రాయలసీమ హక్కుల అమలుపై నిర్లక్ష్యమేనా ?
x

రాయలసీమ హక్కుల అమలుపై నిర్లక్ష్యమేనా ?

రాష్ట్ర విభజన జరిగిన పది సంవత్సరాలు పూర్తి కావొస్తున్నాయి. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించడానికి ఆ రాష్ట్రప్రభుత్వం భారీగా..


రాష్ట్ర విభజన జరిగిన పది సంవత్సరాలు పూర్తి కావొస్తున్నాయి. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించడానికి ఆ రాష్ట్రప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర, తెలంగాణ మధ్య జరగాల్సిన పంపకాలపై అనేక ప్రశ్నలు చెలరేగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా విభజన సమయంలో రాయలసీమలో అమలు చేస్తామన్న హక్కులపై చర్చ జరుగుతోంది. ఈ హక్కుల అమలును ప్రస్తుతం ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వమైనా వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. త్వరలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న క్రమంలో రాయలసీమ ప్రజా సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇందులో రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై వారు కీలకంగా చర్చించారు. ఈ సమావేశం రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాల్లో అవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి

రాష్ట్ర విభజన చట్టం రాయలసీమ అభివృద్ధికి అనేక హక్కులను కల్పించినప్పటికీ వాటి అమల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వీటి అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయని బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వమైనా ఈ హక్కుల అమలుపై దృష్టి పెట్టాలని, రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.

శిథిలావస్థలో నీటి ప్రాజెక్ట్‌లు

రాయలసీమలో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లు శిథిలావస్థలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన కృష్ణా జలాల పంపకం వల్ల తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులకు 100 సంవత్సరాల్లో ఒకటి లేదా రెండు సంవత్సారాల్లో మాత్రమే నీరు లభించే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెల్పాండ్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందించి, తద్వారా మిగిలే కృష్ణా జలాలను పై ప్రాజెక్టులకు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింపును రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పాలకులు ఈ ప్రాజెక్టును పూర్తిగా విస్మరించి గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ, వెలుగొండ ప్రాజెక్టుల భవిష్యత్తును గాలికి వదిలేశారు అని తీవ్రంగా విమర్శించారు.

రాయలసీమకు తీవ్ర ద్రోహం

కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెత్తికెత్తుకొని రాయలసీమకు తీవ్ర ద్రోహం చేసిందని బొజ్జా విమర్శించారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులకు నిధుల మళ్లింపుతో తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగడం లేదని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణకు కూడా నిధులు సరిగా కేటాయించకపోవడంతో రాయలసీమలో నికర జలాలపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు రాయలసీమ హక్కుగా ఉన్న కృష్ణా జలాలలో కోతను విధించి తెలంగాణకు కేటాంపులు చేసే విధంగా అక్టోబర్ 6, 2023న కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గెజిట్ నోటిఫికేషన్‌పై మౌనం వహించిన అధికార, ప్రతిపక్ష పార్టీల తీరుపై విడ్డూరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్చల అనంతరం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

తీర్మానాలివే..

రాయలసీమ ప్రజల హృదయ స్పందన సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 8 వ వార్షికోత్సవంను జూన్ 10, 2024 న సంగమేశ్వరం వద్ద ఘనంగా నిర్వహించాలని తీర్మానించడమైనది.

రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సాగు నీటి ప్రాజెక్టుల సత్వరం పూర్తి మరియు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సక్రమ నిర్వహణకు చేపట్టాల్సిన అంశాలపై నివేదికను నూతన ప్రభుత్వానికి అందించాలని తీర్మానించడమైనది.

పాలనా వికేంద్రీకరణలో భాగంగా చేపట్టాల్సిన హైకోర్టు, సీడ్ హబ్, హార్టికల్చర్ హబ్, అనేక రాష్ట్రస్థాయి కార్యాలయాలు కార్పొరేషన్ ల ఏర్పాటుపై నివేదికను నూతన ప్రభుత్వానికి అందించాలని తీర్మానించడమైనది.

రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ, గుంతకల్ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, అనంతపూర్ లో ఎయిమ్స్, చిత్తూరు జిల్లాలో బీహెచ్ఈఎల్ తదితర అంశాల అమలుపై విజ్ణాపన పత్రాన్ని నూతన ప్రభుత్వానికి అందించాలని తీర్మానించడమైనది.

అంతేకాకుండా జూన్ 10 న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 8 వ వార్షికోత్సవం ఘనంగా జరిపించుకోవాలని నిర్ణయించుకున్నారు.

Read More
Next Story