పెద్దిరెడ్డి కళ్లలో ఆందోళన చూసేందుకేనా... సీఎం బాబు పర్యటన
x

పెద్దిరెడ్డి కళ్లలో ఆందోళన చూసేందుకేనా... సీఎం బాబు పర్యటన

లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు తప్పదా?


తిరుపతిలో సీఎం ఎన్. చంద్రబాబు పర్యటన వెనుక ఆంతర్యంపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన వెనక ప్రధాన కారణం వేరే ఉందనే మాట వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

విజయవాడలో సిట్ అధికారుల ముందు లిక్కర్ కుంభకోణంలో విచారణకు కోసం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్నారు.
విజయవాడ నుంచి సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనకు వస్తున్నారు. వారిద్దరి పర్యటనల్లో ఒకరిది యాథృశ్ఛకమైనా, సీఎం చంద్రబాబు పర్యటన వెనక..
"పెద్దిరెడ్డి కళ్లలో దైన్యం. వారి అనుచరుల్లో కలవరం చూడడానికే" అనే మాటలు వినిపిస్తున్నాయి.
తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ముందస్తుగా ఖరారైంది కాదు. రెండు రోజుల కిందట పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. అంటే తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన వర్గీయుల స్థితి ఎలా ఉంటుందో చూడబోతున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కాగా,
స్వచ్ఛంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనడానికి ప్రతి నెలా మూడో శనివారం ఓ జిల్లా పర్యటనకు వెళుతున్నారు. అందులో భాగంగానే, తిరుపతి పర్యటన రెండు రోజుల కిందట ఖరారు అయింది. మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా శుక్రవారం విడుదల చేశారు.
తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గంలోనీ నారావారిపల్లెకు చెందిన సీఎం చంద్రబాబుకు పుంగనూరు నియోజకవర్గం సదుం గ్రామానికి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య నలభై ఏళ్ల నుంచి రాజకీయ వైరం ఉంది.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వీరిద్దరికీ వైరం మొదలైంది. అప్పటినుంచి వారిద్దరూ ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలనే విధంగానే రాజకీయాలు సాగిస్తున్నారు. ఆ విషయాన్ని ఒకసారి గమనిద్దాం.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చంద్రబాబు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యార్థి ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా మారారు. రెడ్డి వర్సెస్ నాన్ రెడ్డి అనేది ఇక్కడ రాజ్యమేలినట్టు ఆ నాటి సంఘటనను గుర్తుచేసుకునే వారి మిత్రులు చెబుతారు.
1975లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోషయాలజీలో Ma చేస్తున్నారు. చంద్రబాబు ఎకనామిక్స్ లో ఉన్నారు. మరుసటి సంవత్సరం యూనివర్సిటీలో ఎన్నికల్లో పెద్దిరెడ్డి పోటీ చేశారు. పోటీకి దిగని చంద్రబాబు ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించడానికి రెడ్డి వ్యతిరేక అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. అయినా పెద్దిరెడ్డి గెలిచారు. అప్పటి నుంచి ప్రత్యర్థులుగా మారిన సీఎం చంద్రబాబు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.
చిత్తూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గంతో పాటు నియోజకవర్గాల్లో బీసీలు, ఎస్సీలకు పదవులు దక్కించడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించి తన వర్గాన్ని బలోపేతం చేసుకున్నారు. ఆయన ఉండేది ఏ పార్టీ అయినా సరే జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించే స్థాయిలోనే యూనివర్సిటీకి ఏ మాత్రం తీసిపోని స్థితిలో సీఎం చంద్రబాబుకు కొరుకుడు పడని కొయ్యగా తయారయ్యారు.
ప్రతి ఎన్నికల్లో వారి అభ్యర్థులను గెలిపించుకోవడంలో చంద్రబాబు, పెద్దిరెడ్డి అనుసరించే ఎత్తుగడలు మరెవరికి సాధ్యం కావని చెప్పడంలో సందేహం లేదు.
2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ రాజకీయ ప్రస్తానానికి గుడ్ బై చెప్పి పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీలో చేరింది..పెద్దిరెడ్డి కుటుంబం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి, ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి తంబళ్లపల్లి నుంచి, కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.. కాంగ్రెస్ పార్టీ తరహాలోనే వైసీపీలో కూడా వారంతా కింగ్ పిన్ గా మారారు.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో అధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.
2024 ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 9వ తేదీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం ఎన్ చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం (SIT) కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించింది. అదే సమయానికి అప్పటి సీఎం వైఎస్. జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు.
టిడిపి అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి రోడ్డుపైకి వచ్చారు. నిరసనలకు దిగారు. పార్టీ క్యాడర్ దేశ విదేశాల్లో ఆందోళనలకు తెర తీశారు.
"ఈ పరిణామాలు అన్నిటిని వైసిపి పెద్దలు ఆస్వాదించారు" అనే మాటలు వినిపించాయి. అక్రమ కేసు బనాయించి తమ నాయకుడిని అరెస్టు చేశారని టిడిపి శ్రేణులు భారీగా నిరసనలకు దిగాయి.
సీన్ కట్ చేస్తే.
2024 ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులు, కుంభకోణాలను వెలికి తీసింది. అందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు నిర్వహించిన అటవీ భూగర్భ గనుల శాఖలో జరిగిన అక్రమాలపై టిడిపి కూటమి ఫోకస్ పెట్టింది. భూముల ఆక్రమాలపై వివరాలు వెలుగులోకి తెచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే విషయంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
మాజీ సీఎం వైఎస్ జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులతో పాటు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన మిత్రుడిని కూడా అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణం తెరపైకి తీసుకు వచ్చిన నేపథ్యంలో..
వైసిపి మాజీ రాజ్యసభ సభ్యుడు ఏ విజయసాయిరెడ్డి ఓ మాట చెప్పారు.
"ఈ వ్యవహారంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యవహారం సాగించారు" అని విజయ్ సాయి రెడ్డి చెప్పిన విధంగానే దర్యాప్తు చేసిన సిట్ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసులో 4వ నిందితుడిగా చేర్చింది.
"ఈ కేసుతో నాకు సంబంధం లేదు. అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం" అనే మాటను కూడా ఎంపీ మిథున్ రెడ్డి అనేకసార్లు చెప్పారూ. తాజాగా విజయవాడలో కూడా పునరుద్ధాటించారు. కాగా,
"వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడం, విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసు కూడా జారీ అయ్యింది" ఈ పరిస్థితుల్లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందనే విషయంపై బలంగా వినిపిస్తోంది.
ఇదే సమయంలో తన సొంత జిల్లా తిరుపతికి సీఎం చంద్రబాబు పర్యటనకు రావడం కూడా ఆసక్తికరం గా మారింది.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు జరిగితే? చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్గీయుల రియాక్షన్ ఎలా ఉంటుంది.
తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
చిత్తూరు జిల్లాలో ప్రధానంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల్లో కలవరం, ఆందోళన ఎలా ఉంటుంది? దానిని పరోక్షంగా అయినా చూడాలనేది సీఎం చంద్రబాబు అభిమతం కనిపిస్తోందనే నిరసన వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
Read More
Next Story