చంద్రబాబు కొంప ముంచేది ఉచిత ఇసుకా?  నేతల చేతివాటమా?
x

చంద్రబాబు కొంప ముంచేది ఉచిత ఇసుకా? నేతల చేతివాటమా?

చంద్రబాబు ప్రొగ్రెస్ కార్డులు, హెచ్చరికలు ఆ పార్టీ నేతలకు కొత్తకాదు. శాచ్యురేషన్ మోడ్లు, పవర్ పాయింట్లు, గ్రాఫిక్స్ కు అలవాటు పడిన వారు ఆయన మాట వింటారా?


"ఇసుక విషయంలో ఎవరూ తప్పు చేయొద్దు. ఎవరినీ ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టంగా చెప్పా. తప్పు చేసిన వాళ్లపై చర్య తీసుకుంటే ఎవరూ బాధపడొద్దు. ఇసుకపై ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే. ఉచిత విధానం సక్రమంగా అమలు కాకపోతే అధికారుల్ని బాధ్యుల్ని చేస్తా. ఎవరో ఒకరిద్దరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించను" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకుల్ని.

"చంద్రబాబుకేం, బాగానే చెబుతారు. ఈ ఎన్నికల్లో ఎంతెంత ఖర్చు పెట్టామో ఆయనకేం తెలుస్తుంది. 50నుంచి వంద కోట్లు పెట్టాం. అవి ఎక్కడి నుంచి రావాలి, ఎందులోనూ తలదూర్చవద్దంటే ఎలా.. డబ్బులొచ్చే మార్గాలు రెండే.. ఒకటి మద్యం, రెండు ఇసుక. అందరికీ పెద్దపెద్ద కాంట్రాక్టులేం దక్కవు. పార్టీని మెయిన్టెయిన్ చేయాలి, కార్యకర్తల్ని కాపాడుకోవాలి, నాయకుల టూర్లు ఏర్పాటు చేయాలి, మీటింగులు పెట్టాలి. ఇవన్నీ రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా" అంటున్నారు కొందరు ప్రజాప్రతినిధులు.

