చంద్రబాబు వైసీపీ వాళ్లకు పనులు చేయవద్దని చెప్పడం న్యాయమేనా?
x

చంద్రబాబు వైసీపీ వాళ్లకు పనులు చేయవద్దని చెప్పడం న్యాయమేనా?

ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? CMహోదాలో అసలు అలా అనవచ్చా? ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వాళ్లకే పనులు చేస్తారా? మిగతా వాళ్లకి చేయరా? అసలు చంద్రబాబు మదిలో ఏముందీ?


12 జూన్ 2024... విజయవాడకు సమీపంలోని గన్నవరం వద్ద..
‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’..
1 మార్చి 2025...చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడుపల్లిలో చంద్రబాబు..
‘మిమ్మల్ని ఒకటే కోరుతున్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్టుగా గాని ఇన్ డైరెక్టుగా గాని మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలోనూ రాకూడదు’..
ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి 10 నెలలు. ఇంతలో ఇంత మార్పా?
2019 మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినపుడు, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే చెప్పిన మాట..
కులం చూడం..
మతం చూడం..
ప్రాంతం చూడం..
పార్టీ చూడం..రాజకీయం చూడం.. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయంగా అందాల్సినవన్నీ అందిస్తాం..
ఒకరిది 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. మరొకరిది అందులో సగం.. ఒకళ్లు 1975లలో రాజకీయాల్లోకి వస్తే మరొకరు 2004లో రాజకీయ ఆరంగ్రేటం చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై వివాదం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సహాయం చేయమని చెప్పడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
రాజకీయ పండితులు చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. "40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా ఆయన ఇలా చెప్పడం ఆశ్చర్యకరం. ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రజాసేవకుడు మాత్రమే, ఓ రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి" అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మనది ప్రజాస్వామ్యం. ‘ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు’ అనుకుంటూ అనుసరిస్తున్న ప్రజాస్వామ్యం అక్షరాలా మేడిపండు అని నిరూపిస్తున్నారు రాజకీయ నాయకులు.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లు ఇలా ఒక పార్టీ వారికి మాత్రమే సాయం చేసుకుంటూ పోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందన్నది ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న చర్చ. ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఓటేయని వారు, ప్రత్యర్థులు మట్టికొట్టుకు పోవాల్సిందేనా? అనే సందేహం కలుగుతోందంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు కె.రఘురామయ్య. ఇదే అంశమై శాసనమండలిలో వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా ప్రశ్నించారు.
రాజకీయమంటే ఇదేనా?
రాజకీయం అంటే ప్రజాసంక్షేమం, దేశ పరిపాలన, పాలక వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు, ప్రజాస్వామ్యం, ఎన్నికలు, పార్టీలు, ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాలు వంటి అంశాలకు సంబంధించిన వ్యవస్థ. కాని ఇప్పుడు అందుకు విరుద్ధంగా సాగుతోంది. తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన వారికి లేదా నాయకులకు సాయపడకపోవడమే రాజకీయం అయింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తి ప్రజాసేవకుడు. అందరివాడు. రాజ్యాంగబద్ధంగా సమానత్వం, నిష్పక్షపాత వైఖరి పాటించాలి. కానీ చంద్రబాబు లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి వైసీపీ వాళ్లకు పనులు చేయవద్దని చెబుతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
రాజకీయ ప్రత్యర్ధుల స్పందన..
ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర మంత్రి ఒకరు మాట్లాడుతూ, "ఒక ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు సమానంగా పాలన అందించాలి. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నేత ఇలా మాట్లాడడం ప్రజాస్వామ్య విలువలను నీరుగార్చేలా ఉంది" అని అన్నారు.
ఇదే సమయంలో, చంద్రబాబు అనుచరులు ఆయన మాటల్ని సమర్థిస్తూ, "ప్రత్యర్థి పార్టీలు రాజకీయ కక్ష సాధింపునే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు సహాయం చేయడం సాధ్యమా?" అని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ ఆయన ఓ పార్టీ అధినేతగా ఆ మాట అన్నారని అనుకున్నా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని విస్మరించడం సబబు కాదు అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతికారం చుట్టూతా తిరుగుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ అదానీలకు, అంబానీలకే ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేది తక్కువేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
న్యాయపరమైన కోణం..
ప్రజా ప్రతినిధులు నియమావళి ప్రకారం ప్రభుత్వ హోదాలో ఉన్న వారు పార్టీ భేదం లేకుండా ప్రజలందరికీ సమానంగా సేవలు అందించాలి. ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు తన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి వివక్ష చూపితే, రాజ్యాంగ విరుద్ధ చర్యగా పరిగణించబడే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన వివాదాస్పద వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు. ఆయన అనుసరించిన వైఖరిని వివరిస్తూ, తాను చెప్పిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రాజకీయ కక్షసాధింపునకు ప్రతిస్పందన
