విజయవాడ తూర్పు ఓటర్ల మొగ్గు అటేనా..
x

విజయవాడ తూర్పు ఓటర్ల మొగ్గు అటేనా..

విజయవాడ తూర్పులో ఓటరు నాడి తెలుసుకునేందుకు 'ది ఫెడరల్‌' ఓ ప్రతయ్నం చేసింది. క్షేత్ర స్థాయి పరిశీలనలో ఓటర్ల అభిప్రాయాలు వారి మాటల్లోనే.


మంగళవారం రాత్రి 8 గంటలు దాటింది. సీనియర్‌ కొలీగ్‌తో కలిసి బైక్‌పై బయలు దేరాం. విజయవాడ తూర్పు నియోజకం పరిధిలో స్క్రూబ్రిడ్జి నుంచి రాణిగారితోటకు మూవ్‌ అయ్యాం. జాతీయ రహదారి 16 పక్కనే సర్వీస్‌ రోడ్డు ఉంది.


ఈ రోడ్డు మార్గం ద్వారా రాణిగారి తోటకు బయలు దేరాం. దాదాపు అర కిలోమీటరు డిస్టెన్స్‌ ఉంటుంది. మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. దానికి ఇరువైపులా రాణిగారితోట విస్తరించి ఉంటుంది. ఇరుకైన రోడ్లు. మద్యలో ఉన్న రోడ్డు జనంతో కిక్కిరిసి ఉంది. నిత్యం ఇలానే ఉంటుంది. ఇరువైపుల షాపులు ఉండటంతో జన సంచారం ఉంది. ఆటోలు, టూ వీలర్స్‌ అటూ ఇటూ తిరుగుతున్నాయి. కొంత మంది ఆకతాయిలు కటింగ్‌లు కొట్టుకుంటూ స్పీడ్‌తో బైక్‌లు నడుపుతున్నారు. వాటిని, జనాన్ని తప్పించుకుంటూ ముందుకు సాగి ఒక సెలూన్‌ షాపు వద్ద ఆగాం. అప్పుడే ఓ వ్యక్తికి హెయిర్‌ కటింగ్‌ చేసిన ఆ షాపు యజమాని కుర్చీలో కూర్చుని సేద తీరుతున్నాడు. ఆప్యాయంగా పలకరించాడు.


హెయిర్‌ కటింగ్‌ కోసం వచ్చామేమో అని చెయిర్‌లో నుంచి లేవబోయాడు. కటింగ్‌ మర్లా చేయించుకుంటామనగానే కూర్చోండని అక్కడున్న బెంచిన చూపించాడు. ఇద్దరం అక్కడ కూర్చున్నాం. ఆ షాపులో ఏసీ లేదు. ఎండల తీవ్రత, ఎన్నికల గురించి కొద్ది సేపు ముచ్చటించాడు. ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారని అడిగాం. టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి దేవినేని అవినాష్‌ పోటీలో ఉన్నారని చెప్పారు. ఎవరు గెలుస్తారని అడగ్గా గద్దె రామ్మోహన్‌ గెలుస్తారని చెప్పాడు. ఎందుకు అని అంటే గద్దె సౌమ్యుడని, అందరినీ కలుపుకొని పోతారని, సమస్యలు పరిష్కరిస్తారని చెప్పాడు. ఆయన ఇంటికెళ్లి కూడా స్థానికుల సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందన్నాడు.


మరి దేవినేని అవినాష్‌ పరిస్థితి ఏమిటని అడితే.. అవినాష్‌ కూడా మంచి వ్యక్తేనని, అయితే ఆయన కంటే గద్దె రామ్మోహన్‌నే ఎక్కువ మంది అభిమానిస్తారని, ఈ సారి కూడా గద్దె రామ్మోహనే గెలుస్తాడరని చెప్పుకుంటూ వచ్చారు. ఇలా అరగంట సేపు ఆయనతో మాట్లాడాం. ఇక అక్కడ నుంచి రిటర్న్‌ అయ్యాం.

రామలింగేశ్వర నగర్‌ కట్ట మీద బైక్‌పై బయలు దేరాం. కట్టపైన అటు ఇటు అనేక రకాల షాపులు ఉంటాయి. వాహనాల రద్దీ కూడా ఎక్కువుగానే ఉంటుంది. సింగిల్‌ రోడ్డు. కిలోమీటరు ప్రయాణం తర్వాత రోడ్డు పక్కన ఒక షాపు యజమాని కుర్చీలో కూర్చుని బయట ఆరు గాలికి సేద తీరుతున్నాడు. పడవలరేవు సెంటర్‌ నుంచి ఎన్‌టిఆర్‌ సర్కిల్‌కు వెళ్లే దారిలో ఉన్న ఆ చెప్పుల షాపు పక్కన బైక్‌ ఆపి షాపు ముందు చెట్టుకింద కుర్చీ వేసుకుని ఉన్న వ్యక్తిని పలకరిస్తే ఇది మాషాపేన్నారు. బయట ఎందుకు కూర్చున్నావంటే లోపల ఉక్కపోతగా ఉంది.

