పార్టీలు వేరైనా.. సింహాలన్నీ సీమవే
x
చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్, షర్మిల

పార్టీలు వేరైనా.. సింహాలన్నీ సీమవే

రాష్ట్ర రాజకీయాలను నాలుగు పార్టీలు శాసిస్తున్నాయి. ఆ నాలుగు పార్టీల అధ్యక్షులు రాయలసీమ వాసులే..



(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: పార్టీలు వేరు కావచ్చు. రాష్ట్ర రాజకీయం మాత్రం రాయలసీమలోనే కేంద్రీకృతమై ఉంది. నాలుగు ప్రధాన పార్టీలకు సారథ్యం వహిస్తున్నది రాయలసీమ నేతలే. ముగ్గురు యువతరం నేతలతో రాజకీయ కురువృద్ధుడు సాగిస్తున్న పోరాటం ఈ ఎన్నికల్లో రసవత్తరంగా మారింది.

నవతరం నేతలతో ...

వైఎస్ఆర్‌సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కడప నుంచి పోటీ చేయడంతో పాటు ఆ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల రెడ్డి.. ఏపీసీసీ అధ్యక్షురాలుగా పార్టీ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. చేతికి ఐదవ వేలి మాదిరి ఉన్న నెల్లూరు జిల్లా మూలాలు ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులను నడుపుతున్నారు. యువతరం నేతలైన వారితో రాజకీయ కురువృద్ధుడు, చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు పోరాటం సాగిస్తున్నారు.

నేపథ్యం.. విలక్షణం

రాష్ట్ర రాజకీయాలకు సారథ్యం వహిస్తున్న నాలుగు పార్టీల్లో ఒక్కొక్కరిది ఒక్కో విలక్షణమైన లక్షణం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పార్టీలు వేరైనా ఇద్దరిదీ వారసత్వ రాజకీయ కుటుంబానిదే. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు స్వశక్తితో రాజకీయాలను శాసించే దిశగా ఎదిగిన వారు. వీరిలో ఎన్ చంద్రబాబు నాయుడుకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకుడుగా రాజకీయాలను నెరపిన చాతుర్యం ఉంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. సినిమా గ్లామర్ ప్రపంచం నుంచి సొంత అన్న ప్రజారాజ్యం పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మారిన కొణిదెల చిరంజీవి ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చారు.

వర్సిటీ నుంచి రాజకీయ ప్రస్థానం

చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్ చంద్రబాబు నాయుడు.. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. విద్యార్థి సంఘం ఎన్నికలతో మొదలైన ఆయన ప్రస్థానం రాజకీయాల వైపు అడుగులు వేయడానికి దారితీసింది. 28 ఏళ్ల వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి, ఆ తర్వాత 1989 నుంచి వరుసగా కుప్పం అసెంబ్లీ స్థానానికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏడోసారీ ఆయన కుప్పం నుంచే పోటీ చేస్తున్నారు. ఈ ప్రస్థానంలో ఆయన రాష్ట్ర మంత్రివర్గం పదవులతో పాటు కేంద్రంలో కూడా చక్రం తిప్పారు. టీడీపీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు.. ఉమ్మడి రాష్ట్రానికి 1995, 1999 నుంచి 2004 వరకు, రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్ర మొదటి సీఎంగా పనిచేశారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీ రామారావుతో విభేదించి సీఎం పీఠంపై కూర్చున్న చంద్రబాబు నాయుడు.. టీడీపీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆ తర్వాత, నవ్యాంధ్ర రాష్ట్ర రాజకీయాలను శాసించడంలో తనదైన శైలిని ప్రదేశిస్తూ ఈసారి ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను అవిశ్రాంతంగా నడిపిస్తున్నారు.

వారసత్వం.. ధైర్యం.. ధిక్కారంతో...

