Chandrababu Naidu (File Photo)

కుప్పం నుంచి ఎనిమిదో సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న టిడిపి చీఫ్‌ చంద్రబాబునాయుడు భయపడుతున్నారా? కారణాలు ఏమై ఉండొచ్చు.


ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో మెజారిటీ తగ్గుతుందని భయపడుతున్నరా? కుప్పంలో చేస్తున్న ప్రచారం పరిశీలిస్తే భయంతో ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కుప్పం నుంచి ఏడు సార్లు తిరుగులేని నాయకుడుగా గెలిచిన నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత తన మామ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో చేరి ఏకచత్రాదిపత్యంగా పార్టీలో అన్నీ తానై ముందుకు సాగుతున్నారు.

చంద్రమౌళి కుటుంబం నుంచే పోటీ
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ నుంచి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె చంద్రమౌళి 2014, 2019లో పోటీ చేశారు. చంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2024లో 47,121 ఓట్ల మెజారిటీ బాబుకు రాగా, 2019లో ఆ మెజారిటీ తగ్గి 30,722 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. అంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 16వేల ఓట్లు అధికంగా సంపాదించి ఉంటే ఓటమి తప్పేది కాదు. రానురాను ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోననే భయం చంద్రబాబులో కనిపిస్తుందనేది మేధావి వర్గం మాట. గత ఎన్నికల్లో చంద్రమౌళి ఓడిన తరువాత ఆయన కుమారుడు భరత్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ ఎన్నికల్లో ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు..
కె భరత్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళి కుమారుడు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు గెలవడంలో భరత్‌ కీరోల్‌ ప్లే చేశారు. 2014, 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్‌ తండ్రి చంద్రమౌళి వరుసగా 55 వేలు, 70 వేల ఓట్లు సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. ఎనిమిదో సారి కుప్పం నుంచి చంద్రబాబు పోటీ పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ తగ్గడం ఆలోచించాల్సిన అంశం.
సంజయ్‌గాంధీ చొరవతో బాబుకు సీటు..
ఎమెర్జెన్సీ సమయంలో నాటి యువజన కాంగ్రెస్‌కు అధ్యక్షుడుగా ఉన్న ఇందిరా గాంధీ రెండో కుమారుడు సంజయ్‌ గాంధీకి సన్నిహితుడయ్యారు. దీంతో బాబు ఎన్నికల ఎంట్రీ సులువైంది. 1978లో సీటు దక్కింది. సొంత నియోజక వర్గం నుంచే ఆయన పొలిటికల్‌ కెరీర్‌ మొదలు పెట్టారు. చంద్రగిరి నుంచి బరీలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీలో తొలి సారి అడుగు పెట్టారు. నాటి ముఖ్యమ్రంతి టంగుటూరు అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫి మంత్రిగా పదవి దక్కించుకున్నారు. 28 ఏళ్లకే మంత్రియ్యారు.
ఓటమి చవిచూసిన చంద్రబాబు
తన పొలిటికల్‌ కెరీర్‌లో 8 సార్లు గెలిచిన బాబు ఒక సారి మాత్రమే ఓటమి చవి చూశారు. 1983లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌ (ఐ) అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఎం వెంకట్రామనాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అనంతరం 9 నెలలకే ఎన్నికలు వచ్చాయి. 1983లో జరిగిన ఆ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తుడిచి పెట్టుకు పోయింది. అదే ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి నుంచి మామ ఎన్టీఆర్‌ పార్టీ అయిన టీడీపీకి ఎదురు నిలబడ లేక పోయారు. నాడు వీచిన ఎన్టీఆర్‌ ప్రభంజనంలో చంద్రబాబు కూడా కొట్టుకొని పోయారు. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేసేందుకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. ఏడాది తిరక్క ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
