జగన్‌ నియంతృత్వ ధోరణే పార్టీలో ప్రమాదకరంగా మారింది. అది మితి మీరడంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎమ్మెల్సీలు, ఎంపీలు వైసీపీని వీడుతున్నది కూడా అందుకే.


రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నారో లేదో తెలియదు కానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంటే ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అమరావతి ప్యాలెస్‌లో ఫిడేలు వాయిస్తూ కూర్చున్నట్లు ఉన్నారని ఆ పార్టీ వర్గాల్లో అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.

కేవలం 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ వ్యవహార శైలి, ఏక పక్ష నిర్ణయాలు, నలుగురిని కలుపుకొని వెళ్లే స్నేహపూరిత వాతావరణ కొరవడటం వల్లే ఓటమి పాలైంది. అధికారంలోకి రాక ముందు పాద యాత్రల పేరుతో ప్రజల్లో తిరిగిన జగన్, అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత అమరావతి ప్యాలస్‌కే పరిమితమయ్యారు. అక్కడ కూడా ఎవ్వరినీ కలవ లేదు. జగన్‌ను కలిసే వారిని వేళ్ల మీద లెక్కించొచ్చు. సీనియర్‌ నేతలకు కూడా కలిసేందుకు అపాయింట్లు ఇవ్వ లేదు. పేరుకే ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు. వారికి కూడా అప్పాయింట్‌మెంట్లు ఉండేవి కాదు. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఇంకా దారుణం. జగన్‌ను కలవాలంటే గగనమే. అంత ఈజీగా అయ్యే పని కాదు. అంతా నియంతృత్వంతో వ్యవహరించారు. ఇది పెద్ద ఎత్తున ప్రతికూలతను క్రియేట్‌ చేసింది.
పార్టీ సమావేశాల్లో కూడా ఒన్‌ వే ట్రాఫిక్‌లా మారింది. ఎవ్వరూ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చే వారు కాదు. సలహాలు సూచనలు తీసుకునే వారు కాదు. ఎన్నికల్లో పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు, వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతికూల వాతావరణం పెరుగుతోంది వంటి పలు అంశాల గురించి జగన్‌ వద్ద చర్చించేందుకు ప్రయత్నించిన ఒక ఎమ్మెల్యేకు అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వక పోవడంతో భంగ పాటు తప్ప లేదు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇప్పటికీ అదే ధోరణితోనే జగన్‌ వ్యవహరిస్తున్నారు.
ఇక అధికారులతో సమావేశాల్లో కూడా ఇదే తరహాలోనే సాగాయి. నిర్ణయాలు, ఆదేశాలు పాలకులు ఇచ్చినా.. వాటిని అమలు చేసేది మాత్రం అధికార యంత్రాంగమే. అందులో ఉన్న లోటు పాట్లు, కష్ట నష్టాలపై అధికారులకే నాలెడ్జ్‌ ఉంటుంది. అందుకే పాలకులు వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. సహజంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు ఎవరైనా అది పాటిస్తారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆ వాతావరణం లేకుండా పోయింది. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిది వినడం తప్ప మాట్లాడేందుకు కానీ, పాలసీలకు సంబంధించిన చర్చలు కానీ, అందులో తలెత్తే సమస్యల గురించి కానీ వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే అంశాలకు సంబంధించి మంచీ చెడులు చర్చించే చాన్స్‌ కానీ, సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం కానీ అధికారులకు లేకుండా పోయింది. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి చెప్పింది వినడానికే అధికారులు వెళ్లే వారనే టాక్‌ అధికార వర్గాల్లోను, ఆ పార్టీ శ్రేణుల్లోను ఉంది.
కేవలం జగన్‌ వ్యవహార శైలి వల్లే పార్టీకి కూడా నష్టం జరుగుతోంది. గ్రామ స్థాయి నాయకుల నుంచి రాజ్య సభ ఎంపీల వరకు పార్టీని వీడుతున్నా జగన్‌ కిమ్మనడం లేదు. వారిని పిలిపించి మాట్లాడి పార్టీ కేడర్‌ను నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేయడం లేదు. ఉండే వాళ్లు ఉంటారు.. పోయే వాళ్లు పోతారనే ఆలోచనల్లోనే జగన్‌ ఉన్నారు. తానే నాయకులను తయారు చేస్తానని, వీళ్లు ఉంటే ఎంత పోతే ఎంత అన్న భావనలో జగన్‌ ఉన్నారని, ఇది పార్టీ భవిష్యత్‌కు తీరని నష్టాన్ని మిగుల్చుతుందని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల నుంచి వందల సంఖ్యలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీని వీడారు. ఆళ్ల నాని వంటి మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. పోతుల సునీత, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ రాజీనామాలు చేయగా, రాజ్య సభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావులు రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసే ఎమ్మెల్సీలు, ఎంపీల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది. అయినా జగన్‌లో ఎలాంటి చలనం లేదని, ఉండే వాళ్లు ఉంటారు.. పోయే వాళ్లు పోతారనే ఉద్దేశంతో విదేశీ టూర్‌కు మూటా ముల్లె సర్థుకునే పనిలో ఉన్నారనే చర్చ వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
Next Story