
BC Leader - CM | ఆ ఇద్దరు చంద్రులంటే.. బాబుకు కలవరమా?
పుంగనూరు బీసీ నేత ఆఫర్ సీఎంను ఇరకాటంలో పెట్టిందా? స్వాగతిస్తే, రాజకీయ లబ్ధి కలుగుతుందిని భావిస్తున్నారా? ఇంతకీ బాబు మదిలో ఏముంది?
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పుంగనూరు బీసీ నేత ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. భారీ విరాళం ఇస్తాననే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఔనని అనలేదు. కాదని చెప్పడం లేదు. ఈ వ్యవహారంలో పుంగనూరులో ఎవరి స్టైల్ లో వారు రాజకీయ వ్యూహాలు సాగిస్తున్నారు. వెరసి ఇది ఎవరికి మేలు చేస్తుంది?
"శత్రువుకు శత్రువు మిత్రుడు" అనేది సామెత. దీనిని కూడా ప్రామాణికంగా తీసుకోని సీఎం చంద్రబాబు,
భారత చైతన్య యువజన పార్టీ (Bcyp) వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ను కూడా దగ్గరికి రానివ్వడం లేదు. దీని వెనక రాజకీయ కారణం ఉందా అనేది ప్రధాన చర్చ.
"నా స్వార్జిత ఆస్తులతో పాటు వందల కోట్లు ఆస్తిని టిటిడి కి ఇస్తా.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మిల్క్ డైరీ ఏర్పాటు చేయిస్తా. వాటన్నిటిని టీటీడీకే ద్వారాదత్తం చేస్తా" అని బీసీ పై పార్టీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాదు. బహిరంగ లేఖ కూడా రాశారు. అందులో ప్రధానంగా పుంగనూరులో గోశాల ఏర్పాటుకు తన 27 ఎకరాల మామిడి తోట రాసిస్తా అని బోడె రామచంద్ర యాదవ్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
"రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో మిల్క్ డైరీ ఏర్పాటుకు సొంత ఖర్చులు భరిస్తా. స్థలాలు సమకూరుస్తా. వాటన్నిటి ఖర్చు నేనే భరిస్తా" అని కూడా యాదవ్ వెల్లడించారు. వాస్తవానికి చాలామంది దాతలు టీటీడీకి నేరుగా విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. బోడే రామచంద్ర యాదవ్ నేరుగా సీఎం చంద్రబాబు ద్వారా ఇవ్వడానికి ఆఫర్ ఇవ్వడంలో రాజకీయ ఎత్తుగడే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే సీఎం చంద్రబాబు బీసీ నేత రామచంద్ర యాదవ్ ప్రకటనలపై స్పందించక పోవడం వెనక రాజకీయ కారణాలే ప్రధానం అని తెలుస్తోంది.
వాటికి స్పందించి స్వాగతిస్తే, బీసీ నేతకు రాష్ట్రంలో ప్రజాదరణ పెరుగుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ధార్మిక కార్యక్రమాలకు బోడే రామచంద్ర యాదవ్ విరాళాలు ఇచ్చే వ్యవహారం వెనుక రాజకీయ వ్యూహం ఉందని సీఎం గ్రహించినట్లు కనిపిస్తోంది.
సామాన్య మధ్యతరగతి బీసీ కుటుంబం నుంచి వచ్చిన రామచంద్ర యాదవ్ బెంగళూరులో వ్యాపారాలతో ఆర్థికంగా స్థిరత్వం సాధించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చే బోడే రామచంద్ర యాదవ్ చిత్తూరు జిల్లా పుంగనూరులో పదేళ్ల కిందటే రాజకీయ అరంగేట్రం చేశారు.
పుంగనూరులో ఒంటరి పోరు
జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సవాల్ గా నిలిచారు. రైతులు, విద్యార్థులు, మహిళ సమస్యలపై నే కాకుండా సామాజిక అంశాలపై ఆయన పోరాటం ప్రారంభించారు. దీనిని జీర్ణించుకోలేని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుగ వర్గంగా భావించే వ్యక్తులు అనేకసార్లు బోడే రామచంద్ర యాదవ్ నివాసం పై కూడా దాడులు చేశారు. అయినా లెక్క చేయకుండా ఒంటరి పోరు సాగించిన రామచంద్ర యాదవ్ రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రితో తలపడ్డారు. ఈ రెండు ఎన్నికల్లోను టిడిపికి భారీగానే దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కలిసి వచ్చింది. దీంతో ఆయన భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ గత ఎన్నికల్లో మాత్రం చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు తక్కువ మెజారిటీతో పెద్దిరెడ్డి విజయం సాధించారు.
