బాబుకీ అంత ఈజీ కాదు!  టీడీపీలోనూ ఓ రేంజ్‌లో ముఠా కుమ్ములాటలు
x
టీడీపీ జెండాలు

బాబుకీ అంత ఈజీ కాదు! టీడీపీలోనూ ఓ రేంజ్‌లో ముఠా కుమ్ములాటలు

ప్రతిపక్ష టీడీపీలోనూ పరిస్థితి అనుకున్నంత సజావుగా ఏమీ లేదు. పార్టీలో ఉంటూనే చంద్రబాబు, లోకేశ్‌పై సెటైర్లు వేసే వాళ్లు, చరకలంటించే వాళ్లు చాలామందే ఉన్నారు...


ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కుమ్ములాటలపై దృష్టి పెట్టారు. వైసీపీ నుంచి కీలక నేతలను ఓవైపు టీడీపీలో చేర్చుకుంటూనే.. మరోవైపు పార్టీలోని వర్గ విభేదాలపై దృష్టి సారించారు. ఎక్కడెక్కడ సీట్ల పంచాయితీలున్నాయో, ఎక్కడెక్కడ ముఠా తగాదాలున్నాయో గుర్తించే పనిలో పడ్డారు. ఇంకోపక్క, జేసీ దివాకర్‌రెడ్డి లాంటి హెవీ వెయిట్స్‌ను ఎలా దారికి తెచ్చుకోవాలో కూడా తర్జనభర్జన పడుతున్నారు.

ముఠా కుమ్ములాటలపై దృష్టి...


ప్రతిపక్ష టీడీపీలోనూ పరిస్థితి అనుకున్నంత సజావుగా ఏమీ లేదు. చాలా జిల్లాల్లో పార్టీ ముఠా కుమ్ములాటలున్నాయి. పార్టీలో ఉంటూనే పార్టీ అధినేతను, వారి కుమారుడు లోకేశ్‌పై సెటైర్లు వేసే వాళ్లు, చరకలంటించే వాళ్లూ ఉన్నారు. కొన్నేళ్లుగా పార్టీలో పాతుకుపోయి ప్రతి దాన్లో తలదూర్చే నేతలకు ఈ ఎన్నికల సందర్భంగా చెక్‌ పెట్టాలని చంద్రబాబు మంతనాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే కేశినేని నాని బయటకు వెళుతున్నాఆపే ప్రయత్నం చేయలేదని సమాచారం. విజయవాడలో రెండేళ్లుగా కేశినేని బద్రర్స్‌ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మొదటి నుంచి టీడీపీ అధిష్టానం కేశినేని చిన్ని వైపు మొగ్గు చూపుతున్నా.. నాని సిట్టింగ్‌ ఎంపీగా ఉండటంతో సంయమనం పాటిస్తూ వచ్చింది. పార్లమెంట్‌ పరిధిలోని పలువురు నేతలతో నానితో ఉన్న వివాదాలపై పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలో కూడా కేశినేని గెలుపొందడమే దీనికి కారణం. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాని, చిన్ని మధ్య ఉన్న గ్యాప్‌ అంశాన్ని ఎలా సరిచేయాలా అని ఆలోచించింది. తిరువూరు ఎపిసోడ్‌ కలిసి వచ్చి కేశినేని నానీయే పార్టీని వీడటంతో ఇక్కడి వివాదానికి పుల్‌స్టాప్‌ పడింది. ఎన్నికల్లో అన్నదమ్ముల పంచాయితీతో పార్టీకి ఇబ్బంది కలుగుతుందనుకున్న తరుణంలో నాని వెళ్లిపోవడం టీడీపీకి కలిసివచ్చింది.

కులముద్రను పొగొట్టడమే ప్రధానం...

టీడీపీ ఉన్న కుల ముద్రను చెరిపేయడమే చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా ఉంది. నిజానికి టీడీపీ బలహీనవర్గాల పునాదులపై పుట్టిందనే అభిప్రాయం ఉండేది. అయితే 2014-2019 మధ్య చంద్రబాబు ఓ సామాజికవర్గానికే ఎక్కువగా ఉపయోగపడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో బాగానే దెబ్బతీసింది. ఫలితంగా చంద్రబాబు అనేక విమర్శలు ఎదుర్కొవాల్సివచ్చింది. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడా ముద్రను చెరిపేసి అన్ని వర్గాలను ఇముడ్చుకునే పనిలో పడ్డారు. దానిలో భాగంగానే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను దగ్గరకు చేర్చుకున్నారన్న వాదన ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం వీరిద్దరూ కలిసే నడుస్తున్నారు. సభలు కూడా టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

తలనొప్పిగా మారిన గుడివాడ..

అటు.. గుడివాడలో NRI వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వర్‌రావు మధ్య వివాదం ఉండేది. దాన్ని కొలిక్కితేవడానికి చంద్రబాబు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏడాదిపాటు గుడివాడలో రెండు వార్గాలు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో వెంకటేశ్వర్‌రావును పిలిపించుకొని మాట్లాడిన చంద్రబాబు.. సమస్య సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత గుడివాడ ఇన్‌చార్జిగా వెనిగండ్ల రాముని ప్రకటించారు.

నంద్యాలలోనూ అంతే...


నంద్యాలలోనూ భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఎండీ ఫరూక్‌ వర్గాల మధ్య వివాదం ఉండేది. మొన్నీమధ్య ఆళ్లగడ్డ సభకు వెళ్లినపుడు ఆ సమస్యపై దృష్టి పెట్టి ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. నంద్యాలలో ఇన్‌చార్జిగా ఉన్న బ్రహ్మానందరెడ్డిని తప్పించి.. అక్కడ ఫరూక్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు రా.. కదలిరా సభకు ఏవీ సుబ్బారెడ్డిని దూరంగా ఉంచి ఘర్షణలకు తావు లేకుండా చేశారు.

అసలు తలనొప్పి జేసీ దివాకర్‌రెడ్డితోనే...

అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి వ్యవహారంలో కూడా చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దివాకర్‌రెడ్డి అనారోగ్యం కారణంగా గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జేసీ పవన్‌రెడ్డికి టికెట్‌ కేటాయించడంతో పార్టీ వర్గాల్లో వ్యతిరేక వచ్చింది. ఈసారి కూడా జేసీ కుటుంబం పోటీలో నిలిస్తే.. తలనొప్పి తప్పదని భావించిన చంద్రబాబు.. అనంతపురం పార్లమెంట్‌ సీటు బీసీలకు కేటాయిస్తామని ప్రకటించారు. ఇక విశాఖలో అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య గ్రూప్‌ పాలిటిక్స్‌ పార్టీకి చేటు చేస్తాయని అందరూ భావించారు. దీంతో ఒకరి పరిధిలోకి ఒకరు రాకుండా గిరిగీసి పెట్టడంతోపాటు.. ఇరువురి మధ్య వివాదాలు రాకుండా సెట్‌ చేస్తున్నారు.

రాజమండ్రిలో తారాస్థాయికి చేరిన విభేదాలు..


రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య వివాదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఎలా పరిష్కరించాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. ఓ పక్క పార్టీలో అతిపెద్ద సీనియర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మరోపక్క పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్న కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం.. వీళ్ల గొడవను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే. ఇలా వివాదాలున్న నియోజకవర్గాలు దాదాపు 20వరకు ఉన్నాయని అంచనా. వీటిని పరిష్కరించి ముందుకు సాగకపోతే 2024 సంవత్సరం కూడా చేదుగానే మిగిలిపోయే అవకాశం ఉంది.

Read More
Next Story