సాయంత్రం కావడం వల్ల కాస్త చల్లగా ఉందని కూర్చున్నా సార్‌ అన్నారు. మే ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగితే ఒక కుర్చీ ఉంది. పక్కన మరో స్టూలు వేసి కూర్చోమన్నారు. ఎన్నికల విశేషాలేంటని మాట కలిపాం. ఏముంటాయయ్యా.. అందరూ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూడా సాయంత్రం అయ్యే సరికి చెవులు గియ్‌ అంటున్నాయన్నారు. అయిగో మైకుల గోల చూడంటి అంటూ చూపించారు. వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన మైక్‌ ఆటోలు కనిపించాయి. ఏంటిì .. ఏ పార్టీకి ఓటెయ్యాలనుకుంటున్నావ్‌ అని అడిగాం.

రామ్మోహన్‌కు ఓటేద్దామనుకుంటున్నాను అని బదులిచ్చారు. ఎందుకని అంటే ఆయన మంచోడయ్యా.. పేద వాళ్లకు చాలా మందికి ఏదో ఒక సాయం చేస్తున్నాడు. చాలా మందికి బడ్డి కొట్లు పెట్టించాడు. ఇస్త్రీ బండ్లు, పండ్ల బండ్లు, కూరగాయల బండ్లు ఇప్పించాడన్నాడు. దేవినేని అవినాష్‌ కూడా ఇస్తున్నాడు కదా అంటే ఇస్తున్నాడు కానీ ఆయన ఈ మధ్యనే కదా వచ్చింది. రామ్మోహన్‌ చాలా కాలం నుంచి ఇక్కడి వారికి సాయం చేస్తున్నాడు. అందుకే ఆయకు వేద్దమనుకుంటున్నా.. అన్నాడు.

ఇంతకూ మీదేవూరు అని అడిగితే ఉయ్యూరన్నాడు. ఇక్కడి ఎందుకొచ్చినట్లని మాట్లాడితే, ఇక్కడైతే ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతకొచ్చని వచ్చా. ఇదిగో ఈ షాపు అద్దెకు తీసుకున్నా. 20వేలు నెలకు కట్టాలి. ప్రస్తుతానికి పరవాలేదు, బాగనే ఉందన్నాడు.

ఆ పక్కనే చెట్టుకింద చెరుకు రసం బండితో ఒక అరవై ఏళ్ల మహిళ కనిపించింది. గ్లాసు ఎంతని అడిగాం. ఇరవై రూపాయలంది. ఇద్దరం చెరో గ్లాసు ఆర్డరిచ్చాం. అవి తాగుతూ ఆమెతో మాటలు కలిపాం. ఈ సారి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దామనుకుంటున్నావు అని అడిగాం. వైఎస్‌ జగన్‌కు వేద్దామని అనుకుంటున్నా అయ్యా అంది. ఎందుకని అడిగితే తాను ఒంటరి మహిళలనని, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఇంటికే వచ్చి ఇస్తున్నారు. ఇది వరకు అలా లేదు. పింఛన్‌ రాలేదు. సంక్షేమ పథకాలు ఇంటికి వచ్చేవి కాదు. జగన్‌ వచ్చినాక అన్నీ ఇంటి వద్దకే వస్తున్నాయి. మంగళగిరి వద్ద ఇంటి స్థలం కూడా ఇచ్చారు.

ఇవన్నీ మంచిగా చేస్తున్నారు కాబట్టి ఈ సారి జగన్‌కే ఓటేద్దామనుకుంటున్నా అంది. మరి గద్దె రామ్మోహన్‌ అందరికీ మంచి చేస్తున్నారంటగా అంటే అందరికీ మంచి చేస్తున్నాడు. ఆయనకు కూడా మంచి పేరే ఉంది. కాకపోతే ఈ సారి జగన్‌కు వేద్దామని అనుకుంటున్నా అని చెప్పింది. ఇక ఆమెకు రెండు చెరుకు రసం గ్లాసులకు గాను నలభై రూపాయలిచ్చేసే అక్కడ నుంచి బయలు దేరాం.

