యూరియా అడిగితే చంద్రబాబు బెదిరిస్తున్నాడంటున్న సజ్జల
x

యూరియా అడిగితే చంద్రబాబు బెదిరిస్తున్నాడంటున్న సజ్జల

9న వైసీపీ ర్యాలీలకు రైతులు తరలిరావాలని సజ్జల పిలుపుం


యూరియా కొరతపై వైసీపీ కదనానికి రంగం సిద్ధం చేసింది. రైతు సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, చంద్రబాబు మాత్రం రైతుల్ని బెదిరిస్తున్నారని మండిపడింది. రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9వ తేదీన అన్ని ఆర్డీవో కార్యాలయాలకు వైసీపీ ర్యాలీలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపిచ్చారు. ఆర్డీవోలకు వినతిపత్రాలిచ్చే కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు

ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలంతా పాల్గొనాలని అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జల ఏమన్నారంటే..
శాంతియుతంగా ర్యాలీ, వినతిపత్రాలు
రైతాంగ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో ఆఫీసుల వద్దకు ర్యాలీగా వెళ్లి రెప్రజెంటేషన్ ఇస్తాం. ఇంతకు ముందే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా, గణేష్ నిమజ్జనాల వల్ల 9వ తేదీకి మార్చాం. ప్రధానంగా యూరియా సమస్య ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు బాగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎరువులు కొరత కొంత వరకు ఉంది. మిగిలిన జిల్లాల్లో రైతాంగ సమస్యలు ఉన్నాయి. క్రాప్ ఇన్సూరెన్స్, మద్దతు ధర లేకపోవడం, పంట నష్ట పరిహారం చెల్లించకపోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకపోవడం, కొన్ని చోట్ల రైతు భరోసా అందలేదు. వీటన్నింటిపై గళమెత్తాలి. యూరియా సమస్య లేని చోట్ల రైతాంగ సమస్యలపై ఆర్డీవో ఆఫీసుల వద్దకు ర్యాలీ చేపడతాం.
రైతుల్ని బెదిరిస్తున్న చంద్రబాబు
యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు దారుణంగా ఉంది. ఆయన రియాక్ట్ అయిన పద్ధతి, బెదిరిస్తూ మాట్లాడటం, సమస్యే లేదని చెప్పడం.. ఇంతగా క్యూలైన్లు ఉన్నా కూడా రైతుల్ని బెదిరించేలా మాట్లాడటం అన్యాయం. దబాయించి మాట్లాడుతూ సమస్య లేదని, వైయస్ఆర్‌సీపీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు మాట్లాడారు. మంత్రులపై సీరియస్ అయ్యారని వార్తలు వేయించుకున్నారు. వాళ్ల మౌత్ పీస్ లాంటి పత్రికల్లో, ఈనాడులో కూడా ఎరువులన్నీ మళ్లించారని రాశారు. పంట వేసి 60 శాతం అయినప్పుడు ఉన్న యూరియా సరిపోవాలి. కానీ, బ్లాక్ మార్కెట్ కు తరలించి, రేట్లు పెంచి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ఇదంతా పెద్ద స్కామ్, మాఫియా ముఠాలాగా నడిపిస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడదాం
ఇదొక విఫల ప్రభుత్వం. పాలన చేతగాని ప్రభుత్వం. వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతులకు ఎక్కడా చిన్న సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. రైతు భరోసా సొమ్ము మొదలుకొని సీజన్ ముగిసేలోపే పంటనష్టపరిహారం అందించాం. క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి రైతులకు అందించాం. కానీ, ఈ ఏడాది కాలంలోనే అవన్నీ ఘోరంగా మార్చేశారు. పైగా రైతుల్ని బెదిరిస్తూ, అవమానిస్తున్నారు. వైయస్ జగన్ అధికారంలో ఉండగా రైతులకు అండగా నిలిచిన తీరును వివరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన బలంగా మనవాణి వినిపిద్దాం. ప్రభుత్వ మెడలు వంచి యూరియా సమృద్ధిగా సరఫరా అయ్యేలా చేద్దాం. మన కార్యక్రమం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. రేపు ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ ప్రధాన కార్యాలయంలో పోస్టర్ రిలీజ్ ఉంటుంది. 7వ తేదీన నియోజకవర్గ కేంద్రాలు, 8న మండల కేంద్రాలల్లో జరుగుతుంది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు తాకట్టు పెట్టడం అన్యాయం. వైయస్ జగన్ విజన్ తో, ముందుచూపుతో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ద్వారా విద్యార్థులకు నష్టం, దానికి మించి సూపర్ స్పెషాలిటీ సేవలు పేదలకు దూరం కావడం జరుగుతాయి. ప్రైవేటుకు దీటుగా, ప్రజలకు ఉచితంగా సర్వీసులు అందడానికి వీల్లేకుండా పోతుంది. ఆ పర్పస్ దెబ్బతింటోంది. ఇది ప్రజలకు ద్రోహం చేయడంమే. 10 మెడికల్ కాలేజీలున్న చోట్ల మన పార్టీ సీనియర్ నాయకులు వెళ్లి సందర్శించి నిరసన తెలుపుదాం.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Read More
Next Story