చంద్రబాబు నెల్లూరు సర్జికల్ స్ట్రైక్ ... సక్సెస్
x
Source: Twitter

చంద్రబాబు నెల్లూరు సర్జికల్ స్ట్రైక్ ... సక్సెస్

నెల్లూరు ఉదయగిరి నియోజకవర్గం టికెట్ విషయంలో వచ్చిన సమస్యను చంద్రబాబు నాయుడు ఎలా మచ్చిక చేసుకున్నాడంటే, ఒక్కదెబ్బతో అలిగిన నేత దారికొచ్చాడు...



ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్ర రాజకీయాల్లో సంభవిస్తున్న పరిణామాలను ఎవరూ అంచనా వేయలేకున్నారు. రోజురోజుకు ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మొన్నటికిమొన్న చిత్తూరు‌లో సీకే బాబు, గురజాల జగన్‌మోహన్, ఏఎస్ మనోహర్ ఒకరికొకరు మద్దతు ప్రకటించుకున్నారు. విశాఖలో కూడా కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు చేతులు కలిపారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. వైరి వర్గాల నేతలు ఒక్కటయ్యారు. బొల్లినేని రామారావు, కాకర్ల సురేష్ స్నేహహస్తం అందించుకున్నారు. ఇదంతా కూడా రాజకీయ చాణక్యుడు, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహంలో భాగమేనని ఆ నియోజకవర్గం నేతలు భావిస్తున్నారు.

చంద్రబాబు వ్యూహం ఫలించిందా!

నెల్లూరు ఉదయగిరి నియోజకవర్గం విషయంలో చంద్రబాబు రచించిన వ్యూహం ఫలించిందా అంటే అవుననే చెప్పాలి. వైరి వర్గాలుగా ఉన్న బొల్లినేని, కాకర్ల కలిసి పార్టీ బలోపేతానికి పనిచేసేలా చేశారు. వీరి విషయంలో చంద్రబాబు చాలా చాకచక్యంగా వ్యవహరించారని, పార్టీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అద్భుతంగా ఆలోచించారని నెల్లూరు జిల్లా నాయకులు మెచ్చుకుంటున్నారు.

టికెట్ తెచ్చిన చిక్కు

నెల్లూరు ఉదయగిరి నుంచి 2019లో వైసీపీ తరపున మేకపాటి చంద్రశేఖర్ గెలిచారు. కాలక్రమేనా ఆయన వైసీపీని వీడి టీడీపీ చెంతకు చేరారు. ఉదయగిరి నుంచి ఇప్పటికే టీడీపీ తరపున అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని పేరు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఉండడంతో ఉదయగిరి టికెట్ వస్తే వీరిలోనే ఒకరికి వస్తుందని భావించారు. కానీ చంద్రబాబు మాత్రం అనూహ్యంగా ఎన్‌ఆర్ఐ కాకర్ల సురేష్‌కు ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ అందించారు.

దీంతో చంద్రశేఖర్ రెడ్డి దిగులు చెందగా బొల్లినేని రామారావు అలకపాన్పు ఎక్కారు. వచ్చే ఎన్నికల్లో కాకర్లను ఓడించి తీరుతానంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. దీంతో టీడీపీలో విభేదాలు తలెత్తుతున్నాయని అంతా భావించారు. అప్పటివరకు ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థిగా చలామణి అయిన బొల్లినేనితో తనకు వైరం మంచిది కాదని భావించిన కాకర్ల సురేష్ ఈ విషయంపై మౌనం పాటించారు. ఎక్కడా కూడా బొల్లినేనిపై ఒక మాట తూలడం కానీ, విమర్శించడం కానీ చేయలేదు. చివరకు ఈ పంచాయతీ చంద్రబాబు దృష్టికి వెళ్లింది. అప్పుడే చంద్రబాబు తన తెలివి చూపించారు.

బొల్లినేనికి పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడి పదవిని అందించారు. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టాలని, జాతీయ స్థాయిలో పార్టీ ఇమేజ్ తన చేతుల్లోనే ఉందని సూచించారు. ఆ పదవితో తనకు ఉపయోగం లేదనుకున్నా బొల్లినేని కాదనలేకపోయారు. చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పి ఉదయగిరికి తిరిగొచ్చి కాకర్లకు మద్దతు తెలిపారు. బొల్లినేనికి జాతీయ ఉపాధ్యక్షుడి పదవి వచ్చిన నేపథ్యంలో కాకర్ల సురేష్ ఆయనను కలిసి అభివనందనలు తెలిపారు. ఆయనకున్న రాజకీయ అనుభవంతో తనకు దిశా నిర్దేశం చేయాలని కోరారు. నియోజకవర్గంలో కాకర్ల గెలుపు కోసం కృషి చేస్తామని బొల్లినేని చెప్పారు.


Read More
Next Story