కొడాలి నానీ సేఫ్ గేమ్..ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పటికైతే వైసీపీలోనే!
x

కొడాలి నానీ సేఫ్ గేమ్..ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పటికైతే వైసీపీలోనే!

కొడాలి నానీ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోందని ఆయనంటే గిట్టని వారు అనవచ్చు గాని ఆయనకు ఇంతకు మించి మార్గం లేదన్న వాదనా బలంగానే వినిపిస్తోంది.


దెబ్బ మీద దెబ్బ తగులుతున్న వైసీపీకి ఇది కొంత ఊరటే. వైసీపీలో మరో కీలక వికెట్ పడిపోనుందని, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరు పార్టీని వీడుతున్నారంటూ వచ్చిన వార్తల్ని కాదంటూ తాను పార్టీలోనే ఉంటానన్నారు మాజీ మంత్రి కొడాలి నానీ. మొత్తం మీద ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోందని నానీ అంటే గిట్టని వారు అనవచ్చు గాని ఆయనకు ఇంతకు మించి మార్గం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ ను వీడే ప్రసక్తే లేదని భీష్మ ప్రతిజ్ఞలు చేసిన వారిలో ఒక్కొక్కరు వీడిపోతున్న నేపథ్యంలో కోస్తా ప్రాంతానికి చెందిన ఓ మాజీ మంత్రి వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని, జనవరి 25 తర్వాత కొడాలి నానీ పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం సాగింది.
ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేశారు. తాజాగా వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.. తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. విజయసాయిరెడ్డి బాటలోనే మాజీ మంత్రి కొడాలి నాని కూడా జనవరి 25 తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ఓ ట్వీట్ వైరల్ అయింది. కొందరు ఈ ట్వీట్ స్క్రీన్ షాట్‌ను వైరల్ చేశారు. ఇది నిజమైంది కాదని కొడాలి నానీ అనుచరవర్గం చెప్పినా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇది నిజమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చాలామంది భావించారు. ఎవరైతే పార్టీని వీడరని అనుకున్నారో వాళ్లే బయటకు వెళ్లిపోతున్నందున కొడాలి అనుచరుల వాదనను కూడా కవరప్ లో భాగమనుకున్నారు.
అయితే సరిగ్గా ఈ సమయంలోనే కొడాలి నానీ నుంచే ఓ ట్వీట్ వచ్చింది. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తల్ని ఖండించారు. తన పేరిట వైరల్ అయిన ట్వీట్ ఫేక్ అంటూ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
ఫేక్ ట్వీట్ లో ఏముందంటే...
'నా ఆరోగ్యం కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను.. జనవరి 25 తర్వాత వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయబోతున్నాను.. నన్ను ఎంతోగానో ఆదరించిన గుడివాడ ప్రజలకు కృత‌జ్ఞ‌త‌లు తెలియచేస్తున్నాను' అంటూ మాజీ మంత్రి కొడాలి నాని పేరిట ట్వీట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. జనవరి 24 శుక్రవారం సాయంత్రం 7 గంటల 35 నిమిషాలకు ఈ పోస్ట్ ప్రత్యక్షమైంది. ఈ పోస్టు ఒక్కసారిగా గందరగోళానికి గురి చేసింది. కొడాలి నాని అభిమానులు ఆందోళన చెందారు. అయితే వెంటనే ఈ పోస్టుపై కొడాలి నాని స్పందించారు. ఇది ఫేక్ అని వెల్లడించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మవద్దు అని సూచించారు. ఇలాంటి ఎడిటెడ్ ఫేక్ న్యూస్‌ని దయచేసి ఎవరూ నమ్మవద్దు అని మాజీమంత్రి కొడాలి నాని ఎక్స్ వేదికగా అలర్ట్ చేశారు.
తాను వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలనే వార్తలు కూడా అవాస్తవమని తేల్చి చెప్పారు. తనపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని కొడాలి నాని ఫేక్ న్యూస్ గా అభివర్ణించారు. ఇది ఎడిటెడ్ న్యూస్ అని, ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టించవచ్చని కొడాలి నాని ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో ఆయన పార్టీ మారతారంటూ వచ్చిన వార్తలు నిజం కాదని తేలడంతో వైసీపీ వర్గాలు కూడా ఊపిరి పీల్చాయి. ఫేక్ ట్వీట్ లో పేర్కొన్న తేదీ కూడా దాటిపోయింది. అయినా కొడాలి నానీ పార్టీ మారలేదంటే ఇకపై ఆయన వైఖరిలోనూ మార్పు ఉండదనేది స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఆయన పార్టీ మారినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. టీడీపీలో, జనసేనలోకి వెళ్లడం కష్టమే. వెళితే బీజేపీలోకి వెళ్లాలి. ఆ పార్టీలోకి వెళ్లడం కన్నా వైసీపీలో ఉండడమే మేలన్నది ఆయన అనుచరుల మాట. అధికారంలో లేనప్పుడు ప్రజలు కూడా పట్టించుకోరు. అటువంటప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండి సాధించేది ఉండదు. పార్టీ మారి చెడ్డపేరు తెచ్చుకునే కన్నా యధాతథస్థితి కొనసాగించడమే మేలన్నది ఆయన శ్రేయోభిలాషులు చెబుతున్న ముచ్చట. ఇది వైసీపీ నాయకత్వానికి కాస్తంత ఊరట కలిగించే విషయం.
Read More
Next Story