వినూత్నంగా డిజిటల్‌ ప్రచారం

ప్రచారం కొత్తపుంతలు తొక్కింది. డిజిటల్‌ స్క్రీన్‌లపై కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ ఓట్లు అడిగే కార్యక్రమానికి అభ్యర్థులు శ్రీకారం చుట్టారు.


వినూత్నంగా డిజిటల్‌ ప్రచారం
x
Digital campaign

ఎన్నికల ప్రచారం బలప్రదర్శనగా మారుతోంది. అభ్యర్థులు లక్షల మంది జనాన్ని సమీకరించి సభలు, సమావేశాలు నిర్వహించడం సాధారణంగా మారింది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. డబ్బులు గురించి ఆలోచించొద్దు.. ప్రజలను సమీకరించండని స్థానిక నేతలను పురమాయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం పేరుతో లక్షలాది మంది జనాన్ని సమీకరించి సభలు నిర్వహించింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ రా.. కదిలిరా పేరుతో లక్షల మంది జన సమీకరణ చేసి భారీ బహిరంగ సభలు నిర్వహించింది.

మారిన ప్రచార స్వరూపం
ఎన్నికలనగానే అక్కడక్కడ సభలు సమావేశాలు పెట్టడం సర్వ సాధారణం. అయితే వీటి స్వరూపం కంప్లీట్‌గా మారిపోయింది. కూలిజనాన్ని తీసుకొచ్చినట్లు ఎన్నికల సభలకు ప్రజలను తీసుకొస్తే ఒక్కో వ్యక్తికి కనీసం రూ. 300ల డబ్బులు, భోజనం, రవాణా ఖర్చులు, పార్టీల వాళ్లే చెల్లిస్తున్నారు. పురుషులకైతే అదనంగా మద్యం కూడా సరఫరా చేస్తున్నారు.
మినీ వాహనాలపై డిజిటల్‌ స్క్రీన్‌లు
పట్టణాల్లో ప్రచారానికి మినీ వాహనాలపై డిజిటల్‌ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు. సినిమా స్రీన్‌ల మాదిరిగా వాహనానికి ఇరువైపులా బొమ్మలు.. మాటలు.. వినిపించి కనిపిస్తుంటాయి. దారిన వెళ్లే వారు సైతం రెండు సెకండ్లు ఆగి ఆ స్క్రీన్‌లను చూసి వెళ్తున్నారు. అధికార పార్టీ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల వివరాలు.. ఫొటోలు.. వీడియోలు స్క్రీన్‌లపై ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి మినహా మిగిలిన వారు ఈ స్క్రీన్‌లపై పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు.. మధ్య మధ్యలో పోటీ చేసే అభ్యర్థి ఫొటో ప్రదర్శిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అయితే గతంలో చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వచ్చే ఎన్నికల్లో ఇస్తున్న హామీల గురించి వివరిస్తూ ఫొటో.. వీడియోలు ప్రదర్శిస్తున్నారు. బాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలపై ఎక్కువుగా ఫోకస్‌ పెట్టారు. బాబు షూరిటీ.. భవిష్యత్‌ గ్యారెంటీ పేరుతో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. అభ్యర్థులు ప్రత్యేకంగా తయారు చేయించిన నియోజక వర్గ పాంప్లేట్లను కూడా బండ్ల వద్ద పంపిణీ చేస్తున్నారు.
ఫంక్షన్‌లకు ఠంచనుగా హాజరు
పట్టణాలు, గ్రామాల్లో ప్రచారం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలను కూడా వదలడంలేదు. పుట్టిన రోజు ఫంక్షన్లు.. సంతాప సమావేశాలు.. పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఉదయం 5గంటల నుంచి మొదలు పెట్టి రాత్రి 10 గంటల వరకు ఇంటింటి ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఎమ్మెల్యేల అభ్యర్థులు తమకు సన్నిహితంగా ఉండే నాయకులకు రోజు వారీ ఖర్చులతో పాటు కొంత మొత్తం కూడా ముట్ట చెబుతున్నారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు మిగతా పనులన్నీ పక్కన పెట్టి ప్రచారంలో పాల్గొనే విధంగా గ్రామ, స్థానిక నాయకులను ఎమ్మెల్యే అభ్యర్థులు మౌల్డ్‌ చేసుకుంటున్నారు.
ప్రసంగాలు వినేందుకు ఇష్టపడని ఓటర్లు
ప్రసంగాలు వినేందుకు ఓటర్లు పెద్దగా ఇష్టపడటం లేదు. సభ ప్రారంభం కాగానే ఒక్కరు లేక ఇద్దరు నాయకులు మాట్లాడిన తర్వాత తిరుగు ముఖం పడుతున్నారు. ఉదాహరణకు వైఎస్‌ఆర్‌సీపీ నేత విజయసాయిరెడ్డి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభకు వచ్చిన జనం వెనుదిరిగి వెళ్తుండగా సాయిరెడ్డి ప్రక్కనే ఉన్న మరో నేత మైక్‌ తీసుకొని అమ్మా వెళ్లొద్దమ్మా.. పెద్దలు మాట్లాడుతారు.. వెనక్కు రండమ్మా.. భోజనాలు ఉన్నాయి.. భోంచేసి వెళ్లండి అంటూ మైక్‌లో అనౌన్స్‌ చేయడం పలువురిలో చర్చకు దారి తీసింది. అంటే సభలు జరుగుతున్న తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రెండు పార్టీల మధ్యే విస్తృత ప్రచారం
ప్రస్తుతం విçస్తృతంగా ప్రచారం చేస్తోన్న పార్టీల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలే ఉన్నాయి. అప్పుడప్పుడు జనసేన కనిపిస్తుంది. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజెపీలు ఇంత వరకు తెరపైకి రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత తొలి సారిగా ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఏ కూటమి సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరై బీజేపీ కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టిందనిపించారు.
డబ్బులేనిదే ప్రచారం లేదని భారత కమ్యునిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేవివి ప్రసాద్‌ చెప్పారు. డబ్బులు ఇవ్వనిదే అభ్యర్థి వెంట ప్రచారానికి కూడా స్థానికులు రావడం లేదని ఆయన ఫెడరల్‌ ప్రతినిధితో అన్నారు. నాయకుడంటే గౌరవంతో నగులురు వెనక నడిచే వారని, ఇప్పుడు ఆ పరిస్థితుల్లేవన్నారు. ప్రచారం అయ్యేంత వరకు ప్రతి ఒక్కరికీ డబ్బు ఇవ్వడంతో పాటు సభలు సమావేశాలకు భారీ స్థాయిలోనే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఇదంతా ఒక ఎల్తైతే ఓటరుకు ఎన్నికల ముందు రోజు తప్పకుండా డబ్బులు, మద్యం చేరాల్సిందేనని చెప్పారు.


Next Story