పవన్‌కి  కాపులతోనే.. పొగ
x
సీఎం జగన్

పవన్‌కి కాపులతోనే.. పొగ

ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న రీతిలోనే పవన్ కల్యాణ్‌ను కాపు సామాజిక వర్గం నేతలతోనే దెబ్బ కొట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ స్కెచ్ వేసిందా?


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: కలిసిరాని మిత్రుత్వం.. సీట్ల ఎంపికలో తడబాటు. చేతిని విడిచిన ఉద్యమ నేతలు, జారుకున్న సొంత పార్టీ నాయకులు. ఇవన్నీ కలిసి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పొగ పెడుతున్నాయి. వీటన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జనసేన పార్టీలో సెగలు రేపారు. దీంతో తాను పోటీ చేయాలని భావిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పరిస్థితి అయోమయంగా మారింది.

రాష్ట్రంలో టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి అనుకుంటున్న నియోజకవర్గం పిఠాపురం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే నియోజకవర్గం కడప జిల్లా పులివెందుల.. ఆయన తమ్ముడు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేసే కడప పార్లమెంటు స్థానంపై రాజకీయ పరిశీలకుల దృష్టి ప్రధానంగా ఉంది. సామాన్యుడు కూడా ఈ ముగ్గురి గురించే మాట్లాడుకుంటున్నారు. పిఠాపురంలో దాదాపు 2.40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కాపులు 95 వేల మంది, బీసీలు 90 వేల మంది, ఎస్సీలు 30 వేల మంది, మిగిలిన వారంతా ఇతర కులాలకు చెందిన వారే.

నిలకడ ఏది?

రాష్ట్రంలోని కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తాను తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో ఉంటానని ఒకసారి, బీజేపీ నేతలు సూచిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాననంటూ మరోసారి పవన్ కల్యాణ్ చెప్పడం జనసేన శ్రేణులను అయోమయానికి గురి చేశాయి. అంతేకాకుండా సీట్లు తీసుకోవడంలో కూడా విఫలమయ్యారని ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. అధికార పక్షానికి ఇదే విమర్శలకు అస్త్రంగా మారింది.

పొత్తులో డొల్లతనం..,!

టీడీపీ, జనసేన పొత్తులో జనసేనకు 40 నుంచి 60 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు భావించి చాలా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. పొత్తులో భాగంగా తొలుత 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు తమకు వచ్చినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించి, ఆ తర్వాత బీజేపీ పొత్తుతో అవి కాస్తా 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు తగ్గించుకున్నారు. " రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పొత్తులకు వెళ్లడంతో పాటు, సీట్లు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది" అని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో వివరణ ఇచ్చుకున్నారు. ఈ మాటల నేపథ్యంలో చాలా మంది జనసేన నాయకులు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా జీర్ణించుకోలేకపోయారు. జనసేన పార్టీతో పవన్ సామాజిక వర్గానికి చెందిన కాపులంతా ఏకతాటిపైకి వస్తారని భావించినప్పటికీ.. పరిస్థితి మొత్తం తిరగబడింది.

కాపు నేతలు దూరం

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సందిగ్ధావస్థ భరించలేని ఆ పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వరుసగా దూరమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కాలంలో అవమానాలు ఎదుర్కొని, టీడీపీ-జనసేన పొత్తును జీర్ణించుకోలేని స్థితిలో కిర్లంపూడికి చెందిన కాపు సామాజిక ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ఆయన కోవలో.. పవనను లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి చాలా మంది జనసేన, ప్రజారాజ్యం పార్టీ మాజీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎన్నికలు రాకముందే జనసేన నుంచి చాలా మంది పార్టీని వీడి, పవన్ కల్యాణ్‌కు షాక్ ఇచ్చారు.

సీటుపై తర్జనభర్జన

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పోటీ చేసే అంశంపైనా తర్జనభర్జన నెలకొంది. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేక కాకినాడ నుంచి ఎంపీగా బరిలో ఉంటారా? అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. అటు 2019లో రెండు చోట్ల పవన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2019 నాటి పరిస్థితిని తీసుకువచ్చే విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కెచ్ వేశారు.

