ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు, వారి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మూడు ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బుధవారం నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం ఎయిర్‌ పోర్టుకు సమీపంలోని మేధా టవర్స్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలతో పాటు రాజకీయ సినీ ప్రముఖులు తరలి వచ్చారు. అటు సభా ప్రాంగణం సైతం జనాలతో కిక్కిరిసిపోయింది.

చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వేదికపై మూడు ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగాయి. సీఎంగా ప్రమాణం చేశాక వేదికపై ఉన్న నరేంద్ర మోదీ ఆయనకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాదాభివందనం చేయబోగా అందుకు మోదీ వారించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సభా ప్రాంగణంలోని జనాలు ఈ సన్నివేశం చూసి ఈలలు, కేకలతో హోరెత్తించారు. దీంతో కొన్ని క్షణాల పాటు ప్రాంగణం మొత్తం దద్దరిల్లి పోయింది. అనంతరం చంద్రబాబు వేదికపై ఉన్న ఇతర అతిథులకు నమస్కరించారు. అనంతరం కుర్చీలో కూర్చుని చాలా సేపు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారు. పలు సందర్భాల్లో నవ్వుతూ మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో సీరియస్‌గా కూడా ఆయన ముఖం కనిపించింది.
మంత్రుల ప్రమాణాలు పూర్తయిన తరువాత ప్రధాన మంత్రి వేదికపై నుంచి కిందకు దిగేందుకు అడుగులు వేస్తుండగా పవన్‌ కళ్యాణ్‌ పీఎం దగ్గరకు వెళ్లి రిక్వెస్ట్‌ చేశారు. మా అన్నయ్య చిరంజీవి ఇక్కడే ఉన్నారని ఆయనున ఒక్కసారి పలకరించాలని కోరారు. వెంటనే వెనక్కి తిరిగిన ప్రధాని మోదీ ఇద్దరినీ ఆలింగనం చేసుకుని అభినందించారు. దీంతో పలువురు మెగా అభిమానులు ఆనందంతో కేరింతలు వేశారు. మెగా అభిమానులను భావోద్వేగానికి గురి చేసే మరో అద్భుత ఘట్టం కూడా చోటు చేసుకుంది. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వేదికపై ఉన్న అతిరథ మహారథులను నమస్కరించిన పవన్‌ కళ్యాణ్‌. తన సోదరుడు, మెగాస్టార్‌ చిరంజీవికి పాదాభివందనం చేశారు. చిరంజీవి నిలువరించబోయినా పవన్‌ తన అన్నయ్య పాదాలను తాకి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోని షేర్‌ చేస్తూ మెగా ఫ్యాన్స్‌ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story