దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్స్

కూలి పనులు చేస్తారు. విజయవాడలో రెండున్నర కోట్ల విలువైన యాపిల్‌ ఫోన్స్‌ దొంగిలించారు. ఎవరు వారు?


చిల్లర దొంగతనాలతో ఎన్నాళ్లు ఇలా బతుతాం. ఏదైనా పెద్ద దొంగతనం చేసి సెటిల్‌ కావాలి. అందుకు నా మిత్రుడొకడు మంచి ప్లాన్‌ చెప్పాడు. మీరు ఊ.. అంటే కానిద్దాం అన్నాడు డీప్‌ చంద్‌ ప్రజాపతి అనే యువకుడు. అందుకు తన మిత్రులు సై అన్నారు. వీరిది ఉత్తరప్రదేశ్‌ లోని జౌన్‌పూర్‌ జిల్లా. దొంగతనం చేసింది ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ. వీరు అక్కడి నుంచి విజయవాడకు వచ్చి ఎలా దొంగతనం చేశారు. ఎంత మంది ఉన్నారనేది తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ఉత్తరప్రదేశ్‌ లోని జౌన్‌పూర్‌ జిల్లాకు చెందిన వీరు వివిధ గ్రామాలకు చెందిన వారు. మొత్తం ఆరుగ్గురు నిందితుల్లో ముగ్గురు కూలిపనులు చేస్తూ జీవిస్తున్నారు. ఇద్దరు ఆర్టీవో ఏజెంట్లుగా ఉన్నారు. ఒకరు కార్‌ ట్రావెల్స్‌ నడుపుతున్నాడు. కార్‌ ట్రావెల్స్‌ నడుపుతున్న వ్యక్తికి రంజిత్‌ అనే వ్యక్తి మంచి స్నేహితుడు. రంజిత్‌ ఎవరు? ఏమి చేస్తుంటాడనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు. రంజిత్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
రంజిత్‌ ప్లాన్‌ చెప్పాడు..
ఎక్కడ దొంగతనం చేయాలి. ఎలా చేయాలి అనేది అంతా రంజిత్‌ ప్లాన్‌. అమలు చేసింది అతని స్నేహితుడు దీప్‌ చంద్ర ప్రజాపతి. దీప్‌ చంద్ర ప్రజాపతి జలాల్‌పూర్‌ లో కార్‌ ట్రావెల్స్‌ నడుపుతున్నాడు. అతనికి స్నేహితులైన మాయ జయప్రకాష్, సునీల్‌ కుమార్‌ సరోజ్, బ్రిజేష్‌ కుమార్‌లతో దొంగతనం విషయం చెప్పాడు. డబ్బు సంపాదించాలంటే ఇదొక్కటే మార్గమని జనవరి 20న షాపు వద్ద కూర్చుని మాట్లాడుకున్నారు. దొంగతనం చేయాల్సింది విజయవాడలోని ఎనికేపాడులో ఉన్న గోడౌన్‌ లో. గోడౌన్‌ లొకేషన్‌ రంజిత్‌ అనే స్నేహితుడు పంపించాడు. ఆ గోడౌన్‌లో యాపిల్‌ ఫోన్స్‌ కొన్ని యాక్సెసరీస్‌ ఉన్నాయి. వాటిని దొంగిలిస్తే చాలు, అమ్మే పని రంజిత్‌ చూసుకుంటానని నాకు చెప్పాడని డీప్‌చంద్‌ వారికి చెప్పారు.
ఖర్చులకు అందరూ డబ్బులు ఇచ్చారు..
