బిజెపి అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు మార్క్ ఉందని పలువురు రాజకీయ నాయకుల అభిప్రాయం. అభ్యర్థుల పూర్వాపరాలు పరిశీలిస్తే ఇది నిజమేనని నమ్మక తప్పదు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల జీవిత విశేషాలు తెలుసుకుంటే ఎవరికైనా కొంత ఆశ్చర్యంతో పాటు ఆలోచన కలిగిస్తుంది. మొత్తం పది మంది అభ్యర్థుల్లో ఆరుగ్గరు అభ్యర్థులు టీడీపీ మూలాలు ఉన్నవారు. ఒకరు బీఎస్పీపీ నుంచి వచ్చిన వారు. ముగ్గరు మాత్రం అచ్చంగా బీజేపీలో ఉన్నవారు. తమ సిద్దాంతం చాలా గొప్పదని చెబుతున్న బీజేపీ వారు ఎందుకు ఎవరినంటే వారిని పార్టీలోకి అప్పటికప్పుడు చేర్చుకుని టిక్కెట్లు ప్రకటించారనేదానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఉత్తరాంధ్ర నుంచి పరిశీలిద్దాం. ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఎన్ ఈశ్వరరావును బీజేపీ వారు అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన ఒకప్పుడు ఎచ్చెర్ల మండల పరిషత్ తెలుగుదేశం పార్టీ తరపున ఉపాధ్యక్షుడు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ కు శిశ్యుడు కూడా వీరిద్దరూ ఒకప్పుడు శత్రువులు. ఇప్పుడు మిత్రులుగా మారారు. కిమిడి కళావెంట్రావుకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వకుండా ఉండేందుకు చంద్రబాబు బీజేపీకి కేటాయించారనే చర్చ కూడా జరుగుతోంది. ఎవరైతేనేమి ఈశ్వరరావు కూడా మనవాడే. ఎప్పటికైనా నా చెప్పుచేతల్లో ఉండే వాడే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని బాబు బావించారు.

కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి పోటీ పడుతున్న కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వారే. తెలుగుదేశం పార్టీలో ఉంటూ బీజేపీలోకి వెళ్ళారు. అందుకు చంద్రబాబునాయుడు సహకారం కూడా ఉందనేది పలువురు చెబుతున్న మాట.

యలమంచిలి సుజనా చౌదరి కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామానికి చెందిన వారు. ఈయన తల్లిదండ్రులు 1950లో హైదరాబాద్ చేరి అక్కడే స్థిరపడ్డారు. ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించలేదు. ఈయన తాత సత్యనారాయణ చౌదరి కృష్ణాజిల్లా నుంచి మొదటి సారిగా ఐపీఎస్ అధికారి అయ్యారు. కృష్ణాజిల్లా లో డిగ్రీ చదివిన వారు కూడా ఈ కుటుంబం నుంచి వచ్చిన వారే. హైదరాబాద్ లో ఉంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ లో 2005లో సలహాదారుగా చేరారు. ఆ విధంగా ఎన్టీ రామారావుతో సంబంధం ఏర్పడింది. ఆ తరువాత పరిణామాల్లో రాజకీయంగా చంద్రబాబుతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. 2014లో పొత్తులో బిజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ సందర్భంలో చంద్రబాబు ద్వారా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. బీజేపీతో టీడీపీ 2018లో తెగతెంపులు చేసుకుంది. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే తిరిగి తెలుగుదేశం పార్టీలో కొనసాగకుండా బీజేపీలోనే వైఎస్ చౌదరి కొనసాగారు. ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతున్నది. అంటే అప్పట్లో అక్కడే ఉండాలని సుజనాకు చెప్పింది కూడా చంద్రబాబే. ప్రస్తుతం యలమంచిలి సుజనాకు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టిక్కెట్ ను బీజేపీ కేటాయించింది.