చంద్రబాబు తన వ్యాఖ్యలను సమర్థించే వారి ప్రకారం "వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను శత్రువులా చూసింది. మేము మాత్రం సహకరించాలని కోరుతుంది. ఇది ఎంతవరకు సమంజసం?" అని ప్రశ్నించారు. "ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవం ఉండాలి. అది లేని సమయంలో సహకారం ఎలా సాధ్యమవుతుంది?" అని అన్నారు టీడీపీకి చెందిన ఓ సామాన్య కార్యకర్త.
మిమ్మల్ని అంటే టీడీపీని పూర్తిగా అణగదొక్కే విధంగా విమర్శలు చేస్తున్న వారికి మేము ఎందుకు సహకరించాలి?" అని ప్రశ్నిస్తున్నారు ఆయన.
తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇచ్చిన సందేశంలో, "ప్రత్యర్థులు ఎప్పుడూ మాకు సహకరించలేదు. మనం కూడా రాజకీయంగా అప్రమత్తంగా ఉండాలి" అని అన్నారు.
ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. భారత రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ ప్రకారం, ఈ ప్రమాణంలో రాజ్యాంగాన్ని సమర్థంగా నిర్వహించడం, నిష్పక్షపాతంగా పాలన సాగించడం అనే అంశాలు ఉంటాయి. అయితే, ఒక ముఖ్యమంత్రి ఈ ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరిస్తే, చట్టపరమైన, రాజకీయపరమైన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుంది.
రాజ్యాంగంలోని ముఖ్యమైన నిబంధనలు..
ఆర్టికల్ 164: ముఖ్యమంత్రి నియామకం, ప్రమాణ స్వీకారం, రాజీనామా వంటి అంశాలను నియంత్రిస్తుంది.
మూడో షెడ్యూల్: ఇందులో ప్రమాణ స్వీకారం, నైతిక బాధ్యతలు, రాజ్యాంగ నిబంధనలను గౌరవించాల్సిన విధానం ఉన్నాయి.
ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘనే.
ప్రమాణాన్ని ఉల్లంఘించడంపై చట్టపరమైన చర్యలు...
మౌలిక హక్కుల ఉల్లంఘన- ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు): ఒక ముఖ్యమంత్రి పార్టీ, కులం, మతం లేదా ఇతర విభజనల ఆధారంగా వివక్ష చూపితే అది సమానత్వ హక్కు ఉల్లంఘనగా మారుతుంది.
ఆర్టికల్ 21 (జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ): ప్రభుత్వ వైఖరి ప్రజలను అన్యాయంగా వేధిస్తే లేదా రాజకీయంగా హింసిస్తే, వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన అవుతుంది.
రాష్ట్రపతి పాలనకు అవకాశం... ఆర్టికల్ 356: ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలన చేయడంలో విఫలమైతే, రాష్ట్రపతి పాలన (President’s Rule) విధించడానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు.
ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని నిర్ధారణైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశముంది.
న్యాయపరమైన పరిష్కార మార్గాలు
ఆర్టికల్ 226 (హైకోర్టు అధికారం): హైకోర్టు మాండమస్ (Mandamus) – ముఖ్యమంత్రికి రాజ్యాంగబద్ధంగా పాలన చేయమని ఆదేశించవచ్చు.
క్వో వారాంటో (Quo Warranto) – ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందా లేదా అనే దానిపై విచారణ జరిపే అధికారం.
నిషేధాజ్ఞలు (Prohibition) – ప్రభుత్వ అక్రమ చర్యలను నిలిపివేయవచ్చు.
ఆర్టికల్ 32 (సుప్రీంకోర్టు అధికారం): ప్రధానంగా పౌరుల మౌలిక హక్కులను అమలు చేయడానికి సుప్రీంకోర్టు రిట్‌ పిటిషన్ ఇచ్చే అధికారం కలిగి ఉంటుంది.
ప్రజాప్రతినిధుల చట్టం, 1951 ప్రకారం ముఖ్యమైన నిబంధనలు
సెక్షన్ 123 (అవినీతి చర్యలు):
ఒక ముఖ్యమంత్రి లంచాలు, అసమానతా విధానాలు, కుల మతపరమైన ప్రేరణలు ఇచ్చినట్లయితే, ఎన్నికల అర్హత రద్దు చేయవచ్చు.
సెక్షన్ 499 (దూషణ చట్టం): ముఖ్యమంత్రి ఎవరినైనా వ్యక్తిగతంగా లేదా రాజకీయంగా దూషించినట్లయితే, కోర్టులో క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి ప్రాధాన్యత చాలా ఎక్కువ. తాము స్వీకరించిన ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరిస్తే, రాజ్యాంగపరమైన విచారణ, చట్టపరమైన చర్యలు, రాజకీయ ఒత్తిళ్లు & పదవి కోల్పోవడం లాంటివి ఎదుర్కొనాల్సి ఉంటుంది.
అందువల్ల, ప్రభుత్వ విధానాలు నిష్పక్షపాతంగా, రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి నిర్ధారించుకోవాలి. లేకుంటే, న్యాయపరమైన చర్యలు, రాష్ట్రపతి పాలన, పదవి కోల్పోవడం వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన రాజ్యాంగబద్ధ పదవీ స్వీకార ప్రమాణాన్ని ఉల్లంఘించారనే టాక్ వినిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ వాళ్లకు ఎలాంటి పనులు చెయ్యొద్దని ముఖ్యమంత్రి హోదాలో ఆయన వ్యాఖ్యానించడంపై రాజకీయ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్లో పదవీ స్వీకార ప్రమాణం పవిత్రత, నిబద్ధత గురించి స్పష్టంగా వివరించారు. రాజకీయ కారణాలతో ఎవరికైనా సరే ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందకుండా చేయడమంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే. ఇలా పాల్పడే వారిపై న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు కోర్టుల్లో సవాల్‌ చేసే అవకాశం ఇచ్చినట్టయింది.
ఇదిలాఉంటే.. అధికార ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో మిలాఖత్ అయ్యారని, వారిని హెచ్చరించేందుకే బహుశా చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఓ సీనియర్ జర్నలిస్టు అన్నారు. దాదాపు 130 మంది ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో వైసీపీ వాళ్లు చేతులు కలిపినట్టు చంద్రబాబుకు సమాచారం ఉందని సమాచారం.
Read More
Next Story