
విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో భోజనశాల వద్ద దృశ్యం
విశాఖలో పెట్టుబడులే కాదు…హైదరాబాద్ మటన్ బిర్యానీకీ గిరాకీ ఎక్కువే !
గుంటూరు కోడి కూర, గ్రిల్డ్ సొర చేప, కారపు పొడులతో ఘుమఘుమలాడిన ఆంధ్రవంటకాలు
ముక్కులు తుడుచుకుంటూనే గుంటూరు కారంతో వండిన కోడి కూర తినేవాళ్లు కొందరు, where is Hyderabad Mutton Biryani? (హైదరాబాద్ మటన్ బిర్యానీ ఎక్కడ?) అని అడిగే వాళ్లు ఇంకొందరు, నిప్పులపై కాల్చిన సొరచేప కోసం ఎగబడిన వాళ్లు మరికొందరు..
ఏమిటీ, ఎక్కడా అనుకుంటున్నారు కదూ..
విశాఖపట్నంలో నవంబర్ 14 నుంచి రెండు రోజుల పాటు జరిగిన 30వ సీఐఐ సదస్సు భోజనశాలలో దృశ్యాలివి. ఈ సదస్సుకు సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సదస్సులో దాదాపు 70 రకాల ఆహార పదార్థాలను వడ్డించారు. అందులో ప్రత్యేకించి నాన్ వెజ్ సెక్షన్ కిటకిటలాడింది.
ఇన్వెస్టర్ల పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రాంతీయ రుచులతో నోరూరించేలా చేసింది. వీటితో పాటు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన వంటకాలనూ అందించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను చాటింది.
దేశం నలుమూలల నుంచి వచ్చిన వారితో పాటు విదేశీ అతిథులను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసిన వంటలు అలరించాయి. ప్రత్యేకించి లంచ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ వంటల వైవిధ్యాన్ని ప్రతిబింబించింది. సంప్రదాయ ఆంధ్ర వంటకాలతో పాటు ఉత్తర భారతీయ వంటలు, అంతర్జాతీయ వంటకాలు అందుబాటులో ఉంచారు.
ఆంధ్రమాతగా చెప్పే గొంగూర మొదలు గుంటూరు కారం వరకు ప్రత్యేకంగా నిలిచాయి. గుంటూరు కారం, పచ్చిమిర్చితో వండిన కోడికూర- వెరీ హాట్ గురూ- అన్నట్టుగా అయిపోయింది. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ మటన్ బిర్యానీ, లెమన్ క్రీమ్ సాస్ తో సర్వ్ చేసిన గ్రిల్డ్ చేపల కూర హాట్ కేకులయ్యాయంటే నమ్మాలి.
నాన్‌వెజ్ విభాగం ప్రతినిధులతో కిటకిటలాడింది. వెజిటేరియన్ ఎంపికల్లో థాయ్ బాసిల్ నూడుల్స్, కొత్తిమీర గుత్తివంకాయ, గార్డెన్ వెజిటబుల్స్, మామా రోసా సాస్‌తో పాస్తా, గ్రిల్డ్ పన్నీర్ ఉన్నాయి.
ఇక, ఇండియన్ స్టైల్ లో వండిన వంటకాలలో పనీర్ లబాబ్దార్, సబ్జీ నిజామీ హాండీ, పులిహోర, జాఫ్రానీ మోతి పులావ్, వైట్ అన్నం, వెల్లుల్లి దాల్ తక్కా, అవకాయ పప్పు, సాంబారు, మిల్లెట్ ఖిచ్డీ బాగా ఆకట్టుకున్నాయి. రొటీ, దాల్, నెయ్యి, కారప్పొడులు, పెరుగు, పెరుగన్నం, మజ్జిగ పులుసు, ఉలవ చారు, అప్పడాలు, ఊరగాయలు, సలాడ్లు, పొడులు వంటి సంప్రదాయ వంటకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎన్ని రకాల డిజర్ట్సో...
ఐస్ క్రీములైతే బోలెడన్ని రకాలు.. చాక్లెట్ ఫడ్జ్ బ్రౌనీస్, రోజ్ ఫిర్నీ, జౌక్-ఎ-సాహి వంటి డిజర్ట్స్, రకరకాల వెస్ట్రన్ ఐస్‌క్రీమ్‌లతో భారతీయ ఆతిథ్యాన్ని అలరింపజేశారు. విశాఖ తూర్పు తీరనా పడమటి సంధ్యారాగాన్ని వినిపించారు.
"ఇక్కడి వంటలు చాలా రుచిగా ఉన్నాయి. ఎన్ని రకాల వంటలు రుచి చూశామో. మాకు ఇంత మసాలా అలవాటు లేకపోయినా, నిజంగా ఆస్వాదించాను," అని సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రతినిధి మీడియా వాళ్లతో అనడం గమనార్హం.
"విశాఖపట్నానికి వచ్చిన రోజునుంచి ఇక్కడి భోజనం ఆస్వాదిస్తున్నాను. ఇక్కడ వడ్డిస్తున్న అనేక వంటకాలను రుచిచూశాను. నాకిష్టమైన వాటి జాబితా తయారు చేసుకుంటున్నాను. ఇంటికి వెళ్లిన తర్వాత వాటి రెసిపీలను ఆన్లైన్లో చూసి తప్పకుండా వండుతాను," అని మరో విదేశీ ప్రతినిధి పేర్కొన్నారు.
అమెరికా నుంచి వచ్చిన తెలుగు మూలాలున్న వారు గోంగూర పప్పు, గోంగూరతో చేసిన మాంసాహార పదార్ధాలపై బాగా మక్కువ చూపారు.
ఈ రెండు రోజుల సదస్సులో సుమారు వంద రకాల వంటకాలను వండినట్టు తెలుస్తోంది.
Next Story