కలసిరాని మిత్ర ధర్మం

టీడీపీ- బీజేపీ- జనసేన మిత్ర ధర్మం పిఠాపురం నియోజకవర్గంలో ఫలించలేదన్న విషయం స్పష్టం అవుతుంది. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన మద్దతు ధరలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే వర్మ అనుచర గణం టీడీపీ ప్రజా సామాగ్రిని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అవసరమైతే, తమ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ను పిఠాపురంలో పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ మాటలు టీడీపీ నేతల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది.

టీడీపీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే వర్మతో మాట్లాడిన తర్వాత ఆయన కాస్త స్వరం తగ్గించారు. పవన్ కల్యాణ్ మినహా ఎవరు పోటీ చేసినా తాను బరిలో నిలిచి తీరుతానని శర్మ తెగేసి చెప్పారు. టీడీపీ నుంచి వ్యక్తమవుతున్న నిరసనలు, వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎదురవుతున్న ఛాలెంజ్‌ల నేపథ్యంలో పవన్ కల్యాణ్.. పిఠాపురంలో అయోమయంలో ఉన్నారని భావిస్తున్నారు.

నిరుత్సాహంతో జంప్..

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో నిరుత్సాహానికి గురవుతున్న కాపు సామాజిక వర్గం నేతలు, జనసేన పార్టీ నాయకులు, ప్రజారాజ్యంలో పోటీ చేసిన వారు మెల్లగా జారుకుని అధికార వైఎస్ఆర్‌సీపీలో చేరిపోతున్నారు. పిఠాపురం జనసేన మాజీ ఇంచార్జ్ మాకినీడు శేషుకుమారి వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎంపీ వంగా గీతతో కలిసి ఆమె సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఇది ఒక రకంగా పిఠాపురంలో జనసేనకు చావు దెబ్బ లాంటిదని అంచనా వేస్తున్నారు.

ముల్లును ముల్లుతోనే తీయాలని.. వైఎస్ఆర్‌సీపీ స్కెచ్

ముల్లును ముల్లుతోనే తీయాలనేది ఓ సామెత. ఆ సూత్రాన్నే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పిఠాపురంలో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కుప్పం తర్వాత, జనసేన పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని చెబుతున్న పిఠాపురం నియోజకవర్గంపై కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీత ప్రజారాజ్యం పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె వైఎస్ఆర్‌సీపీలో చేరారు. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను రాజకీయంగా బదిలీ చేసి పిఠాపురం శాసనసభకు పోటీ చేయించేందుకు ఆమె అభ్యర్థిత్వాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

పిఠాపురంలో వైఎస్ఆర్‌సీపీ చక్రబంధం

రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గం తర్వాత పవన్ కల్యాణ్‌ని పోటీ చేస్తారని చెబుతున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా తమ వెంట వస్తున్న కాపు సామాజిక వర్గం నేతలతో పాటు మిగతా అన్ని వర్గాలను దరి చేర్చుకునే విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. ఇందుకోసం.. వైఎస్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, కడప జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి పిఠాపురం పట్టణ బాధ్యతలు, నియోజకవర్గ బాధ్యతలను ముద్రగడ పద్మనాభం, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

బీసీ పెద్దలకు వల

పిఠాపురం నియోజకవర్గాన్ని చుట్టుముట్టేలా కార్యాచరణ సిద్ధం చేసిన వైఎస్ఆర్‌సీపీ బీసీలు, ఉపకులాల వారీగా, ఎస్సీ సామాజిక వర్గ పెద్దల కోసం వైఎస్ఆర్‌సీపీ ప్రతినిధులు రంగంలోకి దిగినట్లు సమాచారం. కాపు ఓటర్లతో పాటు బీసీ, ఎస్సీ ఓటర్లపై దృష్టి పెట్టింది. బీసీలకు చెందిన పద్మశాలి, శెట్టి బలిజ, మత్స్యకారుల కోసం వైఎస్ఆర్‌సీపీ తన ప్రధాన నాయకులను రంగంలోకి దించడానికి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గాన్ని చుట్టుముట్టడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. నామినేషన్ల పర్వం ముగిశాక రాజకీయ వాతావరణం, ఫలితం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.Is Jagan Playing Kapu card Against Pawan In Pithapuram

Read More
Next Story