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నిత్య అసమ్మతి నేతగా ముద్ర వేయించుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించారు. ఆ తర్వాత, ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా జనంతో మళ్లీ మమేకమై సీఎం పీఠాన్ని అధిరోహించడం ద్వారా పరివర్తన చెందిన వ్యక్తి డాక్టర్ వైఎస్‌ఆర్ అనిపించుకున్నారు. ఆయన వారసత్వంతో వైఎస్‌ఆర్ ఫ్యామిలీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన 2009లో కడప ఎంపీగా మొదటిసారి ఎన్నికయ్యారు. హెలికాప్టర్ ప్రమాదంలో డాక్టర్ వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత, జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. వైఎస్. జగన్మోహన్ రెడ్డి.. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 18 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 15 సీట్లు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను ఆయన గెలిపించుకుని కాంగ్రెస్, టీడీపీకి సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ 67 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది. 2019 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైఎస్ఆర్‌సీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో 23 స్థానాలను దక్కించుకొని చరిత్ర సృష్టించింది. పొత్తులు లేకుండా ఒంటరి పోరుకు దిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చిన్న వయసులోనే రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు. నాటి కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన వారిని కూడా తన శిబిరంలో చేర్చుకొని, ఎస్ బాస్ అనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నారు.

కుటుంబం నుంచే ప్రతిపక్షం..

వైఎస్ఆర్ కుటుంబం కేవలం కడప జిల్లాకే కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేసుకుంది. ఆ కుటుంబంలో వచ్చిన స్పర్ధలు, ఇతర కారణాల రీత్యా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డి సొంత అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌టీపీ స్థాపించడంతో ఆమె వ్యక్తిగత రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె తిరిగి సొంత కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసి, మళ్లీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. పీసీసీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల రెడ్డి ద్వారా తమపై తిరుగుబాటు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి ఏఐసీసీ పెద్దలు భారీగా స్కెచ్ వేశారు.

అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల రెడ్డి రాకతో ఊపిరి పోశారనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అందుకు ప్రధానంగా పాత తరం కాంగ్రెస్ నేతలు, వైఎస్ఆర్ అభిమాన శ్రేణులు ఆమెతో కలిసి నడుస్తున్నారు. టికెట్లు రాక, నిర్లక్ష్యానికి గురైన వారు పీసీసీ సారథి షర్మిలారెడ్డి దరి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రాజకీయ ప్రస్థానానికి ముళ్ళబాటలా ఉన్న ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను వైఎస్ షర్మిల రెడ్డి ఎలా నెగ్గుకు రాగలరనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

సింహపురి సింహమే..

జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ స్వభావం సాత్వికంతో పాటు విలక్షణమైనది. సినిమా గ్లామర్‌తో నటుడైన అన్న కొణిదెల చిరంజీవి ప్రేరణతో ప్రజారాజ్యం ద్వారా 2008లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన తండ్రి వెంకట్రావు వృత్తిరీత్యా కానిస్టేబుల్ కావడంతో పవన్ కళ్యాణ్‌కు నెల్లూరు జిల్లాతో అనుబంధం ఉంది. నెల్లూరు నగరం మూలాపేటలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి ద్వారా సోదరి, బంధుత్వం ఎక్కువగా ఉంది . పవన్ కళ్యాణ్ హైస్కూల్ విద్యను మూలాపేట సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివారు.

తడపాట్లు తప్పటడుగులు

పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు జనసేన పవన్ కళ్యాణ్ తప్పటడుగులు తడపాట్లలోనే ఉన్నారనేది విమర్శకుల అభిప్రాయం. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్..2014 లో స్థాపించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయని జనసేన ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో జనసేన ఒకచోట మాత్రమే గెలుపొందింది. పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ కల్యాణ్ ఓడిపోయారు. పార్టీ.. ఆరంభం నుంచి పొత్తుల ఎత్తుల్లో చిక్కుకొని విమర్శలకు గురవుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.. టీడీపీతో కలవడం, ఈ రెండిటినీ బీజేపీతో అనుసంధానం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. పొత్తులు, సీట్ల సాధన, అభ్యర్థుల ఎంపికలో తడబాటు అనే అంశాలపై తానే కాకుండా పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల్లో చాలామంది జనసేన నుంచి చాలా మంది నాయకులు తప్పుకున్నారు. ఎంపిక చేసుకున్న స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలపడంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణుల ధైర్యాన్ని దెబ్బతీస్తుంటే, ఇది కాస్త అధికార పక్షం తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఆయన రెండంకెల సీట్లు సాధిస్తారేమో వేచి చూడాలి. అందరిదీ ఆధిపత్య పోరాటమే. అధికారం కోసం ఆరాటమే. ఇందులో విజేతలుగా నిలవడానికి ప్రజలు ఎవరని ఆదరిస్తారో వేచి చూద్దాం.



Read More
Next Story