కాశీబుగ్గ తొక్కిసలాట మృతులకు కేంద్ర సాయం రూ.2 లక్షలు
x

కాశీబుగ్గ తొక్కిసలాట మృతులకు కేంద్ర సాయం రూ.2 లక్షలు

హుటాహుటిన కాశీబుగ్గకు లోకేశ్, క్యూ కట్టిన మంత్రులు


శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం విచారకరమని సోషల్ మీడియా వేదికగా స్పందించారు (Kasibugga Stampede).
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనంతా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ (PM Modi) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందిస్తూ.. ‘‘తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని విచారం వ్యక్తం చేశారు.
కాశీబుగ్గకు బయల్దేరిన లోకేశ్
కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో కాశీబుగ్గకు మంత్రి నారా లోకేశ్‌ వెళుతున్నారు. ఆయన కన్నా ముందే పలువురు మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు అక్కడికి చేరారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మరోవైపు కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఘటనాస్థలికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన బయలుదేరారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పర్యటిస్తుండగా ఈ వార్త తెలిసింది. వెంటనే తన పర్యటన రద్దు చేసుకుని శ్రీకాకుళం పయనమయ్యారు.
విచారణకు ఆదేశం..
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత సమగ్ర విచారణకు ఆదేశించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. టెంపుల్ ను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది.
Read More
Next Story