జగనన్న విద్యా కానుక కింద డబ్బులు ఇవ్వకుండా స్కూలు బ్యాగులు కంపెనీ వారు ఇస్తున్నారా? కంపెనీపై ఎందుకు అంత ప్రశంసల వర్షం అనేది ఇప్పుడు విద్యశాఖలో చర్చగా మారింది.


మనకు ఏదైనా అవసరమైన వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఆ వస్తువు తాలూకు నాణ్యత ప్రమాణాలు పరిశీలించుకుంటాం. నాణ్యతను పరీక్షించే నిపుణుల ద్వారా తగిన పరీక్షలు చేయించుకుంటాం. కంపెనీ ఏ నిబంధనలైతే తూచా తప్పకుండా పాటిస్తున్నామని చెప్పిందో అవన్నీ ఈ వస్తువులో ఉన్నాయని నిపుణులు చెబితే పర్వాలేదు, ఆ వస్తువును తీసుకోవచ్చనే నిర్ణయానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ లాంటి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి ఇవన్నీ తెలియనవి కావు. ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూల్‌ స్థాయి వరకు విద్యార్థులకు ప్రతి ఏటా సరఫరా చేసే స్కూల్‌ బ్యాగ్‌ల కొనుగోలు విషయంలో, న్యూఢిల్లీలోని నోయిడాలో స్కూల్‌ బ్యాగ్‌లు తయారు చేసే కంపెనీపై ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రశంసలు కురిపించారు.

జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరవగానే విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోయిడాలో స్కూల్‌ బ్యాగులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ సందర్శించి బ్యాగుల నాణ్యతను పరిశీలించారు. సివిల్‌ సర్వెంట్‌ అయినంత మాత్రాన బ్యాగుల నాణ్యతపై ఆయనకు ఎంత మాత్రం అవగాహన ఉందనేది తాజాగా విద్యా శాఖలో చర్చగా మారింది. గత సంవత్సరం 43,10,165 మందికి బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సంవత్సరం కూడా దాదాపు ఇంత మంది విద్యార్థులకు విద్యాకానుక ప్రభుత్వం అందించనుంది. విద్యార్థులకు జూన్‌ 5వ తేదీన బ్యాగులు అందజేస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబితే అది ఎంతో గొప్ప నిర్ణయమని, కంపెనీ నిబద్దత తనను ఆకట్టుకుందని చెప్పడం దేనికి సంకేతమనే చర్చ విద్యా రంగ నిపుణుల్లోను మొదలైంది. ఒక నెల రోజుల ముందు ఏ కంపెనీకి ఆర్డరు పెట్టినా, ఎన్ని లక్షల బ్యాగులు కావాలన్నా తయారు చేసి ఇచ్చేందుకు ఎవ్వరూ వెనుకాడరు. తగిన మొత్తం డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బ్యాగుల నాణ్యతలను పరిశీలించి తీసుకొచ్చుకుంటాం.
ఒక్కో బ్యాగు కొలతలు పరిశీలిస్తే 45సెంటీ మీటర్ల పొడవు, 33 సెంటీ మీటర్ల వెడల్పు, 15సెంటీ మీటర్ల లోతు, 0.42 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. పాఠ్యపుస్తకాలు, నోటు బుక్స్, ట్యాబ్‌ ఇతర ముఖ్యమైన వస్తువులు బ్యాగులో ఉంచుకునేందుకు సరిపోయేంత పరిమాణం ఉంటుంది. అందుకే ఈ కొలతల ప్రకారం బ్యాగులను తయారు చేయాలని ప్రభుత్వం ముందుగానే ఆ కంపెనీని కోరింది. ప్రభుత్వం కోరిన అంశాల మేరకు ఒక ఏడాది పాటు బ్యాగు చినిగి పోకుండా మంచి క్వాలిటీ ఉండే క్లాత్‌తో పాటు, నాణ్యమైన కుట్టుపని ఉండాలనేది ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్‌లో భాగం. విద్యార్థులు తమ అధ్యయనానికి సంబంధించిన సామగ్రిని తీసుకుని వెళ్లేందుకు కూడా ఈ బ్యాగులు ఉపయోగపడేలా ఉండాలని ప్రభుత్వం భావించింది. అందుకే ముందుగానే బ్యాగుల నాణ్యతకు సంబంధించి అగ్రిమెంట్‌లో రాసుకున్న నిబంధనల మేరకు సరఫరా జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా 44,617 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 43లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ జగనన్న విద్యా దీవెన కింద బ్యాగులు కొనుగోలు చేసి ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. వచ్చే నెల 12న ఈ బ్యాగులను స్కూల్‌ విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత విద్యా సంవత్సరం 43,10,165 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం జూన్ లో మరికొంత మంది విద్యార్థులు పెరగొచ్చు. తగ్గొచ్చు. గత సంవత్సరం ప్రకారమే ఇండెంట్ పెడతారు. విద్యార్థుల సంఖ్య తగ్గితే పరవాలేదు. పెరిగితే తిరిగి మిగిలిన వారికి బ్యాగులు తెప్పిస్తారు. 