విజయవాడ వెళ్లేందుకు ఖర్చుల కోసం డబ్బులు సమకూరుస్తామని మాయ జయప్రకాష్, సునీల్‌ కుమార్‌ సరోజ్‌లు చెప్పారు. వీరి స్నేహితులైన బ్రిజేష్‌ కుమార్‌ ఉగ్ర, మిథిలేష్‌ కుమార్, సురేంద్రకుమార్‌ పటేల్‌లు కూడా ఈ దొంగతనానికి రెడీ అయ్యారు. ఖర్చులకు తాము కూడా డబ్బలు ఇస్తమని మాట్లాడుకున్నారు. అందరు కలిసి ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ చేరుకున్నారు. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఎనికేపాడులోని ఇన్‌గ్రామ్‌ మైక్రో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వేర్‌హౌస్‌ వద్దకు వెళ్లారు. పై భాగంలోని గోడౌన్‌ రేకులను జాగ్రత్తగా కట్టర్‌తో కోసి లోపలికి వెళ్లారు. అక్కడి సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. అట్టపెట్టెలో ఉన్న రూ. 2,51,23,072.86 విలువైన 271 యాపిల్‌ ఫోన్స్, వివిధ రకాల యాక్సెసరీస్‌ కలిపి మొత్తం 373 వస్తువులు దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసులకు క్లూ ఇచ్చిన కారు..
వీరు దొంగతనం చేయడానికి కారులో వచ్చారు. ప్రజాపతి కి కారు ఉంది. యుపి 62 సికె 1404 నెంబరు గల తెల్ల రంగు మారుతి ఎర్టిగా ను ఉపయోగించుకున్నారు. ఈ కారులోనే వచ్చి దొంగిలించిన సెల్‌ ఫోన్స్‌ తీసుకుని వెళ్లి పోయారు.
తెల్లవారి చూడగానే దొంగతనం జరిగిందని తెలుసుకున్న వేర్‌ హౌస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎండి ఫరూక్‌ అహ్మద్‌ విజయవాడ పడమట పోలీసులకు ఫిబ్రవరి 6న ఫిర్యాదు చేశారు. గోడౌన్‌లో దొంగతనానికి గురైన వస్తువుల వివరాలు అందించారు. భారీ దొంగతనం కావడంతో వెంటనే పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ (సీసీఎస్‌) బృందాలు వేర్‌ హౌస్‌లో ఆగ్నేయ దిశగా రేకులు కట్‌ చేసిన ప్రాంతాన్ని, రోడ్డు బయట బాగాలను పరిశీలించారు. సీసీ కెమెరాల్లోని పుటేజీని పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌ కు చెందిన కారు నెంబరు కనిపించింది. వెంటనే ఆకారుపై దృష్టి పెట్టారు. సీపీ ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు కారు నెంబరు పంపించి దొంగతనం జరిగిన తీరును వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కారు ఏ ప్రాంతంలో ఉందో విజయవాడ పోలీసులు గుర్తించారు. కారు బీహార్‌ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బీహార్‌ లోని సాసారం టోల్‌ ప్లాజా వద్ద ఉన్నట్లు తెలుసుకుని డెహ్రి జిల్లా ఎస్‌పీ రోషన్‌ కుమార్‌ తో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు మాట్లాడారు. శివసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నితీష్‌ కుమార్‌ సింగ్‌ సహకారంతో మారుతి ఎర్టిగా కారును, అందులో ప్రయాణిస్తున్న వారిని, వారు దొంగిలించిన సెల్‌ ఫోన్స్‌ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, దొంగలు దోచుకున్న సెల్‌ఫోన్స్‌ ను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో దొంగలకు రిమాండ్‌ విధించారు. ఇదంతా ఒక్కరోజులోనే సాధ్యమైంది. 5వ తేదీ రాత్రి దొంగిలించారు. ఆరోతేదీ ఉదయం రిపోర్టు రాగా 6వ తేదీ రాత్రిలోపు వారిని పట్టుకున్నారు. బీహార్‌ రాష్ట్ర పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏపీ పోలీసులకు సహకించడంతో దొంగలను పట్టుకోవడం ఈజీ అయింది.
ఖాట్మాండ్‌లో సెల్‌ఫోన్స్‌ అమ్మేందుకు ప్లాన్‌..