కైకలూరు బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన కామినేని శ్రీనివాస్ కూడా తెలుగుదేశం పార్టీ మూలాలు వున్నవారే కావడం విశేషం. ఈయన 1980లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికై టీడీపీలో పనిచేశారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి నాయకత్వాన చేరారు. 2009 ఎన్నకల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓటమి చెందారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు చిరంజీవితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో చంద్రబాబు సూచన మేరకు బీజేపీలో చేరి కైకలూరు నుంచి పోటీ చేసి పొత్తులో బాగంగా గెలిచారు. ఆసమయంలో చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఏ అవసరం అయినా చంద్రబాబుతో సంప్రదించి పనులు చక్కదిద్దుకోవడం శ్రీనివాస్ చేసేపని. బీజేపీ వారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కైకలూరు నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. బీజేపీ ఉద్యమాల్లో కామినేని ఎప్పుడూ పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ఈయన స్వగ్రామం కైకలూరు మండలం వరాహపట్నం.

బద్వేల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన రోషన్న ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో డిఈ. ఈయనకు రాజకీయాలపై ఆసక్తి వుండటంతో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు. అయితే పొత్తుల వ్యవహారంలో రోషన్నకు తెలుగుదేశం పార్టీ నుంచి సీటు దక్కలేదు. దీంతో చంద్రబాబు చక్రం తిప్పి పురందేశ్వరి ద్వారా బీజేపీలో చేర్పించారు. బీజేపీలో ఉన్నందున టిక్కెట్ ఇస్తే బాగుంటుందని సూచించారు చంద్రబాబు. చంద్రబాబు సూచన మేరకు రోషన్నకు బద్వేల్ బీజేపీ సీటు ఖరారైంది.

జమ్మలమడుగు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి పేరున్న రాజకీయ వేత్త. అలాగే చంద్రబాబు ఏమి చెబితే అది చేసేవ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి కాంగ్రెస్ లోనూ, రెండో సారి వైఎస్సార్సీపీలోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. చంద్రబాబు సపోర్టుతో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత 2019లో కడప లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. చంద్రబాబు సూచన మేరకు గుట్టు చప్పుడు కాకుండా బీజేపీలో చేరాడు. ప్రస్తుతం జమ్మలమడుగు టిక్కెట్ బీజేపీలో సంపాదించారు. ఈయన స్వగ్రామం జమ్మలమడుగు. బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్నారు. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

డాక్టర్ పీవీ పార్థసారథి అధికారికంగా తెలుగుదేశం పార్టీలో పనిచేయకపోయినా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహతుడని పలువురు బీజేపీ నాయకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో కర్నూలు లోక్ సభకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఓబీసీ మోర్చాకు జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఈ పదవిని బీజేపీ 2021లో ఇచ్చింది. ఈయన డెంటర్ డాక్టర్. నియోజకవర్గంలో డాక్టర్గా పేరున్నా ఇక్కడ వైఎస్సార్సీపీ తరపున వై సాయిప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచి మూడో సారి గెలిచేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే సాయిప్రసాద్ ను ఎదుర్కొనేందుకు ఇది మంచి అవకాశమని భావించిన చంద్రబాబు పార్థసారథికి సీటు ఇప్పించినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. అయితే సాయిప్రసాద్ ను ఓడించే సత్తా ఈ డాక్టర్ కు లేదనే వాదన కూడా బీజేపీ కార్యకర్తల్లోనే ఉంది.

ఇక బీజేపీకి చెందిన పి విష్ణుకుమార్ రాజుకు విశాఖ నార్త్, అరకు వ్యాలీ నుంచి పి రాజారావు, ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై సత్యకుమార్, అనపర్తి ఎం శివక్రిష్టంరాజులు బీజేపీలో కొంతకాలంగా ఉంటున్నవారే. వీరికి చంద్రబాబుతో సంబంధాలు ఉన్నప్పటికీ అవి పార్టీ పరమైన సంబంధాలే తప్ప రాజకీయ సంబంధాలు కాదని చెప్పొచ్చు.

Next Story