1,2 తరగతులకు స్మాల్ బ్యాగ్స్, 3, 4, 5 తరగతుల వారికి మాడియం సైజ్, 6 నుంచి 10 తరగతులు చదివే వారికి లార్జ్ బ్యాగులు ఇస్తారు. సగటున ఒక్కోబ్యాగ్ రూ. 150 లు అనుకుంటే రూ. 64,65,24,750 లు అవుతాయి. టెండర్లు పిలవడం ద్వారా బ్యాగుల కొనుగోలు ఖరారు చేస్తారు. ఒక మంచి ఫాస్ట్ స్ట్రాక్ బ్యాగ్ కొనుగోలు చేస్తే ఇదే సైజు బ్యాగ్ కనీసం రూ. 800లు ఉంటుంది. దీనికోసం ఇంత కసరత్తు చేయాల్సిన అవసరం లేదనేది విద్యారంగంలోని నిపుణుల అభిప్రాయం.
సెంట్రలైజ్డ్‌ కాంట్రాక్ట్‌ ఎందుకు?
సహజంగా గత ప్రభుత్వాలు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇలాంటి పథకాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు అనుమతులుండేవి. కానీ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ పర్జేజింగ్‌ కమిటీలు నిర్వీర్యమయ్యాయి. ఎవరికి ఏది కావాలన్నా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడి కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోళ్ల వెనుక మతలబులు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నా, నేతలు కానీ, అధికారులు కానీ పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. స్కూల్‌ బ్యాగుల ఒప్పందానికి సంబంధించి నేరుగా ఫ్యాక్టరీ వద్దకు పోయి వారితో ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడి బ్యాగులు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పడం కూడా పలు విమర్శలకు దారితీసింది. ఏ కంపెనీకి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినా అనుకున్న సమయానికి ఒప్పందం ప్రకారం సరఫరా చేయాల్సి ఉంటుంది. లేదంటే వారి ఒప్పందం రద్దవుతుంది. ఆలస్యానికి తగిన మూల్యం కూడా కంపెనీ చెల్లించుకోవలసి ఉంటుంది. స్కూల్‌ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంలాగా ప్రభుత్వం చిత్రీకరించడం, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ విద్యార్థుల ఇళ్లకు పోయి మరీ బ్యాగులు, ఇతర వస్తువులు ఉపయోగిస్తున్నారో లేదో తనిఖీలు చేయడం, విద్యార్థులు వాటిని సరిగా ఉపయోగించుకోకపోతే ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేడం వంటి అంశాలు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్లో ఇటీవల కాలంలో తీవ్ర విమర్వలకు దారి తీసాయి.
చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకున్నారా..
కంపెనీల వద్దకు వెళ్లి వాళ్లను ప్రశంసించడం కంటే విద్యార్థుల చదువులు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడం మంచిది. ఐదో తరగతి విద్యార్థికి వాడి పేరు వాడు రాసుకోవడం చేతకావడం లేదు. ఈ విషయమై స్కూలు టీచర్లను ప్రశ్నిస్తే వాడు సరిగా స్కూలుకు రాడు. మేమేమీ చేయలేకపోతున్నాం, చదువు వచ్చినా రాకపోయినా పై క్లాస్‌కు ప్రమోట్‌ చేయాల్సిందే. ఇది ప్రభుత్వ రూల్‌ అంటున్నారు ఉపాధ్యాయులు. అక్షరాలు నేర్వని విద్యార్థులుపై చూపాల్సిన శ్రద్ధ స్కూల్‌ బ్యాగ్‌లపై ఎందుకు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. పైగా గత సంవత్సరం ఇచ్చిన స్కూలు బ్యాగుల్లో నాణ్యత లేదనే విషయం అందరికీ తెలుసు. జిప్‌లు తెగిపోవడం, భుజానికి తగిలించుకునే కాడలు తెగిపోవడం తెలిసిందే. జిప్‌లు ఊడిపోతే పుస్తకాలు బయటకు కనిపిస్తుంటాయి. దీంతో కొందరు విద్యార్థులు అన్ని పుస్తకాలు స్కూలుకు తెచ్చుకోవడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Next Story