యాపిల్‌ ఫోన్స్‌ కావడంతో ఐఎంఈఐ లను బ్లాక్‌ చేస్తారని వారు ముందుగానే గుర్తించారు. ఐఎంఈఐ బ్లాక్‌ అయితే ఇండియా వరకు మాత్రమే పనిచేయవని, ఈ ఫోన్‌లను ఇండియాలో ఉపయోగించే అవకాశం లేనందున నేపాల్‌లో అమ్మేందుకు ప్లాన్‌ చేశారు. ముందుగానే రంజిత్‌ అనే వ్యక్తి వీరికి ఈ విషయం చెప్పాడు. అమ్మిపెట్టే బాధ్యత తనదేనని, నేపాల్‌లోని ఖాట్మాండ్‌ సిటీలో కొనుగోలు దారులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. నేపాల్‌కు వెళ్లేలోపు బీహార్‌లోనే దొంగలు పట్టుబడటంతో రంజిత్‌ జాగ్రత్త పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ముగ్గరు కూలీలు
రెండో నిందితుడు మాయ జయప్రకాష్, ఐదో నిందితుడు మిథిలేష్‌ కుమార్, ఆరో నిందితుడు సురేంద్రకుమార్‌ పటేల్‌ లు కూలిపనులు చేస్తారు. అప్పుడప్పుడూ చిల్లర దొంగతనాలు చేస్తారు. వీరు ముగ్గురిపైనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మూడో నిందితుడు సునీల్‌ కుమార్‌ సరోజ్, నాలుగో నిందితుడు బ్రిజేష్‌కుమార్‌ ఉగ్ర ఆర్టీవో ఏజెం ఆఫీస్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. మొదటి నిందితుడు డీప్‌చంద్‌ ప్రజాపతి ఇంటర్‌ వరకు చదువుకుని కార్‌ ట్రావెల్స్‌ నడుపుతున్నాడు. వీరు ఇప్పటి వరకు చిన్నచిన్న దొంగతనాలు చేసినా పోలీసుల రికార్డులకు ఎక్కలేదు. పద్ద దొంగతనం చేసినా ఈజీగా తప్పించుకోవచ్చనే ఆలోచనతో ఈ దొంగతనం చేశారు.
రంజిత్‌ ఎవరు?
రంజిత్‌ అనే వ్యక్తి ఎవరు? అతనికి గోడౌన్‌ లో యాపిల్‌ సెల్‌ ఫోన్స్‌ ఉన్నాయనే విషయం ఎలా తెలిసింది. అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతూనే ఉంది. ఇంగ్రామ్‌ మైక్రో ఇండియా ప్రై.లి. వేర్‌హౌస్‌ లోని ఎంప్లాయిస్‌ పైనా పోలీసులు దృష్టి సారించారు. రంజిత్‌కు నేపాల్‌ లోని ఖాట్మాండ్‌లో అమ్మొచ్చనే విషయం ఎలా తెలుసు? అక్కడ రంజిత్‌ మనుషులు ఎవరు? ఐఎంఈఐ ని బ్లాక్‌ చేస్తే ఇండియా వరకు ఫోన్‌ పనిచేయదని, ఇతర దేశాల్లో పనిచేస్తుందనే విషయాన్ని వీరు ఎలా కనిపెట్టారనే కోణంలోనూ పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
విజయవాడ నగరంలో ఇంత భారీ దొంగతనం ఇటీవల జరగటం చర్చకు దారితీసింది. పోలీసులు కూడా చాకచక్యంతో దొంగలను పట్టుకోవడం, అందులోనూ రిపోర్టు ఇచ్చిన సాయంత్రంలోపే పట్టుకుని ప్రాపర్టీ కూడా పూర్తిస్థాయిలో రికవరీ చేయడం పలువురిని ఆశ్చర్య పరిచింది.
Next Story