"రాజకీయాలు ఖరీదైన వ్యవహారం, వ్యాపారమయమైన రోజులివి. ఇక్కడ నిజాయితీతో రాజకీయాలు చేయడమంటే కత్తిపై సాము చేయడమే. పార్టీ అధినేత ఎంత మొత్తుకున్నా జరిగేది జరిగిపోతూనే ఉంటుంది. జనం కూడా ఏదో విధంగా పని పూర్తి చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు తప్ప ప్రశ్నించడం మానేశారు. యధారాజా తథా ప్రజా" అంటున్నారు ప్రజాసంఘాల నాయకులు.
ఏదైతేనేం.. ఉచితంగా దొరకాల్సిన ఇసుక ప్రియమైంది. నిర్మాణ రంగం కుదేలయింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు వీధుల్లో నిలబడి పని కోసం ఎదురుచూడకుండా ఉండాలంటే ఇసుక లభ్యత ఉండాల్సిందే. కానీ గత ఐదేళ్లలో ఏమి జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇసుక గనుల్లో అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి గనుడంటూ ఓ అధికారిని అరెస్ట్ చేసినా, వైసీపీ నేతలపై దుమ్మెత్తి పోస్తున్నా- ఇప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇసుక దోపిడీ ఆగడం లేదు. జనాన్ని దండుకోవడం తగ్గలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దలపై వచ్చిన ఆరోపణలే ఇప్పుడూ వస్తున్నాయి. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వాళ్లు ఏమీ నేర్చుకోలేదని అర్థమవుతోంది. జనం ఆగ్రహించిన నాడు ఈ అధికారాలు ఏమీ ఆగవనే సత్యాన్ని గమనించాలి.
"ఇసుక, మద్యం వంటి అంశాల్లో తలదూర్చవద్దు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలు ఈ విషయాన్ని కచ్చితంగా పాటించాలి" అని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందూ హెచ్చరించారు. అయితే పాటించేవాళ్లు ఎవరనేదే ప్రశ్న. బాబు హెచ్చరికలతో ఈ ముఖ్యులు నేరుగా జోక్యం చేసుకోకపోవచ్చు గాని వారి అనుచరులు "కాగల కార్యాన్ని" నిర్వహిస్తారు. ఇది జగమెరిగిన సత్యం.
"వైసీపీ నేతలు చేసినట్లుగా తప్పులు చేయవద్దు. క్రమశిక్షణతో మెలగాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. అన్నారు సీఎం చంద్రబాబు. ‘ఈ నాలుగు నెలల్లో మీ పనితీరుకు సంబంధించిన ప్రోగెస్‌ రిపోర్టు నా దగ్గర ఉంది’ అని కూడా చంద్రబాబు నేతల్ని హెచ్చరించారు. "2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇదే చెప్పేవారు. కానీ ఆచరణలో ఏం జరిగింది. ఇసుక దొరక్క ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఈ రాష్ట్రప్రజలకు తెలుసు.
ఎంత విసుగు చెందకపోతే ఆవేళ చంద్రబాబును, ఆయన పార్టీని 23 సీట్లకు పరిమితం చేశారు.. ఇన్ని తెలిసినా వైసీపీ వాళ్లూ అదే బాటలో పయనించి బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు పార్టీ వాళ్లూ అదే దార్లో ఉన్నారు. గెలిచినపుడు సంపాయించుకోవాలన్న ధోరణే తప్ప జనం గురించి ఆలోచించడం, వాళ్ల బాధలు పట్టించుకోవడం ఈ తరహా నాయకులకు చేతకాదు" అన్నారు సామాజిక సేవా కార్యకర్త వి.అర్జున్ రావు. చంద్రబాబు ప్రొగ్రెస్ కార్డులు ఆ పార్టీ నేతలకు కొత్తకాదు. శాచ్యురేషన్ మోడ్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, గ్రాఫిక్స్ ఆ పార్టీ నేతలకు కొత్తకాదు. అందువల్ల వాళ్లు చంద్రబాబు మాటల్ని అంతగా ఖాతరు చేస్తారని భావించలేమన్నారు ఆయన.
151 సీట్లు గెలుచుకున్న వైసీపీ వాళ్లు ఎన్నో అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయడం వల్లనే 11 స్థానాలకు పడిపోయారని, ఎన్నికలకు ముందు ఎన్నో సర్వేలు చేయించారని, వైనాట్‌ 175 అన్నారని, వేల కోట్లు దోచుకున్న సొమ్ము పంచారని, అయినా గెలవలేకపోయారని చంద్రబాబు చెప్పిన మాట నిజమే కావొచ్చు గాని వినేవాళ్లు ఎవరన్నదే ప్రశ్న.
ఇప్పటికే ఉచిత ఇసుకపై ప్రత్యర్థి పార్టీ వైసీపీ దాడి చేస్తోంది. చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఈ హెచ్చరిక వైసీపీ ఆరోపణలకు ఊతమిస్తోంది. వైసీపీ వాళ్లు చేస్తున్న ప్రచారాన్ని దుష్ప్రచారంగా టీడీపీ కొట్టిపారేయవచ్చు గాని దోపిడీ జరుగుతోందన్నది సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటల్లోనే వ్యక్తమవుతోంది.
‘‘ఇప్పటికే రెండు, మూడుసార్లు చెప్పాను. ఇసుక విషయంలో తలదూర్చొద్దు. అందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలి’ అని చంద్రబాబే చెప్పారంటే ఈ నాలుగు నెలల్లోనే ఏ స్థాయిలో సామాన్యులను పీడించడం మొదలైందో అర్థమవుతోంది. ‘ఈ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి.. చాలనుకుంటే కుదరదు’ అని చంద్రబాబు అంటుంటే ఈసారి నాలుగు డబ్బులు సంపాయిస్తే సరి, వచ్చే ఎన్నికల నాటికి ‘రాజెవరో రెడ్డెవరో’ అనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల గురించి చంద్రబాబు ఆలోచిస్తుంటే 2024 సంపాదన గురించి ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారు.
మరేం చేయాలి చంద్రబాబు..
ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేయాలంటే చంద్రబాబు ఒక్కరే చిత్తశుద్ధితో ఉంటే చాలదు.
1. సీనరేజి రద్దు చేసినా చోటా మోటా నాయకుల చేతివాటాన్ని ఆపాలి.
2. నదిలో ట్రాక్టర్లు, ఎడ్లబళ్లు కనపడడంతోనే అధికార పార్టీ నేతలు ఎగబడే తీరు మారాలి.
3. నదులు, వాగులు, వంకల నుంచి ఎవరైనా ఎంతైనా ఇసుక తీసుకువెళ్లవచ్చునని చంద్రబాబు చెబుతుంటే అక్కడ గట్టుమీద కాపలా కాసి బెదిరించే ముఠాల ఆటకట్టించాలి.
4. ఉచిత ఇసుక పేరిట సామాన్యుల కంటే ముందే మాఫియాలు వెళ్లి ఇసుక మేటల్ని గుట్టలుగా చేసే వారి ఆగడాలు కట్టించాలంటే జిల్లా అధికార యంత్రాంగం పటిష్టంగా ఉండాలి.
5. రాజకీయ జోక్యం లేకుండా చూడాలి.
6. సీనరేజి రద్దు వల్ల ప్రభుత్వానికి రూ. 200 కోట్ల నష్టం వస్తుందేమో గాని ఉచిత ఇసుక విధానం వల్ల నిర్మాణ రంగం స్పీడ్ అందుకుంటే వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది.
ఇవేవీ అమలు చేయకుండా చంద్రబాబు హితవచనాలు పలికినంత మాత్రాన అధికార పార్టీ నేతల ఆగడాలు ఆగిపోతాయని ఊహించలేం. గతంలో ఓ ప్రజాప్రతినిధి ఓ ఎంఆర్వోపై ఎలా రెచ్చిపోయి పార్టీకి ఎంత చెడ్డ పేరు తెచ్చారో జనం ఇంకా మర్చిపోలేదు. చివరికి ఆ నాయకుడు రాజకీయ చిత్రపటంలోనే లేకుండా పోయారనేది స్థానిక నేతలు గుర్తించాలి. ఉత్తరోత్రా చంద్రబాబుకు గుదిబండగా మారే వ్యవహారాలలో ఉచిత ఇసుక కావొచ్చుననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న దశలో ప్రజాప్రతినిధులకు ఆయన చేసిన ఈ హితబోధ ఎంతవరకు ఫలితమిస్తుందో చూడాలి.


Read More
Next Story