చీపురుపల్లిలో బొబ్బిలి యుద్ధమేనా!  వార్ వన్ సైడేనా?
x
బొత్స, గంటా

చీపురుపల్లిలో 'బొబ్బిలి' యుద్ధమేనా! వార్ వన్ సైడేనా?

రాష్ట్ర మంత్రి బొత్స సత్యానారాయణ పొలిటికల్‌ అడ్డా.. బొత్స సామ్రాజ్యానికి కట్టడి చేయాలని టీడీపీ వ్యూహం పన్నిందా.. గంటాను అందుకే అక్కడ దించుతుందా?


యుద్ధంలో గెలవాలంటే.. ముందు యుద్ధానికి సిద్ధపడాలి.. వ్యూహాలు, ఎత్తుగడలు వంటివి ఎంత అవసరమైనా అంతకన్నా ముందు.. శత్రువును ఢీకొట్టే సామర్థ్యం ఉన్న వారినే రణక్షేత్రానికి పంపాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇదే రణ నీతిని అమలు చేయాలని చూస్తోంది. ఉత్తరాంధ్రలోనే టాప్‌ లీడర్‌ను ఢీకొట్టేందుకు అంతేస్థాయి నాయకుణ్ణి రంగంలోకి దింపుతోంది. ఇప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా పసుపుదళం పక్కా స్కెచ్‌ వేయడం... మంత్రి బొత్స చుట్టూ ఉచ్చు బిగించేలా వ్యూహం రెడీ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

ఉత్తరాంధ్రలో రాజకీయాలకు పెట్టింది పేరు చీపురుపల్లి. రాష్ట్ర మంత్రి బొత్స సత్యానారాయణ పొలిటికల్‌ అడ్డా... గత 20 ఏళ్లుగా అక్కడ బొత్స రాజ్యమే నడుస్తోంది. విజయనగరం జిల్లాను ఓ మినీ సామ్రాజ్యంగా చేసుకున్న బొత్సకు చీపురుపల్లే రాజధాని... 2004లో తొలిసారి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చేరిన బొత్స రాష్ట్రంలోనే పెద్ద లీడర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సకు బలమైన అనుచర గణం ఉంది. 2014లో చీపురుపల్లిలో బొత్స ఓడినా... అప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా గణనీయమైన ఓట్లు సాధించారు. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్‌ ఖతమైనా బొత్స మాత్రం ఆ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచి తన పట్టు ఏ పాటిదో నిరూపించారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి సుమారు 28 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

బొత్సా అడ్డా.. చీపురుపల్లి

చీపురుపల్లిలో మంత్రి బొత్సకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. నాలుగు మండలాల్లో పటిష్టమైన క్యాడర్‌ ఉంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయిన చీపురుపల్లిలో బొత్స అడుగు పెట్టాక పూర్తిగా తలకిందులైంది. టీడీపీ పత్తాయే లేకుండా పోయింది. 2014లో టీడీపీ గెలిచినా.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, వైసీపీ ఓట్లు చీలికతోనే గెలిచింది. 2014లో సుమారు 60 వేల ఓట్లు సాధించిన టీడీపీ.. 2019లో అంతేస్థాయిలో ఓట్లు సాధించినా భారీ తేడాతో ఓటమి పాలైంది. బొత్స ఓటు బ్యాంకుతోపాటు పార్టీ ఓటింగ్‌ తోడవడంతో టీడీపీపై భారీ ఆధిక్యం సాధించారు. గత ఎన్నికల్లో బొత్సకు ప్రత్యర్థిగా ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి కిమిడి నాగార్జున పోటీ చేశారు. యువకుడైన నాగార్జున మంచి వాగ్దాటితో ప్రజల్లోకి దూసుకెళ్లినా బొత్సను మాత్రం ఢీకొట్టలేకపోయారు. ఇక ఐదేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పనిచేస్తున్నా.. ఈ ఎన్నికల్లో నాగార్జున ద్వారా బొత్సను ఓడించలేమన్న అంచనాకు వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.

నాగార్జునను బాబు ఎందుకు మార్చినట్టు..