అక్కడి నుంచి నేరుగా పటమట మునిసిపల్‌ డివిజన్‌ కార్యాలయం అరటికాయల బండి వద్దకు వెళ్లి బాబాయ్‌ కాయలు డజన్‌ ఎంత? అని అడిగాం. యాభై రూపాయలన్నాడు. ఇంకేమి తక్కువకు రావా.. అంటే ఎండలకు ఒక్కరోజుకే కాయలు మాడిపోతున్నాయి. అందుకే తక్కువకే అమ్ముతున్నానన్నాడు. సరే ఒక డజన్‌ అరటిపళ్లు ఇవ్వమని చెబుతూ ఎన్నికల విశేషాలేంటి? ఏ పార్టీకి ఓటేద్దామనుకుంటున్నావని అడిగాం. ఇంకెవరికి రామ్మోహన్‌కు ఓటేస్తా.. అన్నాడు. ఏ మాత్రం తడుముకోకుండా చెప్పడంతో ఎందుకని ప్రశ్నించాం. ఎందుకంటే ఆయన పేదలకు సాయం చేస్తున్నాడు. సొంత డబ్బుతో చాలా మందికి తోపుడు బండ్లు కొనిచ్చాడు. ఎవరన్నా పేదవారు సాయం అడిగితే చేస్తున్నాడు. ఆయకు ఓటేస్తేనే మంచిది కదా అన్నాడు.

రామ్మోహన్‌ ఎప్పటి నుంచి తెలుసు అంటే పదేళ్ల నుంచి చూస్తున్నా. ఈసారి తెలుగుదేశం పార్టే వస్తుందని నిర్మొహమాటంగా చెప్పాడు. నువ్వెక్కడుంటావని ప్రశ్నిస్తే పక్కనే ఈ వీధిలోనే ఉంటానన్నాడు. నీపేరేంటని అడగ్గా నా పేరు శీను అన్నాడు. మేమెవరమో తెలుసా అంటే నాకు తెలియదన్నాడు. మరి రామ్మోహన్‌కు ఓటేస్తానంటున్నావని ఎవరైనా కొడితే ఎలాగని ప్రశ్నిస్తే ఎవరికీ అంత దమ్ములేదు. నేను కాపోడిని కమ్మోడైన రామ్మోహన్‌కు ఓటెయ్యోడం లేదా? మా బంధువులు ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉన్నారు. మార్కాపురంలో పోటీ చేసిన అన్నా రాంబాబు (వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, గిద్దలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే) కూడా ఓడిపోతాడని మా బంధువులు చెప్పారు. ఈ సారి టీడీపీనే వస్తుందన్నాడు. సరే పెద్దాయనా వస్తాం. అంటూ అక్కడి నుంచి బైక్‌ను బందర్‌రోడ్డు మీదుగా బెంజ్‌ సర్కిల్‌ నుంచి స్క్రూబ్రిడ్జి వద్దకు చేరుకున్నాం.

విజయవాడ తూర్పు నియోజక వర్గంలో ఎక్కువ మంది టీడీపీకి అనుకూలంగానే మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఈ గ్రౌండ్‌ రిపోర్టు ద్వారా తెలుస్తోంది.
గత చర్రిత ఇలా...
విజయవాడ తూర్పులో 1967 నుంచి ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు కాంగ్రెస్, టీడీపీ మూడు సార్లు, బీజేపీ ఒక సారి, ప్రజారాజ్యం పార్టీ ఒక సారి గెలిచాయి. తొలి సారి ఎన్నికల్లో విఎస్‌సీఆర్‌ తెన్నేటి కాంగ్రెస్‌ నుంచి గెలవగా 1983లో టీడీపీ నుంచి అడుసుమిల్లి జయప్రకాష్‌రావు గెలుపొందారు. వంగవీటి మోహన్‌ రంగా, ఆయన భార్య వంగవీటి రత్నకుమారి కూడా ఇక్కడ నుంచే గెలిచారు. బీజేపీ నుంచి ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు, ప్రజారాజ్యం పార్టీ నుంచి యలమంచిలి రవి గెలుపొందారు.

గత రెండు ఎన్నికల్లోను టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్‌రావు గెలుపొందారు. స్థానికుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. హంగూ ఆర్భాటం లేకుండా, సింపుల్‌గా వ్యవహరించడం, అందరిని కలుపుకొని ముందుకెళ్లడం ఆయన నైజం. అయితే వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న దేవినేని అవినాష్‌ తండ్రి దేవినేని నెహ్రూ 2009లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడి పోయినా నాడు జరిగిన త్రిముఖ పోటీలో 53,129 ఓట్లు సంపాదించుకున్నారు. ఈయనకు కూడా ఇక్కడ మంచి పట్టుంది. ఆయన రాజకీయ వారసుడిగా అవినాష్‌ను గత నాలుగేళ్లుగా పని చేసుకుంటూ పోతున్నారు. ఆయన కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గట్టెక్కుతారో అనేది వేచి చూడాలి.
Read More
Next Story