చంద్రగిరి నుంచి కుప్పంకు మారిన బాబు
రెండో సారి పోటీలో ఓటమి చవి చూసిన చంద్రబాబు తన నియోజక వర్గాన్ని మార్చు కోవాలని భావించారు. దీంతో చంద్రగిరి నుంచి కుప్పంకు మార్చుకున్నారు. 1989 నుంచి పోటీ చేస్తూ ఓటమి లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. కుప్పం నియోజక వర్గం 1955లో ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు రెండు సార్లు కాంగ్రెస్‌ గెలిచింది. ఒక మారు సిపిఐ, రెండు పర్యాయాలు స్వతంత్య్ర అభ్యర్థులు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి నాటి నుంచి 2019 వరకు టీడీపీ అభ్యర్థులే గెలుపొందుతూ వస్తున్నారు. టీడీపీ వచ్చిన తొలి నాళ్లల్లో 1983, 1985లో రెండు పర్యాయాలు ఎన్‌ రంగస్వామి నాయుడు ఆ పార్టీ నుంచి గెలుపొందారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థిగా ఆ స్థానాన్ని ఆక్రమించారు. 1989 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్నారు. 1955 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐలు తలపడ్డాయి. కాంగ్రెస్‌ నుంచి డి రామబ్రహ్మం, సీపీఐ నుంచి ఏపీ వజ్రవేలు చెట్టి పోటీ పడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రామబ్రహ్మం గెలిచారు. డి వెంకటేశం రెండు దఫాలుగా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి మీద 59వేల మెజారిటీతో చంద్రబాబు గెలుపొందారు. 2009లో ఎం సుబ్రహ్మణ్యం రెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్థిగాను, కే రాజేంద్రబాబును చిరంజీవి పార్టీ పీఆర్‌పీ అభ్యర్థిగాను, ఎన్‌ తులసీనాథ్‌ను బిజెపి అభ్యర్థిగా బరీలోకి దిగినా 46వేలకు పైగా ఓట్ల మెజారిటీతో బాబు విజయం సాధించారు. 2014లో 47,121, 2019లో 30,722 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు విజయ కేతనం ఎగుర వేశారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు
టీడీపీలో జరిగిన అనేక నాటకీయ పరిణామాల నేప«థ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని చేజిక్కుంచుకున్నారు. అప్పటికే అనేక మంత్రి పదవులు నిర్వహించిన ఆయన 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి పీటాన్ని అధిరోహించారు. అప్పటి నుంచి 2004 వరకు సిఎంగా కొనసాగిన చంద్రబాబు అత్యధికంగా 9 ఏళ్ల పాటు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలన చేసిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలి ముఖ్యమంత్రిగా కూడా 2014లో చరిత్రలోకి ఎక్కారు. మొత్తం కలిపి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు.
కేంద్ర రాజకీయాల్లో..
కేంద్ర రాజకీయాల్లోను కూడా చక్రం తిప్పారు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కింగ్‌ మేకర్‌గా మారారు. దేశ ప్రధానులుగా దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ ఎంపికలోను, రాష్ట్రపతులుగా కేఆర్‌ నారాయణన్, అబ్దుల్‌ కలామ్‌ల ఎంపికలోను, ఉప రాష్ట్రపతిగా కృష్ణకాంత్‌కు అవకాశం కల్పించడంలోను ముఖ్య పాత్ర పోషించారు. అతని సారథ్యంలో 1999లో ఏకంగా 29 లోక్‌సభ స్థానాలు సంపాదించి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. నాటి ఎన్టీఏ కూటమిలో కీ రోల్‌ పోషించారు.
బ్రాండ్‌గా బాబు
నాడు పలు కార్యక్రమాలకు బాబు బ్రాండ్‌గా మారారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్‌ కేర్, ఔట్‌ సోర్సింగ్‌ సర్వీసులు, ప్రపంచ బ్యాంకు కార్యక్రమాలు వంటి వాటికి బ్రాండ్‌గా గుర్తింపు పొందారు.
కుటుంబ నేపథ్యం
ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గం నారావారి పల్లెలో 1950 ఏప్రిల్‌ 20న జన్మించారు. చంద్రగిరిలో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో డిగ్రీ, పిజిలను పూర్తి చేశారు.


Next Story