చీపురుపల్లిలో నాగార్జునే అభ్యర్థి అంటూ ఏడాది క్రితమే చంద్రబాబు ప్రకటించినా.... ఈ ఏడాదిలో కనీసం టీడీపీ బలం పెరగలేదన్న భావనలో ఉంది పార్టీ. మంత్రి బొత్సను బలహీన పరచడంలో సరైన వ్యూహం లేకపోవడం... కేవలం పార్టీ వేవ్‌లో గెలిచేస్తామన్న ధీమాలో అక్కడి నాయకత్వం ఉండిపోవడంతో ప్రత్యామ్నాయం వెదుకుతోంది టీడీపీ... నాగార్జున అహరహం పనిచేస్తున్నా... బొత్స రాజకీయ చతురత ముందు ఆయన ఏవీ పనిచేయడం లేదని.. స్థానికంగా మద్దతు కూడగట్టుకోవడంలో కూడా వెనుకంజలో ఉన్నారని భావిస్తున్నారు చంద్రబాబు. దీంతో బొత్సకు దీటైన అభ్యర్థి కోసం ప్రత్యేకంగా సర్వే చేయించారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతతోపాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు పరిశీలనలోకి తీసుకున్నారు. ఉత్తరాంధ్రలో బొత్స వంటి లీడర్‌ను ఢీకొట్టాలంటే గంటాయే సరైన అభ్యర్థి అని సర్వేలో తేలడంతో చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందిగా గంటాకు సమాచారం ఇచ్చారు చంద్రబాబు.

బొత్సాకు గంటా సమఉజ్జీయేనా...

ఉత్తరాంధ్రలోని ప్రముఖ నాయకుల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. మూడు జిల్లాల్లో ఎక్కడకు వెళ్లినా ఆయన చరిష్మా పనిచేస్తుందని భావిస్తున్నారు చంద్రబాబు. అంగ, అర్ధబలాల్లో బొత్సకు గంటాయే సరిజోడన్న ఆలోచనతో గంటాను పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు చంద్రబాబు. పార్టీ ఆదేశాలపై ఆలోచన చేస్తున్నానని.. తనను చీపురుపల్లి వెళ్లాల్సిందిగా పార్టీ సీరియస్‌గానే చెప్పిందని అంటున్నారు గంటా... వచ్చే ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవడమే అన్నట్లు భావిస్తున్న చంద్రబాబు... గెలుపు అవకాశం ఉన్న ఏ నియోజకవర్గాన్ని వదులుకోవడం లేదు. మరీ ముఖ్యంగా వైసీపీలోని కీలక నేతలను ఓడించమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందుకే చీపురుపల్లిలాంటి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న చీపురుపల్లిలో చాలాకాలంగా నాయకత్వలోపం ఉంది. ప్రస్తుత ఇన్‌చార్జిగా ఉన్న కిమిడి నాగార్జున కూడా స్థానికేతరుడే.. 2014లో నాగార్జున తల్లి మృణాళిని ఎన్నికలకు 18 రోజుల ముందే వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఆమె హయాంలో పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని... 2019లో నాగార్జునకు బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్యావంతుడైన నాగార్జున అమెరికాలో ఉద్యోగం చేస్తూ నేరుగా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిపోయారు. రాజకీయాలకు కొత్తకావడం... వైసీపీ హవాలో నెగ్గుకురాలేకపోయారు. ఐదేళ్లు తిరిగినా నియోజకవర్గంలో అదే పరిస్థితి ఉండటంతో ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడ్డారు చంద్రబాబు.

గంటా ఒప్పుకుంటారా

ఇక పార్టీ ఆదేశాలతో మాజీ మంత్రి గంటా కూడా చీపురుపల్లిపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ముందుగా జిల్లాలోని ముఖ్యనేత అశోక్‌గజపతిరాజును కలిసి ఆయన అండదండలు తీసుకోవాలని భావిస్తున్నారు గంటా. బొత్స ఏలుబడిలో చీపురుపల్లిలో నలిగిపోయిన టీడీపీ క్యాడర్‌ తాజా పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది. నాలుగున్నరేళ్లు తమతో కలిసి పనిచేసిన నాగార్జునను కాదని గంటాకు టికెట్‌ ఇచ్చే విషయంలో పార్టీ ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, బొత్సను ఓడించే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ఆలోచనతో అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవాలని మెజార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి మంత్రి బొత్సపై మాజీ మంత్రి గంటాను బరిలోకి దింపడంతో చీపురుపల్లి ఎన్నికలు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Read More
Next Story