పోలవరాన్ని పరిశీలించిన నిపుణుల బృందం
x

పోలవరాన్ని పరిశీలించిన నిపుణుల బృందం

అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించడం ప్రారంభించింది. నాలుగు రోజులు సాగే వారి పర్యటనలో ఎన్నో అంశాలపై చర్చలు జరగనున్నాయి. అవేంటంటే.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న అంశాల్లో పోలవరం ప్రాజెక్ట్ టాప్ 3లో తప్పకుండా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈసారైనా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందా లేదంటే మరో ప్రభుత్వం ఏర్పాటును చూడాల్సి వస్తుందా? అన్న అనుమానాలు అధికం అవుతున్నాయి. అదే విధంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలవరంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడి పరిస్థితులు, మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలు, గత ఐదేళ్లలో చేపట్టిన పనులు, వాటి పురోగతి వంటి పలు అంశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తాజాగా ప్రాజెక్ట్ స్థితిగతులను అంచనా వేయడానికి, లోటుపాట్లను ఎత్తి చూపడం కోసం అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని రంగంలోకి దించనున్టన్లు కూడా అధికారికంగా ప్రకటించారు. వారు ప్రాజెక్ట్‌ సంబంధించిన డిజైన్స్, నిర్మాణ సమయం ఇలా అన్ని విషయాలను పరిశీలించి నివేదిక అందిస్తారని, దాంతో పాటుగా నిర్మాణానికి కావాల్సిన సలహాలు సూచనలు కూడా అందిస్తారని వెల్లడించారు.

పోలవరం చేరుకున్న నిపుణులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పి అంతర్జాతీయ నిపుణుల బృందం ఎట్టకేలకు రాష్ట్రానికి చేరుకుంది. పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా పరిశీలిస్తోంది. వారితో పాటు స్థానిక అధికారులు కూడా ఈ సందర్శన, పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణుల బృందం.. ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులు ఏంటి? పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి? ఎప్పుడు ప్రారంభించాలి? వంటిని పరిశీలిస్తారు. వాటితో పాటుగా నాలుగు రోజులు సాగే వీరి ఈ పర్యటనలో వారు డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్‌లను కూడా పరిశీలించి పనుల పురోగతిపై ఓ నివేదిక విడుదల చేయనున్నారు.

నేటి నుంచి మొదలైన పనులు

శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న అంతర్జాతీయ నిపుణుల బృందం.. అక్కడే కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమైంది. అనంతరం రాత్రికి రాజమండ్రికి చేరుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి పోలవరం సైట్‌ను పరిశీలించారు. ప్రాజెక్ట్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు నుంచే వారు తమ పనిని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు సైట్‌కు దగ్గర్లోనే ఉండి వారు ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తారు.

ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ప్రతి కట్టడాన్ని వారు క్షణ్ణంగా పరిశీలిస్తారు. అందుకు అనుగుణంగా వారి పర్యటన షెడ్యూల్ సిద్ధం చేయబడింది. రెండు రోజుల పాటు పరిశీలన పూర్తయిన తర్వాత అక్కడి సమస్యలపై చర్చించనున్నారు. ఈ చర్చల్లో ప్రాజెక్ట్ అథారిటీ ప్రముఖులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సీఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధులు, వ్యాప్కోస్, బావర్, కెల్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రి ప్రతినిధులు పాల్గొంటారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణుల బృందం చర్చించనున్నారు.

అంతర్జాతీయ స్థాయి నిపుణులు

పోలవరం ప్రాజెక్టులో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అవసరమని కేంద్ర జలసంఘం నిర్ణయించిన క్రమంలో ఈ అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్‌ ఏజెన్సీ అఫ్రి సాయం తీసుకుంటున్నారు. వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్‌ బి పాల్, గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌, కెనడాకు చెందిన రిచర్డ్‌ డోన్నెల్లీలు నియమితులయ్యారు. పోలవరం ప్రాజెక్టులో సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో వీరంతా నిపుణులు. అంతర్జాతీయ డ్యాం భద్రత నైపుణ్యం, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్‌ సొల్యూషన్స్, సివిల్‌ ఇంజినీరింగ్, హైడ్రాలిక్‌ నిర్మాణాలు, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండటంతో వీరిని ఎంచుకున్నట్లు కేంద్ర జలసంఘం పేర్కొంటోంది.

Read More
Next Story