కాకినాడ పోర్టు నుంచి దొంగతనంగా విదేశాలకు వెళుతున్న రవాణాపై విచారణ బుధవారం నుంచి మొదలవుతుంది. ప్రభుత్వం కలెక్టర్ నేతృత్వంలో బృందాన్ని నియమించింది.
ఏపీలోని కాకినాడ పోర్టులో జరుగుతున్న దొంగ రవాణాపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం బుధవారం నుంచి కాకినాడ కలెక్టర్ షాన్ మోషన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం విచారణ చేపట్టనుంది. ఇ:దులో పోలీస్ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు ఉంటారు. కాకినాడ పోర్టు నుంచి కొన్ని లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు సాధారణ బియ్యం కూడా దొంగ రవాణా జరుగుతున్నదనే నిర్థారణకు ప్రభుత్వం వచ్చింది. రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి కాకినాడ పోర్టులో ఒక షిప్ ను తనిఖీ చేశారు. అందులో సివిల్ సప్లైస్ రైస్ దొంగ రవాణా అవుతున్నట్లు గమనించి షిప్ ను నిలిపి వేశారు. ఆ షిఫ్ ఆఫ్రికా దేశానికి సంబంధించినదిగా చెబుతున్నారు. పోర్టు నిర్వహణ బాధ్యతలు గత పాలకులతో పాటు ప్రస్తుత పాలకులు కూడా కలిసి నిర్వహిస్తున్నారు.
విచారణ జరిగే తీరు ఎలా ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఆ షిప్ లో ఉన్న ప్రతి వస్తువునూ పరిశీలిస్తారు. షిప్ లో ఉన్న వస్తువులకు బిల్లులు ఉన్నాయా? ఉంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు. బిల్లులు సరైనవేనా? లేక దొంగ బిల్లులా? రైస్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు. వాటికి ఉన్న ఆధారాలు ఏమిటి? మిగిలిన వస్తువులు ఉంటే అవి ఎవరివి? వాటెల్లో ఏమి ఉన్నాయి. అనే వివరాలు సేకరిస్తారు. ఆ సందర్భంలో కలెక్టర్ ఎస్పీలు కూడా అక్కడే ఉంటారు. మాదక ద్రవ్యాలు కూడా పోర్టు నుంచి వస్తున్నాయనే అనుమానం ప్రభుత్వంలో ఉంది. గతంలో విశాఖ పోర్టులో కూడా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. చాక్లెట్లల్లో కూడా మాదక ద్రవ్యాలు కలిపి ఒక్కో చాక్లెట్ రూ. 40 లకు అమ్ముతున్నారు. ఇవి కూడా విదేశాల నుంచి వస్తున్నాయి. ఏ దేశం నుంచి వస్తున్నాయి. ఎవరు తెస్తున్నారనే వివరాలు కూడా కొంత వరకు పోలీసుల వద్ద ఉన్నాయి. నర్సరావుపేట పోలీసులు ఈ మేరకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ప్రధానంగా సివిల్ సప్లైస్ బియ్యం అక్రమ రవాణాపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం పెద్ద ఎత్తున ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిని టీడీపీ వారు ఇంకా ఎక్కువగా ప్రచారంలో పెట్టారు. ద్వారంపూడికి ఉన్న కంపెనీలు కూడా కొన్నింటిని మూసి వేయించేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. చెక్ పోస్టుల వద్ద పనిచేస్తున్న సిబ్బందిపై కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సివిల్ సప్లైస్ రైస్ ను కాకినాడలోని ఏయే మిల్లుల్లో రీసైక్లింగ్ చేయిస్తున్నారనే దానిపై కూడా విచారణ జరుగుతుంది. ఇందులో పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి కేసులు నమోదు చేయనున్నారు.
రిపోర్టు వచ్చాక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇందులో నేవీ వారు ఎవరు ఉన్నారు. వారి ద్వారా కూడా దొంగ వ్యాపారానికి దారులు తెరుచుకున్నాయనే కోణంలోనూ ఆలోచన చేస్తున్నారు. ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం.