నాయకులు, కార్యకర్తలు సరిగా లేక పోతే సరి చేసుకోవచ్చు. కానీ ఆ పార్టీని నడిపించే అధినాయకుడే సరిగా లేక పోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. జగన్ పార్టీకి ఇదే జరిగిందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వన్‌టైమ్ వండరేనా లేక ఈ ఐదేళ్లల్లో పుంజుకొని వచ్చే ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని సంపాదించుకుంటుందా అనేది తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు, రానున్న కాలంలో ఆయన పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ పరిస్థితి ఏమిటి అనేది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో జగన్‌తో పాటు ఆయన పార్టీకి కష్టాలు తప్పవనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. గత ఐదేళ్లల్లో జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ శ్రేణులపై అరాచకాలు సృష్టించిందని, చంద్రబాబుతో సహా అచ్చెన్నాయుడు వంటి పలువురిపై కేసులు పెట్టి కావాలనే జైళ్లకు పంపి, కక్ష పూరితంగా వ్యవహరించిందనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. దీనికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బదులు తీర్చుకుంటుందని, జగన్ పార్టీని నామ రూపాల్లేకుండా చేస్తుందనే చర్చ కూడా టీడీపీ శ్రేణుల్లో సాగుతోంది.
నాడు కాంగ్రెస్‌తో విభేదించిన జగన్‌మోహన్‌రెడ్డి దాని నుంచి వైదొలగి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. 2011లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. నాటి నుంచి 2019 వరకు తన పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు కష్ట పడుతూ వచ్చారు. ఈ క్రమంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డే అధికారంలోకి వస్తారని చాలా మంది అంచనా వేశారు. కానీ 67 సీట్లతో ప్రతిపక్షం హోదా దక్కించుకున్నారు. తర్వాత పాద యాత్ర చేయడంతో పాటుగా నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పార పడుతూ ప్రజలకు చేరువయ్యారు. దీనికి తోడు ఒక సారి చాన్స్ ఇవ్వండి, టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు మేలు చేస్తానని నవరత్నాల హామీలు ఇవ్వడం వంటి కారణాలతో నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజలు భారీ ఎత్తున తిరస్కరించారు. ఊహించని రీతిలో జగన్‌కు పట్టం గట్టారు. జగన్‌మోహన్‌రెడ్డిని 151 స్థానాల్లో గెలిపించి అధికారంలో కూర్చో పెట్టారు.
నాడున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రభావం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగు కావడం, వైఎస్‌ఆర్ చరిష్మాతో పాటు జగన్‌కు ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనలకు ప్రజలు రావడంతో జగన్‌కు అధికారంలోకి రావడానికి దోహదం చేశాయి. దీంతో ఎన్నడు లేని విధంగా భారీ మెజారిటీతో జగన్‌కు అధికారాన్ని కట్టబెట్టారు.
అసలు కథ జగన్‌కు అధికారం వచ్చినాకే మొదలైంది. సీఎం పీఠమెక్కిన తర్వాత ఆకాశాన్ని చూడటం మొదలు పెట్టారు.ప్రజల్లో జగన్‌కు ఆదరణ పెరిగినా.. ఆ పార్టీకి చెందిన నాయకులు, నేతలు, ఇతర శ్రేణులు, అభిమానులు ఇలా అందరి కృషి వల్ల అధికారంలోకి వచ్చాము, వారిని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదు, వారికి సరైన గుర్తింపునిచ్చి గౌరవించాలని జగన్ స్థానంలో ఉన్న ఏ నేత అయినా ఆలోచనలు చేస్తారు. దానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకుంటూ, సమన్వయంతో ముందుకు వెళ్తారు. గతంలో వైఎస్‌ఆర్ అలానే చేశారు. చంద్రబాబు నాయుడు కూడా చేస్తూ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ వ్యవహార శైలిలో మార్పులు రావడం మొదలైంది. ఎన్నడు లేని విధంగా 151 సీట్లు రావడంతో తనను చూసే ప్రజలు గెలిపించారని, స్థానిక నేతలు కానీ, కార్యకర్తలను చూసి కానీ ఓట్లు వేయలేదనే ఆలోచనలకు వచ్చారు. దీంతో జగన్ తనకు తాను ఓ గొప్ప నాయకుడిగా భావించుకోడం, తనకు మించిన వారు ఎవరు లేరనే బ్రమల్లో మునిగి తేలుతూ వచ్చారు.
దీంతో ఒక్క సారిగా జగన్ వ్యవహార శైలిలో మార్పులు వచ్చాయి. నాటి నుంచి ప్రతి అంశంలో తన మాటే నెగ్గాలి, తక్కిన వారంతా తన మాటే వినాలనే ఆధిపత్య ధోరణిలోకి జగన్ వెళ్లి పోయారు. దీంతో జగన్ ఎవరిని కలిసేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఇదే విషయాలను ఆ పార్టీకి చెందిన ఒక నేత బహిరంగంగానే వెల్లడించారు. 2019లో విజయవాడ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పోట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్తే గతంలో మాదిరిగా జగన్ వ్యవహారం లేదని ఆధిపత్య ధోరణితో ఉన్నట్లు అనిపించిందని అప్పటి నుంచి అక్కడకు వెళ్లడం మానేశానని చెప్పడం గమనార్హం. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓటమికి ప్రధాన కారణం జగన్ వ్యవహార శైలేనని సీనియర్ జర్నలిస్టు చెరుకూరి మల్లికార్జునరావు అభిప్రాయపడ్డారు. చేతికొచ్చిన అవకాశాన్ని కాలితో తన్నుకున్నారని దిఫెడరల్ ఆంధ్రప్రదేశ్‌కు వివరించారు. కేవలం జగన్ వ్యవహార శైలి వల్లే 2024 ఎన్నికల్లో ఓడిపోయామని ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కరణం ధర్మశ్రీ వంటి నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
అయితే జగన్‌కు తొలి నుంచి ఇదే తరహా ఆలోచనలతోనే ఉండేవారనే టాక్ కూడా ఉంది. ప్రజల్లో ఉన్నంత సేపు ఒక రీతిగాను, నేతలు, కార్యకర్తలతో ఉన్నప్పుడు మరో రీతిగాను వ్యవహరించే వారనే టాక్ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. జగన్ వ్యవహార శైలి, అధికారంలో ఆయన అవలంభించిన విధానాలు నియంతృత్వ ధోరణితోనే సాగాయని సీపీఐ రాష్ట్ర నేత జి ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు పాదయాత్రతో ప్రజల మధ్య ఉండి, అధికారం వచ్చిన వెంటనే ఆయన స్వరూపం మార్చుకున్నారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను కలవక పోవడం, రాజులాగ వ్యవహరించడంతో ప్రజలు ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం చేశారు. దాని నుంచి గుణపాఠం నేర్చు కోవాలి. ఆయన ఆలోచన ధోరణి మారాలి. ప్రజలతో మమేకమవుతూ, ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలబడాలి. అప్పుడే జగన్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
జగన్ పార్టీ పెట్టిన కొత్తల్లో ప్రముఖ సీనీనటులు జీవితా రాజశేఖర్‌లు ఆ పార్టీలో చేరి ఆయనతో కొంత కాలం నడిచారు. ఆ సమయంలో నిర్వహించిన సభలకు జీవితా రాజశేఖర్‌లను చూసేందుకు జనాలు వస్తున్నారని, వారి వైపే ఆకర్షితులవుతున్నారని భావించిన జగన్ వారికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించారని, అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగానే వెల్లడించారు. నిజమైన కాంగ్రెస్ వాది అయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పేరుతో జగన్ అధికారంలోకి రాగలిగారని, ఈ సారి మాత్రం జగన్‌ను ప్రజలు నమ్మలేదని, ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ అభిప్రాయపడ్డారు.
ఈ రకమైన హైహ్యాండెడ్‌నెస్ మెంటాలిటీ కారణంగా పార్టీ కోసం కష్ట పడిపని చేసిన నేతలు, కార్యకర్తలు జగన్‌కు దూరమయ్యారనే టాక్ కూడా ఉంది. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసినా నేటికీ జగన్ వ్యవహార శైలిలో ఎలాంటి మార్పులు లేవని, ఇలాంటి వాతావరణంలో పార్టీని నమ్ముకొని నేతలు కానీ, కార్యకర్తలు కానీ మెలగడం కష్టంగానే ఉంటుందనే విమర్శలు స్వపక్షంలోనే వినిపిస్తున్నాయి. కేవలం జగన్ నిరంకుశ, ఆధిపత్య ధోరణి వల్లే ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని కాపాడుకోలేక పోయారని, భవిష్యత్‌లో కూడా జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పడం కష్టమేనని, ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం వన్‌టైమ్ వండరే అని టాక్ అటు ఆ పార్టీ నేతలు, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Next Story