సీటు లేదనగానే మాయమయ్యావా జీవీఎల్ సాబ్?
x
జీవీఎల్ నరసింహరావు

'సీటు లేదనగానే మాయమయ్యావా జీవీఎల్ సాబ్?

విశాఖ కోసం జీవీఎల్... విశాఖలోనే జీవీఎల్... అంటూ రెండున్నర ఏళ్ల పాటు విశాఖలో హల్చల్ చేసిన జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు ఏమయ్యారు...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: ఉత్తర భారతదేశం నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్ నరసింహం దక్షిణ భారతదేశంలో అందునా విశాఖపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికవ్వాలనుకున్నారు. ఇందుకు సంబంధించి సన్నాహక కార్యక్రమాలు బాగానే చేసుకున్నారు. గత రెండున్నరేళ్లుగా విశాఖ నగరంలో తెగ హడావిడి చేశారు. జీవీఎల్ ఫర్ విశాఖ అంటూ పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

బిజెపి పేరిట విశాఖలో విపరీతమైన హడావిడి, ఆర్భాటం చేశారు. విశాఖ పార్లమెంటు స్థానం తనకే దక్కుతుందని ఆశించారు. టీడీపీ-జనసేన-బిజెపిల మధ్య పొత్తు జీవీఎల్ ఆశలపై నీళ్లు చల్లింది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం టిడిపికి దక్కింది. దీంతో విశాఖ పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన జీవీఎల్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసి విశాఖ ప్రజలకు మొహం చాటేశారు.

ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంధ్రకు...

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్ నరసింహారావు ఉత్తరాంధ్ర రాజకీయాలను ప్రభావితం చేయాలనుకున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్ నరసింహారావును బీజేపీ అధిష్టానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిని చేసింది. పేరుకు యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ గత మూడేళ్లుగా విశాఖలోనే మకాం వేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే విశాఖ వచ్చిన ప్రతిసారీ తన బ్రాహ్మణ కోటరితో సమావేశాలు నిర్వహించుకుంటూ, నగరంలోని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ హడావిడి చేస్తూ వచ్చారు.

ప్రతి సమావేశంలో వైసీపీ, టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ కొనసాగారు. స్థానిక సమస్యలపై దృష్టి పెడుతూ వాటి పరిష్కారానికి మార్గాలను చూపుతూ ప్రజలకు చేరువయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. వాస్తవానికి జీవీఎల్ నరసింహారావు విశాఖలో చేసిన హడావిడికి తన సొంత పార్టీలోని నాయకులు కూడా అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాలని ఆశించి ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. విశాఖ లోక్‌సభ స్థానం కచ్చితంగా తనదేనని ధీమాతో ఉన్న జీవీఎల్‌కు ఈ స్థానం టీడీపీకి దక్కడంతో గట్టి షాక్ తగిలింది.

సంక్రాంతి సంబరాలు...

సంక్రాంతి సంబరాల పేరుతో జీవీఎల్ నరసింహం.. విశాఖలో చేసిన కార్యక్రమం వివాదాలకు తెరలేపింది. దీని కోసం ప్రత్యేకంగా జీవీఎల్ టీంను ఏర్పాటు చేసుకున్నారు. విశాఖ నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ గ్రౌండ్’లో నాలుగు రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలు పార్టీ తరపున కాదని, ప్రచారంలో తన ఫోటోలు తప్ప మరెవరివి పెట్టలేదు. దీనికి సుమారుగా ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చయిందని అంచనా.

అయితే ఈ కార్యక్రమాలకు నిధులన్నీ విశాఖ నగరంలోని కేంద్ర రంగ సంస్థలైన ఐఓసీ, హెచ్పీసీఎల్, కోరమండల్ ఫెర్టిలైజర్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఎస్బిఐ, తదితర సంస్థలు సమకూర్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల కోసం వినియోగించాల్సిన సీఎస్‌ఆర్ నిధులను ఈ విధంగా జీవీఎల్ నరసింహారావు తన సొంత ప్రచార ఆర్భాటాలకు వినియోగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఆయా సంస్థలు జీవీఎల్ కోసం ఎందుకు ఖర్చు చేశాయో కూడా ఎవరికీ తెలియని విషయం. ఏది ఏమైనా సంక్రాంతి సంబరాలతో కొంతమేర జీవీఎల్ విశాఖ నగర ప్రజలకు దగ్గరయ్యారు.

బీచ్ వాక్....

సంక్రాంతి సంబరాలు ముగిసి పది రోజులు కూడా కాకుండానే రిపబ్లిక్ డేను పురస్కరించుకుని వైబ్రంట్ వైజాగ్ పేరుతో బీచ్ రోడ్డులో కలర్స్ రన్ నిర్వహించారు. అయితే బీజేపీ తరపున కాకుండా వ్యక్తిగతంగా ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించడం పార్టీలో వివాదాలకు కారణమయ్యింది. భారతీయ జనతా పార్టీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఓ కొత్త సంప్రదాయానికి నరసింహారావు తెరలేపారు. చివరి వరకు కూడా తనకే విశాఖ సీటు దక్కుతుందని ఎంతో ఆశపడి భంగపడ్డారు.

ఆశించాను కానీ....

విశాఖ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ తరఫున ఆశించిన జీవీఎల్ నరసింహం ఆ స్థానం దక్కకపోవడంతో కొంత మనస్తాపానికి గురయ్యారు. విశాఖ ప్రజలకు వివరణ ఇస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసి సొంతూరు నరసరావుపేట వెళ్లిపోయారు. 'విశాఖపట్నం టిక్కెట్టు ఆశించాను. కానీ అది నెరవేరలేదు. నేను విశాఖ ప్రజలకు చేసిన సేవలు, సమస్యల పరిష్కారానికి చూపిన చొరవ ఎన్నికల కోసం కాదు. విశాఖ అభివృద్ధికి నేనెప్పుడూ కట్టుబడి ఉంటాను. తిరిగి మళ్లీ వస్తా భవిష్యత్ కార్యాచరణపై విశాఖ ప్రజలతో చర్చిస్తా' అంటూ ఆ వీడియోలో జీవీఎల్ నరసింహారావు వివరణ ఇచ్చారు. బీజేపీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అంటూ చివర్లో కొసమెరుపు ఇచ్చారు. ఆశించిన స్థానం దక్కాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందే.



Read More
Next Story