ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వైఎస్సార్‌సీపీకి బలంగా ఉంది. గత ప్రభుత్వం అధికారం చేపట్టిన కొత్తలో శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేది. దీంతో కొన్ని బిల్లులు వెనక్కి తిప్పి పంపించారు. ఈ వ్యవహారంతో సహనం కోల్పోయిన నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేసేందుకు ఏకంగా తీర్మానం కూడా పెట్టారు. తరువాత దానిని తిరిగి వెనక్కి తీసుకున్నారు. అదే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఎదురు కాబోతోంది. ఏ పార్టీ మెజారిటీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మండలిలో సభ్యులు కొనసాగటం పరిపాటిగా మారింది. నిజానికి బిల్లులు ప్రజోపయోగమా? కాదా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆమోదించాల్సి ఉంటుంది. పైగా దీనికి మేధావుల సభ అని పేరు. ఆ పేరును చెరిపేసేలా ఇక్కడి పెద్దలు వ్యవహరిస్తుంటారు. వైఎస్సార్‌సీపీకి మండలిలో మెజారిటీ ఉన్నందున ఆ పార్టీ నిర్ణయం మేరకే బిల్లులు పాసవుతాయి.
మండలిలో వైఎస్సార్‌సీపీదే హవా..
ఏపీ శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 55గా ఉంది. అందులో వైఎస్సార్‌సీపీకి 39 మంది సభ్యుల మెజారిటీ ఉంది. తెలుగుదేశం పార్టీకి 9 మంది, జనసేన పార్టీకి ఒకరు, పీడిఎఫ్‌కు ఇద్దరు, టీచర్స్ నియోజకవర్గాల నుంచి నలుగురు ఉన్నారు. టీచర్స్‌లో ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల టీచర్స్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణా, గుంటూరు నియోజకవర్గాల నుంచి గెలుపొందిన టి కల్పలతారెడ్డిలు వైఎస్సార్‌సీపీని బలపరుస్తున్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు సీపీఎంను బలపరుస్తున్నారు. విజయనగరం ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్ చేసి శాసన మండలి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా మండలి చైర్మన్‌ను వైఎస్సార్‌సీపీ కోరింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఇక కడప జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన సి రామచంద్రయ్య, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పోతుల సునీత తెలుగుదేశం పార్టీలో చేరారు. అంటే కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం పది మంది బలం ఉండగా వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైన మరో ముగ్గురి బలం కూడా వారికి పెరిగింది. మొత్తం 13 మందితో కూటమికి బలం ఉంది. వైఎస్సార్‌సీపీ నుంచి తోట త్రిమూర్తులు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే కూటమి బలం మరొక సభ్యునితో కలిపి 14కు చేరుతుంది. కాకినాడ నుంచి గెలుపొందిన కర్రి పద్మశ్రీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆమెతో కలిపి కూటమి బలం 15కు చేరింది. అంటే ప్రస్తుతం వైఎస్సార్‌సీపీకి 39 మంది సభ్యులు ఉంటే అందులో ఇద్దరు తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరగా మరో ఇద్దరు చేరకుండానే మద్దతు ఇస్తున్నారు. ఒకరు జనసేనను బలపరుస్తున్నారు. అంటే ప్రస్తుతం మండలిలో వైఎస్సార్‌సీపీ బలం 39 నుంచి 34కు పడిపోయింది. అయినా వైఎస్సార్‌సీపీ సభ్యులదే మండలిలో హవా.
వ్యూహాలకు ప్రతి వ్యూహాలు
మండలిలో వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య బిల్లులు పాసయ్యే అవకాశం ఉంది. చర్చలు కూడా అధికార కూటమికి వ్యతిరేకంగా ముందుకు సాగుతాయి. చైర్మన్ కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన వారే కావటం వల్ల కావాలని కూడా బిల్లులు వెనక్కి పంపిస్తారనే చర్చ ప్రజల్లో సాగుతోంది. అధికార కూటమి ఎమ్మెల్సీలను తమ కనుసన్నల్లో ఉంచుకుని ముందుకు సాగే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ కూడా ఉంది. ప్రలోభాలకు లొంగితే వైఎస్సార్‌సీపీకి అవమానాలు జరిగే అవకాశం ఉంటుందనే చర్చ కూడా ఉంది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి బలం వైఎస్సార్‌సీపీకి ఉన్నందున వారి అధికారిక సమయం ముగిసే వరకు కూటమి సభ్యులు మండలిలో బలం కోసం ఎదురు చూడాల్సిందే.