పెద్దిరెడ్డికి దీటుగా పోరు
బీసీ సామాజిక వర్గానికి చెందిన బోడే రామచంద్ర యాదవ్ ఒక విధంగా పుంగనూరులో ఒంటరి రాజకీయ పోరాటం చేశారని చెప్పవచ్చు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల సమయంలో జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ రాక కోసం పుంగనూరు వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ ధ్వంసం చేయడం ద్వారా పెద్దిరెడ్డి మద్దతుదారులుగా భావిస్తున్న వ్యక్తులు విధ్వంసాలకు నాంది పలికారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత, పుంగనూరుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా పెద్దిరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో బోడె రామచంద్ర యాదవ్ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 16,452 ఓట్లు సాధించారు. టిడిపి అభ్యర్థి నూతనకాల్వ అనీషా రెడ్డి 63 876 ఓట్లు సాధించారు. వీరిపై మాజీ మంత్రి పెద్దింటి రామచంద్రారెడ్డి 42,710 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన, జనసేన నాయకుడిగా రామచంద్ర యాదవ్ వ్యక్తిగతంగా రాజకీయ కలాపాలు ఆపలేదు. ఐదేళ్లపాటు అనేక రకాల దాడులు, పోలీసు కేసులను కూడా ఎదుర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు సొంతంగా బోడె రామచంద్ర యాదవ్ ఓ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.
2024 ఎన్నికల్లో పుంగనూరు నుంచి టిడిపి అభ్యర్థిగా చల్లా బాబు (చల్లా రామచంద్రారెడ్డి) పోటీ చేసి, 93155 ఓటు సాధించారు. గట్టి పోటీ ఎదుర్కొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఎన్నికలకు భిన్నంగా, తక్కువ మెజారిటీ 6,619 ఓట్లతో విజయం సాధించారు. సొంత పార్టీ నుంచి పోటీ చేసిన బోడె రామచంద్ర యాదవ్ మాత్రం గతానికంటే భిన్నంగా, 4,423 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు.
"ఈయన సభలకు వచ్చినవారు. వెంట తిరిగిన వారిలో సగం మంది ఓట్లు వేసినా ఇంకా మెరుగ్గా ఉండేదనే" చలోక్తులు ఎన్నికల తర్వాత కూడా వినిపించాయి.
అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ టిడిపి నుంచి పోటీ చేస్తే బాగుండదని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. గత రెండు ఎన్నికల్లో ఆయన వల్ల టిడిపికి నష్టం జరిగిందనే కోపం కూడా సీఎం చంద్రబాబులో ఉన్నట్లు తెలుస్తోంది. పుంగనూరులో పెద్దిరెడ్డిని దెబ్బతీయాలని టిడిపి కూటమి ఎత్తుగడకు బీసీ నేత ప్రతిబంధకంగా మారినట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో
ఆఫర్కు ఓకే అంటే పరిణామాలు
ఎన్నికల తర్వాత పుంగనూరు రాజకీయ వాతావరణం ఓరకంగా వేడిగానే ఉంది. దీనికి భిన్నంగా బోడే రామచంద్ర యాదవ్ " నేరుగా టీటీడీకి విరాళం ఇవ్వకుండా. తిరుమల డెయిరీ ఏర్పాటుకు విధానం ప్రకటించండి" అని బీసీ నేత యాదవ్ సీఎం చంద్రబాబుకు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 20 జిల్లాల్లో టిటిడికి నెయ్యి సరఫరా చేయడానికి డైరీలు ఏర్పాటుకు.ముందుకు వచ్చారు.
ఈ ఆఫర్లకు సీఎం స్పందించాలా? నేరుగానే టీటీడీకి ఇవ్వవచ్చు కదా! అనే ప్రశ్నలు తెరపైకి వచ్చా యి.
బీసీ నేత చెప్పినట్లు స్వాగతిస్తే రాజకీయంగా రాష్ట్రంలో పరిస్థితి సానుకూలంగా మారే వాతావరణం ఉండవచ్చునేమో అని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో అంత పెద్ద స్థాయిలో " పాల కర్మాగారాలు ఏర్పాటు, గోశాలకు తన చేతుల మీదుగా 27 ఎకరాలు విరాళం స్వీకరిస్తే, బీసీ నేత ప్రాపకాన్ని మరింత పెంచినట్లు అవుతుందేమో" అనే భావనతోనే బీసీవై నేత ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు తో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు, అధికారం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
తాను విధించిన గడువులోగా ప్రభుత్వం స్పందించకుంటే, కార్యాచరణకు దిగుతానని కూడా బీసీవై నేత రామచంద్ర యాదవ్ హెచ్చరిక జారీ చేశారు.
ఈ పరిణామాలు వెనక ఇటు బీసీ నేత కావచ్చు. సీఎం చంద్రబాబు అయిన రాజకీయ కోణంలోనే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. రానున్న కాలంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.
Next Story