంటి పోరు తప్పడం లేదు. ఆయన కుమారుడే ఆయనపై తిరుగుబాటు ప్రకటించారు. తనకు కాకుండా తన అక్క అనురాధకు మాడుగుల సీటు ఇప్పంచడంతో కొడుకు రవికుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దీంతో ముత్యాల నాయుడుకి తలనొప్పి వచ్చి పడింది. ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్‌ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. తన సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు తలెత్తడం, స్వంత నియోజక వర్గం మాడుగుల నుంచి ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగడం ముత్యాల నాయుడుకి మైన్‌ అవుతుందనే టాక్‌ స్థానికుల్లో ఉంది. తన తండ్రిని, సోదరిని ఓడించాలని వీడియోలు చేసి సామాజిక మాద్యమాల్లో విడుదల చేయడం సంచలనంగా మారింది.
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంకు సొంత కుమార్తె ఎదురు తిరిగింది. తండ్రి ముద్రగడ పద్మనాభం పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పని చేయడం నచ్చని ఆమె తండ్రిపైనే కుమార్తె క్రాంతి విమర్శలు గుప్పించింది. తండ్రి ముద్మగడ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వంగ గీతకు ప్రచారం చేస్తుండగా కుమార్తె క్రాంతి మాత్రం పవన్‌ కల్యాణ్‌కు ప్రచారం చేస్తుండటం సంచలనంగా మారింది. తండ్రి ముద్రగడపై వ్యతిరేకంగా ఆయన కుమార్తె క్రాంతి చేసిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై ఆయన చెల్లెలు షర్మిల తిరుగుబాటు జెండా ఎగురవేసి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడప పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో నిలిచారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత జగన్‌కు లేదని ప్రతి రోజు విమర్శలు గుప్పిస్తున్నారు.
మంత్రి అంబటి రాంబాబుకు కూడా ఇంటి పోరు ఎదురైంది. ఆయన అల్లుడు గౌతమ్‌ సొంత మామకు ఓట్లేయొద్దని, ఆయన దుర్మార్గుడని, ఓడించాలని వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఇవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Read More
Next Story